ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషిస్తున్న జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేటుతో విజయం సాధించిన జనసేన.. దాదాపు 14 నెలలుగా పార్టీ పరమైన కార్యక్రమాల నిర్వహణలో వెనకబడిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో మిత్రపక్షాలు టీడీపీ, బీజేపీ పార్టీపరమైన కార్యక్రమాలతో దూకుడు చూపుతున్నాయి. దీంతో జనసేన కూడా పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ చేయాల్సిన సమయం ఆసన్నమైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు జనసేన నుంచి బయటకు వెళ్లిన నేతలు ఇప్పుడు మళ్లీ పార్టీవైపు తిరిగి చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా విశాఖ పార్లమెంటు నుంచి పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇప్పుడు జనసేనలోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది.
2019లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన విశాఖ లోక్‌సభ స్థానం నుంచి మాజీ జేడీ లక్ష్మీనారాయణను రంగంలోకి దింపింది. అప్పట్లో ఆ నియోజకవర్గ పరిధిలో గాజువాక నుంచి ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ పోటీ చేశారు. ఈ ఇద్దరూ అగ్ర నాయకులే కావడంతో ఆయా స్థానాల్లో గట్టిపోటీ ఇచ్చారు. అయితే టీడీపీతో పొత్తు లేకపోవడం వల్ల ఇద్దరూ ఓటమి చెందారు. లోక్‌సభ స్థానంలో దాదాపు లక్ష ఓట్లు తెచ్చుకున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీ అభ్యర్థి, సినీ నటుడు బాలయ్య చిన్న అల్లుడు శ్రీభరత్ ఓటమి కారణమయ్యారు. ఇదంతా గతం అయితే.. ఆ ఎన్నికల తర్వాత మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన నుంచి బయటకు వచ్చారు. కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి వ్యవసాయం చేసుకున్న ఆయన.. గత ఎన్నికల ముందు సొంత పార్టీని ప్రారంభించారు. జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లో మార్పులు తెస్తానని ప్రకటించారు.
2019 ఎన్నికల్లో లక్ష ఓట్లు సాధించిన లక్ష్మీనారాయణ.. 2024 ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. తాను పోటీ చేసిన స్థానంతోపాటు పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు కూడా ఎక్కడా కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ఇక ఎన్నికల తర్వాత రాజకీయాలను వదిలేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం టీవీ చానల్స్ లో నిర్వహించే డిబేట్లలో వక్తగా కనిపిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై తన విశ్లేషణలను పంచుకుంటున్నారు. అయితే మాజీ సీఎం జగన్ ను అరెస్టు చేసిన పోలీసు అధికారిగా ఆయనకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉన్నాయి. ఆయన నిజాయితీని ఇప్పటికీ తటస్థులు మెచ్చుకుంటున్నారు. ఇదే సమయంలో జనసేనాని పవన్ సైతం నిజాయితీకి అధిక ప్రాధాన్యమిస్తున్నారని చెబుతున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తన జట్టులో మచ్చలేని అధికారులనే చేర్చుకున్నారు. ఇదే సమయంలో ఆయన పూర్తిగా అధికారిక విధుల్లో బిజీ అయిపోవడం వల్ల పార్టీని నడపడంలో కొందరిపై ఆధారపడాల్సివస్తోందని చెబుతున్నారు. అయితే పవన్ స్థాయిలో ఇమేజ్ ఉన్నవారు, సరైన నిర్ణయాలు తీసుకుని, వాటిని అమలు చేసే సామర్థ్యం ఉన్నవారు తక్కువగా ఉండటంతో తన రాజకీయ బృందంలో కొత్తవారిని చేర్చుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ సమయంలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ కోసం చర్చ జరుగుతోందని అంటున్నారు. జనసేనలో ప్రస్తుతం పవన్ తోపాటు ఆయన సోదరుడు నాగబాబు, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ యాక్టివ్ గా ఉన్నారు. వీరు నలుగురూ కూడా ప్రభుత్వ బాధ్యతలతోపాటు పార్టీకి సమయం కేటాయించలేకపోతున్నారని అంటున్నారు. పవన్, మనోహర్, దుర్గేశ్ మంత్రులుగా ఉండగా, నాగబాబు వృత్తి రీత్యా ఎక్కువగా హైదరాబాదులో ఉంటున్నారని చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో పార్టీని నడపడంలో కొంతమేర తడబాటు కనిపిస్తోందని అంటున్నారు. ఈ కారణంగానే కూటమిలో టీడీపీ ‘తొలి అడుగులో సుపరిపాలన’ అనే కార్యక్రమం చేపట్టినా జనసేన మాత్రం ఆ తరహా కార్యక్రమాలు చేపట్టలేకపోతోందని అంటున్నారు. దీంతో జేడీ లక్ష్మీనారాయణ వంటి వారిని తిరిగి పార్టీలో చేర్చుకుని పార్టీ బాధ్యతలను అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మాజీ జేడీ లక్ష్మీనారాయణ సైతం ఇటీవల కాలంలో జనసేనాని పవన్ కల్యాణ్ పనితీరుపై సమయం దొరికినప్పుడల్లా ప్రశంసలు కురిపిస్తూ తాను తిరిగి వచ్చేందుకు రెడీ అన్న సంకేతాలు పంపుతున్నట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మాజీ జేడీ తిరిగి జనసేనలోకి రావాలంటే ఆయన ప్రారంభించిన జై భారత్ నేషనల్ పార్టీని జనసేనలో విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించాల్సివుందని అంటున్నారు. అయితే ప్రస్తుతం జనసేన, జేడీ మధ్య సానుకూల వాతావరణం ఉన్నా, ఇది చర్చల వరకు వెళ్లలేదని చెబుతున్నారు.