జేడీ లక్ష్మీ నారాయణ అంటే అందరికీ తెలుసు. వీవీ లక్ష్మీనారాయణ అంటే ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఆయన ఒంటి పేరు వీవీ. అధికారిక హోదా కలిగిన జేడీయే అసలు పేరుగా స్థిరపడిపోయింది. సీబీఐలో సమర్ధవంతమైన అధికారిగా వ్యవహరించిన జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేయాలని ఎంతో ఉత్సాహపడ్డారు. అందుకే తన పదవీ విరమణకు ఎంతో కాలం ఉన్నా చేతిలో ఎంతో సర్వీసు ఉన్నా కూడా కేవలం 53 ఏళ్ళకే స్వచ్చంద పదవీ విరమణ చేసి రాజకీయ అరంగేట్రం చేశారు.
ఆయన 2019లో తొలిసారి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు. జనసేన నుంచి ఆయన పోటీ పడితే ఏకంగా రెండు లక్షల ఎనభై వేల దాకా ఓట్లు వచ్చాయి. ఇందులో జేడీని ఆరాధించి అభిమానిచిన యువత ఓటేసింది. అలాగే పవన్ కళ్యాణ్ ని అభిమానించే వారు కూడా తోడు అయి అంత భారీ ఎత్తున ఓట్లు దక్కాయి. అయితే జేడీ జనసేనలో కొనసాగి ఉండాల్సింది అని అంటారు. కానీ ఓటమి తరువాత ఆయన పార్టీకి రాజీనామా చేయడం ఆ మీదట 2024 ఎన్నికలకు ముందు జ భారత్ నేషనల్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేయడం ఇవన్నీ రాజకీయంగా చేసిన కొన్ని ఇబ్బందికరమైన నిర్ణయాలుగానే అంతా చూస్తూ వచ్చారు. 2024 ఎన్నికల్లో తన సొంత పార్టీ మీద విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేస్తే జేడీ బాగా వెనకబడిపోయారు.
అయితే ఓటమి తరువాత కొన్నాళ్ళ పాటు విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద తన నిరసనను ఉద్యమాన్ని చేసిన జేడీ క్రమేణా విశాఖకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఆయన వర్తమాన రాజకీయాన్ని రాజకీయ పార్టీల మనోగతాన్ని అర్ధం చేసుకుని ఆ విధంగా తన రాజకీయాన్ని మలచుకోవడానికే ఈ గ్యాప్ తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఆయన వచ్చే ఎన్నికల కోసం కూడా భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు అని అంటున్నారు. ఆయన టార్గెట్ అయితే విశాఖ నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టాలని. అది 2019లో జరగలేదు, ఆ ముచ్చట 2029లో తీర్చుకోవాలని జేడీ చాలా గట్టిగానే భావిస్తున్నారు అని అంటున్నారు.
ఇక జేడీ ఏ రాజకీయ పార్టీలో చేరుతారు అన్నది మరో చర్చ. నిజానికి చూస్తే ఆయన ఇపుడు ఏ రాజకీయ పార్టీని విమర్శించడం లేదు అన్ని పార్టీల పట్ల పాజిటివ్ గానే ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. అదే సమయంలో అన్ని అవకాశాలూ ఓపెన్ చేసి పెట్టుకున్నారు అని అంటున్నారు 2029 నాటికి మారే రాజకీయాన్ని గమనంలోకి తీసుకోవడం ద్వారా ఆయన ఏదో ఒక బలమైన రాజకీయ పార్టీలో చేరడం ద్వారా విశాఖ ఎంపీగా పోటీ చేసి కచ్చితంగా నెగ్గాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇంతకీ జేడీ ఏ పార్టీ అంటే ఎవరూ ఇపుడు చెప్పలేరు, అయితే ఆయన సొంత రాజకీయం సొంత పార్టీ కధ మాత్రం ఇక మీదట ఉండకపోవచ్చు అని పవర్ ఫుల్ పార్టీలోనే చేరడం ద్వారా తన ఆకాంక్షను నెరవేర్చుకుంటారు అని అంటున్నారు. అది జాతీయ పార్టీనా లేక ప్రాంతీయ పార్టీనా అంటే ఇప్పటికైతే సస్పెన్స్ అని అంటున్నారు. చూడాలి మరి జేడీ అడుగులు ఎటు పడతాయో ఆయన రాజకీయం రూట్ ఏ వైపు సాగుతుందో.


















