టాలీవుడ్ సినీ నటి మాధవీలత వర్సెస్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ల మధ్య ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. జేసీపై మాధవీలత విమర్శలు చేయడం…ఆ తర్వాత మాధవీ లతపై జేసీ అభ్యంతరకర కామెంట్లు చేయడం వివాదానికి దారి తీసింది.
అయితే, ఆ తర్వాత ఒకరికి ఒకరు సారీ చెప్పడంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. అయితే, ఈ సారి కూడా నూతన సంవత్సరం సందర్భంగా జేసీ వేడుకలు నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే మాధవీలతనే చీఫ్ గెస్ట్ గా పిలవబోతున్నామని జేసీ చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది.
గతంలో మాధవీలత తమపై అభాండాలు వేశారని జేసీ అన్నారు. కానీ, ఆ తర్వాత మాధవీ లత, తాము కాంప్రమైజ్ అయ్యామని చెప్పారు. తాను మాధవీలతకు సారీ చెప్పానని, తనకు ఆమె సారీ చెప్పిందని అన్నారు. అందుకే ఈ సారి ఆమెను చీఫ్ గెస్ట్ గా పిలిచామని, వస్తుందో లేదో తెలీదని అన్నారు. మరి, మాధవీలత వస్తారా…లేదా అన్నది తేలాల్సి ఉంది.
మహిళలకు మాత్రమే అంటూ…జేసీ ప్రభాకర్ రెడ్డి గత ఏడాది న్యూ ఈయర్ సందర్భంగా ఒక ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్ కు వెళ్లి వచ్చే మహిళలకు ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అంటూ మాధవీలత చేసిన వ్యాఖ్యలు జేసీకి కోపం తెప్పించాయి. దీంతో, మాధవీలతను ఉద్దేశించి అసభ్యకరమైన కామెంట్స్ చేశారు జేసీ.












