భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పాకిస్థాన్ సైన్యం కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీనాయక్ అమరుడయ్యారు. సత్యసాయి జిల్లాకు చెందిన మురళీనాయక్ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు. మురళీనాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వారు ప్రకటించారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు. మురళీ స్వగ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. డ్రోన్లు, యుద్ధ విమానాలను మనదేశం పైకి ప్రయోగించింది. వీటిని మన సైనిక బలగాలు ఎక్కడికక్కడ కూల్చేశాయి. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్
అమరుడయ్యారు. మురళీనాయక్‌ది సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండా.. శనివారం ఆయన పార్థివ దేహం సొంత ఊరికి తీసుకురానున్నారు. మురళీ నాయక్ మరణంతో తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతీ బాయిలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
జమ్మూకశ్మీర్ సరిహద్దులో జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళి నాయక్ (25) మరణించారు.
”జమ్మూకశ్మీర్ బోర్డర్‌లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మురళికి తూటా తగలడంతో చనిపోయాడని ఆర్మీ అధికారి ఫోన్ చేసి చెప్పారు” అని మురళి నాయక్ తండ్రి శ్రీరాం నాయక్ చెప్పారు.మురళి స్వస్థలం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కళ్ళి తాండ. ఆయన మరణంతో కుటుంబంతో పాటు సొంత ఊరిలో విషాదఛాయలు అలముకున్నాయి.మురళి నాయక్ చిన్నతనంలోనే ఆయన తల్లిదండ్రులు ముంబయికి వలస వెళ్లారు. దీంతో మురళి తన అమ్మమ్మ ఊరైన సోమందేపల్లి మండలం నాగినాయని చెరువు తండాలో పెరిగారు.సోమందేపల్లిలోని విజ్ఞాన్ పాఠశాలలో చదివారు. అనంతపురంలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఆర్మీలో ఉద్యోగం సాధించారు.2022 నవంబర్‌లో మురళి సైన్యంలో చేరాడని ఆయన తండ్రి శ్రీరాం నాయక్ చెప్పారు.మహారాష్ట్ర నాసిక్‌లో ఆర్మీ శిక్షణ తీసుకున్నాడని, అనంతరం అస్సాంలో మొదటి పోస్టింగ్ ఇచ్చారని తెలిపారు. సంవత్సరం తర్వాత మురళిని జమ్మూకు మార్చారని శ్రీరాం నాయక్ చెప్పారు.
”ఉదయం 9 గంటలకు సమాచారం వచ్చింది. అక్కడి నుంచి ఒక ఆఫీసర్ ఫోన్ చేసి, హిందీలో మాట్లాడారు. జమ్మూకశ్మీర్ బోర్డర్‌లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మురళికి తూటా తగలడంతో చనిపోయాడని చెప్పారు” అని శ్రీరాం నాయక్ అన్నారు.”మేం ముంబయిలో ఉండే వాళ్లం, మూడు నెలల ముందు మురళి ఇంటికి వచ్చాడు. ఒక 20 రోజులుండి తిరిగి డ్యూటీకి వెళ్లాడు” అన్నారు.”నా కొడుకు దేశం కోసం పోరాడాడు, నాకు ఒకటే కొడుకు, అతనిపైనే ఆధారపడి ఉన్నాం. ఇపుడు లేడు. నేను, నా భార్య అనాథలయ్యాం. మాకు ఏం న్యాయం చేస్తారనేది దేశానికే వదిలేస్తున్నా” అని శ్రీరాం నాయక్ అన్నారు.
”నేను కోరేది ఒకటే, జిల్లాలో నా కొడుకు విగ్రహం పెట్టాలి. అతనికి ఎవరైనా సెల్యూట్ కొడుతున్నప్పుడు నేను చూసి ఆనందపడతా. అదే నా కోరిక” అని ఆయన అన్నారు.మొన్న మాట్లాడాడు, వీడియో కాల్ చేశాడు. ఏమ్మా బాగున్నారా, భోజనం చేశారా అని అడిగాడు. ఒక్కడే కొడుకు.. వెళ్లిపోయాడు” అంటూ మురళి తల్లి జ్యోతీ బాయి కన్నీరు పెట్టుకున్నారు.మురళి మృతదేహం శనివారం సొంత ఊరికి తీసుకురానున్నారు.
జవాన్ మురళి నాయక్ మృతిపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు.
‘దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శాసనసభ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్‌కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.మురళి కుటుంబంతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు.మురళి నాయక్ పార్థివ దేహానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామని మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా తెలిపారు. ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.మురళి నాయక్ స్వగ్రామమైన కల్లి తండాకు వెళ్లి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ. మురళి కుటుంబానికి రూ. ఐదు లక్షల చెక్కును అందజేశారు.