‘జటాధర’ మూవీ రివ్యూ నటీనటులు: సుధీర్ బాబు- సోనాక్షి సిన్హా- దివ్య ఖోస్లా- శిల్పా శిరోద్కర్- ఇందిర కృష్ణ- రవి ప్రకాష్- ఝాన్సీ- రాజీవ్ కనకాల- అవసరాల శ్రీనివాస్- రోహిత్ పాఠక్ తదితరులు సంగీతం: రాజీవ్ రాజ్ ఛాయాగ్రహణం: సమీర్ కళ్యాణి మాటలు: సాయికృష్ణ- శ్యామ్ బాబు కథ- స్క్రీన్ ప్లే: వెంకట్ కళ్యాణ్ నిర్మాతలు: ఉమేశ్ కుమార్ బన్సాల్- శివిన్ నారంగ్- అరుణ అగర్వాల్- ప్రేరణ అరోరా- శిల్ప సింఘాల్- నిఖిల్ నంద దర్శకత్వం: వెంకట్ కళ్యాణ్- అభిషేక్ జైస్వాల్ చాలా ఏళ్లుగా హిట్టు కోసం నిరీక్షిస్తున్నాడు సుధీర్ బాబు. హరోంహర.. మా నాన్న సూపర్ స్టార్ మంచి సినిమాలే అయినా ఆడలేదు. ఇప్పుడతను హిందీ తార సోనాక్షి సిన్హాతో కలిసి ‘జటాధర’ అనే పాన్ ఇండియా మూవీ చేశాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రమైనా సుధీర్ కోరుకున్న విజయాన్ని అందించేలా ఉందా? తెలుసుకుందాం పదండి. కథ: శివ (సుధీర్ బాబు) ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే.. తన అభిరుచి మేరకు దెయ్యాల వేటలో తిరుగుతుంటాడు. దెయ్యాలన్నవి లేవు అని రుజువు చేయాలన్నది అతడి సంకల్పం. అతనా ప్రయత్నంలో ఉండగా.. ఒక కల అతణ్ని తరచుగా వెంటాడుతూ ఉంటుంది. ఆ కల వెనుక పెద్ద కథే ఉందని.. తనను మృత్యువు వెంటాడుతోందని.. ఆ మృత్యువే ధన పిశాచి అని అతడికి తర్వాత అర్థమవుతుంది. ఇంతకీ శివ గతమేంటి.. అతడికి ధన పిశాచికి సంబంధమేంటి.. తనకు ఎదురైన గండాన్ని అతనెలా తప్పించుకున్నాడు అన్నది మిగతా కథ. కథనం-విశ్లేషణ: సుధీర్ బాబు ఇప్పటిదాకా 20 దాకా సినిమాలు చేశాడు. అందులో కొన్ని హిట్లున్నాయి. చాలా ఫ్లాపులు ఉన్నాయి. ఫ్లాప్ అయిన సినిమాల్లోనూ కొన్నయినా మంచి సీన్లు ఉండుంటాయి. హైలైట్ అని చెప్పుకోదగ్గ అంశాలుంటాయి. కానీ ‘జటాధర’లో భూతద్దం పెట్టి వెతికినా మంచి అంశాలంటూ ఏమీ కనిపించవు. ఆరంభ సన్నివేశం నుంచి చివరి వరకు ఒక్క పాజిటివ్ అంశం లేకుండా సాగిపోయిన చిత్రంగా సుధీర్ బాబు కెరీర్లో ఈ చిత్రం నిలిచిపోతుంది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా కథల ఎంపికలో తనకంటూ ఒక అభిరుచిని ఉందని చాటుకున్న సుధీర్.. ‘జటాధర’ లాంటి సినిమాను ఎలా చేశాడన్నది ఎంత ఆలోచించినా అంతుబట్టని విషయం. తొలి సన్నివేశం మొదలు చివరి వరకు ప్రేక్షకులకు అంతగా అసహనానికి గురి చేస్తుంది ‘జటాధర’. చాలా ఏళ్లుగా సరైన హిట్టు లేదు సుధీర్ బాబుకు. తన చివరి రెండు చిత్రాలైన మా నాన్న సూపర్ హీరో.. హరోం హర విషయం ఉన్నవే. కానీ ఎంతో ఇష్టపడి కష్టపడి చేసిన ఆ సినిమాలు ఆడకపోయేసరికి ఒక డెస్పరేషన్లో ‘జటాధర’ చేసినట్లున్నాడు సుధీర్. ఇప్పుడు దేవుడు-దుష్టశక్తి అనగానే జనం థియేటర్లకు పరుగులు పెట్టేస్తున్నారు కాబట్టి.. ఆ రెండు ఎలిమెంట్స్ పెట్టి ఏం తీసినా చెల్లిపోతుందనే భ్రమతో ‘జటాధర’ తీసినట్లున్నారు మేకర్స్. సుధీర్ కూడా వాళ్లను గుడ్డిగా నమ్మేసి స్క్రిప్టు.. మేకింగ్ గురించి పెద్దగా పట్టించుకోకుండా ఈ సినిమా చేసి ఉండాలి. లేదంటే ఒక దశా దిశా లేకుండా.. అసలు పర్పస్ ఏంటో అర్థం కాకుండా సాగే ఈ సినిమాను అతను ఎలా నమ్మి చేశాడో మరి. జటాధర ఎలాంటి సినిమానో చెప్పడానికి ముందు టైటిల్ దగ్గర మొదలుపెట్టాలి. జటాధర అంటే శివుడి మరో పేరు. మరి శివుడికి సినిమాకు ఏం సబంధం అంటే ఏమీ ఉండదు. చివర్లో దైవశక్తితో హీరో విలన్ని చంపడం ట్రెండు కాబట్టి.. ఓ ఐదు నిమిషాలు ఆ దేవుడి దర్శనం ఉంటుంది తప్పితే కథలో ఇంకెక్కడా శివుడి ప్రస్తావన ఉండదు. మరి ఏ ఉద్దేశంతో ఈ టైటిల్ పెట్టారో అర్థం కాదు.
మామూలుగా తెరపై దయ్యాలను చూస్తే భయం పుట్టాలి. కానీ ఇందులో మాత్రం సోనాక్షి చేసిన ధన పిశాచి అవతారం.. తన హావభావాలు చూస్తే ముందుగా నవ్వు వస్తుంది. తర్వాత చికాకు పుడుతుంది. అంత సిల్లీగా తీర్చిదిద్దారు ఆ పాత్రను. సోనాక్షి కూడా తనేం చేస్తున్నానో అర్థం కానట్లుగా చాలా పేలవంగా నటించిందా పాత్రలో. అసలు ఈ కథలో ఈ పాత్ర ఎందుకుందో.. తన ఉద్దేశం ఏంటో కూడా అర్థం కాని విధంగా అత్యంత పేలవంగా తయారు చేసి పెట్టారు ఆ పాత్రను. ధన పిశాచి అంటే ఏంటో… అదెందుకు ఒక ఇంట్లో ఉందో.. అదెందుకు మనుషులను చంపుతుందో కూడా సరిగా చూపించలేదు. దీనికి తోడు సోనాక్షి అవతారం.. తన హావభావాలు చూస్తే కలిగే విచిత్రమైన ఫీలింగ్ మధ్య సినిమాను భరించడం అన్నది శక్తికి మించిన పనే. సినిమాలో మిగతా ఎపిసోడ్లన్నీ ఒకెత్తయితే.. ద్వితీయార్ధం మొత్తాన్ని ఆక్రమించేస్తూ.. ఎంతకీ తెగని విధంగా.. సుదీర్ఘంగా.. ప్రేక్షకులకు చుక్కలు చూపిస్తూ సాగే ఫ్లాష్ బ్యాక్ మరో ఎత్తు. అదంతా అయ్యాక కూడా థియేటర్లలో కూర్చోవడం అంటే సాహసమే. ఇక క్లైమాక్సుతో మాస్టర్ స్ట్రోకే ఇచ్చింది ‘జటాధర’ టీం. మొత్తం సినిమాలో ఏదైనా ఒక పాజిటివ్ ఉందంటే.. ఈ కథాకథనాలతో.. మిగతా నటీనటులతో తనకేం పట్టదన్నట్లు సుధీర్ బాబు ఇచ్చిన సిన్సియర్ పెర్ఫామెన్స్ మాత్రమే. కానీ తన కోసం ఈ టార్చర్ ను భరించడం మాత్రం చాలా చాలా కష్టం. నటీనటులు: ఇలాంటి సినిమా కోసం సుధీర్ బాబు బెస్ట్ లుక్ లోకి మారి ఎంతో కష్టపడ్డాడు. తెర మీద ఆ కష్టం కనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో అతను చాలా ఎఫర్ట్ పెట్టాడు. కానీ అదంతా బూడిదలో పోసిన పన్నీరే. లుక్.. యాక్టింగ్ వరకు సుధీర్ బాబును అభినందించవచ్చు కానీ.. ఇలాంటి సినిమాల ఎంపికలో తన జడ్జిమెంట్ ను మాత్రం హర్షించలేం. సినిమాలో అతను తప్ప మిగతా ప్రధాన పాత్రధారులందరూ తమ నటనతో ఇబ్బంది పెట్టారు. ధన పిశాచిగా సోనాక్షి సిన్హాను భరించడం చాలా చాలా కష్టం. సినిమాకు తన పాత్ర.. నటనే అతి పెద్ద మైనస్. నిన్నటితరం హీరోయిన్ దివ్య ఖోస్లాను ఏరి కోరి ఈ సినిమా కోసం ఎందుకు ఎంచుకున్నారో. తన లుక్.. యాక్టింగ్ పేలవం. శిల్పా శిరోద్కర్ నటన కూడా భరించలేని విధంగా సాగింది. దాదాపుగా ప్రతి ముఖ్య పాత్రధారీ ఓవరాక్షనే చేశారిందులో. తాము అసలేం చేస్తున్నామో తెలియని అయోమయంలోనే వాళ్లంతా ఇలా నటించి ఉండొచ్చు. అందుకు వాళ్లను తప్పుబట్టలేం. సాంకేతిక వర్గం: పిండికొద్దీ రొట్టె అన్నట్లు ఈ సినిమాలో సాంకేతిక నిపుణులు కూడా.. సినిమాకు తగ్గ ఔట్ పుటే ఇచ్చారు. పాటలు.. నేపథ్య సంగీతంలో ఏ ప్రత్యేకతా లేదు. సన్నివేశాలతో సంబంధం లేకుండా సాగే ఆర్ఆర్ ప్రేక్షకులను కొన్ని చోట్ల అయోమయానికి గురి చేస్తుంది. ఛాయాగ్రహణం కూడా ఇలాగే సాగింది. నిర్మాణ విలువలు పేలవం. సీరియల్ స్థాయి ఔట్ పుట్ కనిపిస్తుంది. ఒక కథకుడు.. ఇద్దరు డైలాగ్ రైటర్లు.. ఇద్దరు దర్శకులు కలిసి తీర్చిదిద్దిన సినిమాలో వారి ప్రతిభ గురించి మాట్లాడ్డానికి ఏమీ లేదు.
రేటింగ్-2/5
















