సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ఒక డిబేట్ జరుగుతోంది. అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ కు తెలుగులో గ్లామర్ హీరోయిన్ పాత్రలే ఇస్తున్నారని, దేవర పెద్దిలో ఎక్కువ స్కిన్ షోనే కనిపించిందని, ఇలా అయితే తనలో బెస్ట్ నటిని చూసే అవకాశం ఎలా దక్కుతుందని ఒక వర్గం చర్చిస్తోంది. అయితే ఇక్కడో ముఖ్యమైన లాజిక్ మిస్సవుతున్నారు. ఇప్పటి జనరేషన్ జాన్వీని ప్రత్యేకంగా పెర్ఫార్మన్స్ కోసం చూడాలనుకోవడం లేదు. ఎందుకంటే టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించేటప్పుడు అలాంటి స్కోప్ అరుదుగా దక్కుతుంది. అందుకే రష్మిక మందన్న గర్ల్ ఫ్రెండ్ లాంటి స్టోరీ ఓరియెంటెడ్ మూవీ చేసింది.
కానీ జాన్వీ కపూర్ కు సౌత్ లో అలా సాధ్యం కాదు. ఆ మాటకొస్తే తన నటనను ఋజువు చేసుకునే సినిమాలు ఆమె హిందీలో చాలానే చేసింది. గుంజన్ సక్సేనా, మిలి లాంటివి క్రిటిక్స్ ని మెప్పించాయి కానీ కమర్షియల్ గా ఫెయిల్యూర్ గానే నిలిచాయి. కొన్ని ఓటిటిలో నేరుగా రిలీజైనా దర్శకత్వ లోపాల వల్ల నెగటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నాయి. అక్కడే చూడనప్పుడు తెలుగులో తన నటనను ఆవిష్కరించడం కోసం డబ్బులు పెట్టే నిర్మాతలు ఎక్కడి నుంచి వస్తారు. అసలు సమస్య తల్లి శ్రీదేవితో పోల్చడం దగ్గర వస్తోంది. కానీ అప్పటి ఇప్పటి పరిస్థితులకు నక్కకు నాగలోకంకు ఉన్నంత తేడా ఉంది.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్స్ పక్కన జోడిగా నటిస్తున్నప్పుడు ఇంత కన్నా లెన్త్, స్కోప్ దొరకదు. అంతెందుకు ఆర్ఆర్ఆర్ లో అలియా భట్ ఎంతసేపు కనిపిస్తుందని టైం కౌంట్ చేస్తే మహా అయితే పావు గంట దాటదు. కానీ అది రాజమౌళి మూవీ కాబట్టి ఈ క్యాలికులేషన్లు పని చేయవు. అందరూ జక్కన్నలు కారుగా. అందుకే జాన్వీ కపూర్ నుంచి ఇప్పటికైతే పెర్ఫార్మన్స్ గట్రా ఆశించకుండా చూసి ఎంజాయ్ చేయడమొకటే ఫ్యాన్స్ చేయగలిగింది. భవిష్యత్తులో ఎవరైనా దర్శక నిర్మాతలు తనను సోలో లీడ్ గా పెట్టి ఏదైనా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ తీసే ధైర్యం చేస్తే అప్పుడా కోరిక తీరుతుంది.


















