జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మౌనంగా ఉంటున్నారు. అది ఇటీవల ఒకటి రెండు బహిరంగ కార్యక్రమాలలో వెల్లడైంది. మంత్రివర్గ సమావేశంలో ముభావంగా ఉన్న పవన్ తాజాగా విజయవాడలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో పధకం ప్రారంభ కార్యక్రమంలో మౌనంగానే వ్యవహరించారు. ఆయన తన ప్రసంగంలో సహజ శైలికి భిన్నంగా నెమ్మదిగానే మాట్లాడారు. అంతే కాదు క్లుప్తంగా ముగించేశారు. తన మనోభావాలు ఏమిటి అన్నది వ్యక్తం చేయకుండానే జాగ్రత్త పడ్డారు అని అంటున్నారు.
అయితే చంద్రబాబు లోకేష్ మాట్లాడినపుడు మాత్రం ఏ దశలోనూ పవన్ తల ఎత్తి చూడలేదు. పూర్తి మౌనంతో నేల చూపులే చూస్తూ ఉండిపోయారు. ఆయనను చంద్రబాబు పొగిడారు. ఓజీ సినిమా చూశారా అని ఆటో డ్రైవర్లను అడిగి మరీ పవన్ ని హుషారు చేయాలని చూశారు ఇక లోకేష్ తన ప్రసంగంలో పవన్ అన్న అంటూ సంభోదిస్తూ ప్రసంగించారు. ఇలా బాబు లోకేష్ పవన్ గురించి బాగా మాట్లాడినా ప్రశంసించినా ఆయన మాత్రం తల ఎత్తి చూడలేదు సరికదా నేల చూపులే చూస్తూ ఇబ్బందిగా కదులుతూ గడిపారు అని అంటున్నారు. ఇదంతా టీవీలలో మొత్తం లైవ్ లో టెలికాస్ట్ అయినపుడు అంతా చూశారు. ఆ తరువాత కూడా వీడియోలలో ఉంది.
అయితే పవన్ ఈ విధంగా మౌనం వహించడం అంతా అసెంబ్లీలో బాలయ్య ఎపిసోడ్ తోనే జరిగింది అని అంటున్నారు. తాను ప్రాణప్రదంగా ఆరాధించే తండ్రి సమానునిగా చూసే మెగాస్టార్ చిరంజీవి విషయంలో బాలయ్య అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు అని అంటున్నారు. అంతే కాదు అసెంబ్లీలో బాలయ్య వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. చంద్రబాబు స్వయంగా వచ్చి హైదరాబాద్ లోని పవన్ నివాసంలో ఆయనను పరామర్శించారు. అయినా సరే పవన్ లో మాత్రం ఆగ్రహం చల్లారడం లేదని అంటున్నారు. దానికి కారణం బాలయ్య చేత కనీస వివరణ ఇప్పించే ప్రయత్నం టీడీపీ అధినాయకత్వం చేయకపోవడమే అని అంటున్నారు.
ఇదిలా ఉంటే పవన్ తన మనో వేదనను కొందరు సన్నిహితులతో పంచుకున్నట్లుగా చెబుతున్నారు. తాను పంటి బిగువున అన్ని భరిస్తున్నాను అని ఆయన అన్నట్లుగా చెబుతున్నారు. కూటమి ఐక్యత కోసం అలాగే మరోసారి జగన్ అధికారంలోకి రాకుండా చూడడం కోసం తాను అన్నీ తగ్గి అడుగులు వేస్తూంటే దానికి టీడీపీకి చెందిన వారు కొందరు తేలికగా తీసుకుంటున్నారని పవన్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లుగా ప్రచారం సాగుతోంది. రాష్ట్రం ముఖ్యమనుకుని తాను దేనినీ పట్టించుకోవడం లేదని ఆయన అన్నట్లుగా చెబుతున్నారు.
తాను మంచితనంగా ఉంటే అది చేతగానితనంగా చూస్తున్నారా అన్న బాధ ఆగ్రహం కూడా ఆయనలో వ్యక్తం అవుతోంది అని అంటున్నారు. తన మంచితనం తనకూ పార్టీకి శాపంగా మారుతోందా అన్న ఆవేదన కూడా ఆయన వ్యక్తం చేశారని అంటున్నారు. పదవుల దగ్గర నుంచి ఏ విషయంలోనూ తాను ఎపుడూ డిమాండ్ చేయకుండా సర్దుకునిపోతున్నా కూడా ఈ రకమైన స్పందన రావడమేంటి అని ఆయన వాపోతున్నారని అంటున్నారు.
ఇక తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో కూడా టీడీపీనే ఎదురు నిలిచి ఇబ్బందులు పెడుతోంది అన్నది కూడా ఆయన ఆవేదనగా ఉంది అంటున్నారు. వైసీపీ కంటే టీడీపీతోనే అక్కడ పోరాడాల్సి వస్తోంది అని జనసేన నేతలు చెబుతున్నారని అంటున్నారు. ఇలా పవన్ అయితే నిర్వేదంతో ఉన్నారని అంటున్నారు. ఆయనలో దాగిన ఈ ఆవేదన తగిన సమయంలో బయటపడి బద్ధలవుతుందా లేక ఈ లోగా కూటమిలో సర్దుబాట్లూ దిద్దుబాట్లూ జరుగుతాయా అన్నది అయితే చర్చగా ఉంది. ఏది ఏమైనా బాలయ్య అసెంబ్లీ ఎపిసోడ్ అయితే కూటమిలో చిచ్చు రాజేసింది అని అంటున్నారు. మరి అది ఆరుతుందా లేక రాజుకుంటూ ఇలాగే రగిలి ఏదో రోజు మంట రేపుతుందా అన్నది కాలమే చెప్పాలని అంటున్నారు.