జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలలో రాటు తేలుతున్నారు. 2024 ఎన్నికల్లో అధికారంలో ఉంటామని ఆయన చెబుతూ ఉంటే ఎవరూ నమ్మేవారు కాదు, కానీ జరిగింది చూస్తే ప్రత్యర్ధులకు దిమ్మ దిరిగి బొమ్మ కనిపించింది. ఇక 21 సీట్లకు 21ని సాధించిన పవన్ తన పార్టీని ఇపుడు విస్తరించే పనిలో పడ్డారు. అందుకు గానూ ఆయన ఒక సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను రచించారు.
రాష్ట్రవ్యాప్తంగా జనసేన బలోపేతం కోసం పవన్ స్ట్రాటజీని రెడీ చేశారు. జనసేనకు పవన్ కాకుండా 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా తలో అయిదు నియోజకవర్గాలను తమ సొంత నియోజకవర్గంతో పాటు తీసుకుని అక్కడ జనసేన పార్టీ పటిష్టతతో పాటు సంస్థాగతంగా పార్టీకి జవసత్వాలు అందించేలా చూడాలని కోరారు. అంతే కాకుండా జనసేన ఎంపీలు కూడా ఇదే విధంగా చేయాలని దిశా నిర్దేశం చేశారు. దీని వల్ల పార్టీ వందకు పైగా నియోజకవర్గాలలో బలపడుతుందని జనసేన భావిస్తున్నారు.
జనవాణి పేరుతో ఆయన అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజలలో మమేకం కావాలని పవన్ కోరారు. నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు అంతే కాకుండా వివిధ వర్గాల ప్రజానీకంతో కలసి పనిచేయాలని పార్టీ విధానాలను వారికి వివరించడం ద్వారా మరింత దగ్గర కావాలని సూచించారు.
ప్రతీ అయిదేళ్ళకూ కొత్త ఓటర్లు వస్తారు, అలాగే యువత కూడా మారుతుంది. వారి అభిరుచులు అభిప్రాయాలను అన్నీ తెలుసుకోవాలని పవన్ కోరారు నవతరంతో కలసిపోతే వారి ఆలోచనలు వారి ఆకాంక్షలు అన్నీ కూడా అవగాహనకు వస్తాయని అన్నారు. అలా రేపటి తరాన్ని యువతను కూడా పార్టీతో కలుపుకుంటూ ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయని పవన్ సూచించారు.
ఇక కూటమిలోని మిగిలిన పార్టీలతో కలసి మెలసి పనిచేయాలని అసలైన సందేశాన్ని పవన్ ఇచ్చారు. విభేదాలు వద్దని ఒక కో ఆర్డినేషన్ తో అంతా ఒక్కటిగా ఉంటూ పార్టీని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుని వెళ్లాలని పవన్ కోరారు. నామినేటెడ్ పదవుల విషయంలో కూడా అందరికీ అవకాశాలు వస్తాయని ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని పవన్ చెప్పుకొచ్చారు. మొత్తానికి కూటమితో ఎక్కడా చెడకుండా జనసేన నాయకులు మసలుకోవాలని అంతే కాకుండా పార్టీని వీలైనంత వరకూ చాప కింద నీరు మాదిరిగా విస్తరిస్తూ పోవాలని పవన్ దిశా నిర్దేశం చేసినట్లుగా భావిస్తున్నారు వంద అసెంబ్లీ నియోజకవర్గాలను పవన్ జనసేన తరఫున టార్గెట్ చేశారు అని అంటున్నారు. చూడాలి మరి జనసేన విస్తరణ కార్యక్రమాలు ఏ విధంగా దూకుడుగా ముందుకు సాగుతాయో.