జనసేనలో ఇపుడు గ్రౌండ్ లెవెల్ లో నాయకులు క్యాడర్ మధన పడుతున్నారు. అని ప్రచారం అయితే సాగుతోంది. తమ మాట పార్టీ అధినాయకులు వినాలని వారు కోరుతున్నారు. అయితే తాము పార్టీ బాగు కోసమే అంతా చెబుతున్నామని తాము చెప్పినది వినకపోతే ఎలా అని గుస్సా అవుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది జనసేన కృషి దాని వెనక చాలా ఉంది. అందుకు గానూ ప్రభుత్వంలో జనసేనకు కీలక పాత్ర దక్కింది. పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనతో పాటు మరో ఇరవై మంది ఎమ్మెల్యేలు కూడా నెగ్గారు.
ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాకూడదు అన్నది పవన్ కళ్యాణ్ లక్ష్యం. ఈ విషయంలో ఆయన ఎక్కడా రాజీ పడడం లేదు. అవసరం అయితే ఒకటికి రెండు సార్లు తాను తగ్గుతున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్ లో సీన్ వేరేగా ఉంది తాము ఎందుకు అధికారంలో ఉన్నామో అర్థం కావడం లేదని ఎమ్మెల్యేలు కూడా కొందరు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. పేరుకు ఎమ్మెల్యేలుగా ఉన్నా ఆ నియోజకవర్గంలో అసలైన అధికారం మాత్రం టీడీపీ నేతలే చలాయిస్తున్నారు అని వాపోతున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని అంటున్నారు.
ఇదిలా ఉంటే విశాఖ పర్యటనకు వచ్చిన నాగబాబు పార్టీ వాదులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన మహిళా కార్పోరేటర్ ఒకరు తమ పనులు ఏవీ వార్డులో కావడం లేదని నాగబాబు దృష్టికి తెచ్చారు. ఇక తమ వెంట ఉన్న పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఏ విధంగానూ న్యాయం చేయలేకపోతున్నామని కూడా చెప్పారు. అయితే ఆమె మాట్లాడుతూండగానే మైక్ కట్ అయింది దాంతో ఆమె అసంతృప్తి చెందారు. ఆమె భర్త పార్టీ నాయకుడు లేచి మాట్లాడుతూ గ్రౌండ్ లెవెల్ లో విషయం వివరించారు. టీడీపీ గురించి ఆయన చెప్పాలని చూసినా నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అని చెబుతున్నారు. ఉంటే పార్టీలో ఉండండి లేకపోతే లేదు అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారని అంటున్నారు.
నిజానికి చూస్తే గ్రౌండ్ లెవెల్ లో పనులు ఎలా చేయించుకోవాలో జనసేన నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలకే తెలియడం లేదు అని అంటున్నారు. టీడీపీలో సీనియర్లు ఉన్నారు. వారికి పలుకుబడి ఉంది. దాంతో వారి హవాయే సాగుతోంది. అధికారులు కూడా వారి మాటనే వింటున్నారని అంటున్నారు. ఇక కార్పోరేటర్ స్థాయిలో కూడా ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు. అయితే ఎవరైనా నోరు ఎత్తి టీడీపీని విమర్శిస్తే వైసీపీ వారే ఇలా చేయిస్తున్నారు అన్న అనుమానం పెద్దలలో కలుగుతోందని అందుకే వారి మీద తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారని అంటున్నారు.
పార్టీ వేదికల మీదనే కదా కష్టాలు అయినా సమస్యలు అయినా చెప్పుకునేది అని అంటున్నారు తమ సమస్యలు విని అందులో నిజాలు గమనించి పరిష్కరిస్తే క్యాడర్ కి లీడర్ కి ఉత్సాహం వస్తుంది అని అంటున్నారు. అలా కాకుండా నోరు ఎత్తవద్దు అని అంటూంటే అది మరింత ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు. పార్టీ నాయకులు చెబుతున్న విషయాల మీద పెద్దలు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. కూటమితో సహకారంతోనూ కో ఆర్డినేషన్ తోనూ జనసేన నేతలు వ్యవహరిస్తున్నారు అని వారు అంటున్నారు అయితే ఆ వైపు నుంచి కూడా సహకారం తగిన విధంగా వచ్చేలా చూడాలని కోరుతున్నారుట. మరి జనసేనలో బడబాగ్నిలా అసంతృప్తి ఉందా అంటే కాలమే జవాబు చెప్పాలి.