జనం మధ్యకు వచ్చినప్పుడు అభిమానులకు అత్యంత సమీపానికి వెళ్లటం.. వారితో కలిసిపోయేందుకు ప్రయత్నించటం.. ఈ సందర్భంగా చోటు చేసుకునే హడావుడి.. మొత్తంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీదకు వచ్చిన సందర్భంగా సినిమాటిక్ సీన్లకు కొదవ ఉండదు. ఆయన మీద అభిమానాన్ని చూపించే గణం చేసే హడావుడి ఎంతన్నది అందరికి తెలిసిందే. పబ్లిక్ లో ఉన్నప్పుడు ఎంతో చొరవను ప్రదర్శించే వైసీపీ అధినేత.. తన సొంత నియోజకవర్గానికి పర్యటనగా వచ్చిన వేళ.. నాయకులు తనను కలిసేందుకు వస్తే.. వారికి వీఐపీ పాసులు జారీ చేసి.. అవి ఉన్న వారిని మాత్రమే జగన్ ను కలిసేలా చేసిన ఏర్పాటు పార్టీ నేతల్ని కంగుతినేలా చేసింది.
దివంగత మహానేత వైఎస్ వర్థంతి సందర్భంగా పులివెందులకు వచ్చారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన్ను కలిసేందుకు పార్టీ నేతలు.. స్థానిక నేతలు.. ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే.. జగన్ ను కలిసేందుకు వీలుగా ఆయన సిబ్బంది వీఐపీ పాసులు జారీ చేయటం హాట్ టాపిక్ గా మారింది. ప్రజాజీవితంలో ఉన్నోళ్లు ఎవరైనా.. తమను కలిసేందుకు వచ్చే విజిటర్స్ కు పాసులు జారీ చేసి కలిసింది ఉండదు.
అందుకు భిన్నంగా పాసులు జారీ చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. జగన్ ను పార్టీకి చెందిన పలువురు నేతలు కలుసుకున్నారు. ఇక.. స్థానిక నేతలు కలిసిన సందర్భంలో ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమిపై అసంత్రప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు ప్రతి కూలంగా రావటం వెనుక చోటు చేసుకున్న అంశాలపై ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
పులివెందులలో పార్టీ ఓటమికి మించిన అవమానం ఇంకేమైనా ఉంటుందా?అని జిల్లా పార్టీ నేతల వద్ద అసహనం వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. జగన్ సిబ్బంది వీఐపీ పాసులు జారీ చేయటంతో.. అవి ఉన్న వారిని మాత్రమే సిబ్బంది అనుమతించారు.దీంతో.. ఈ పాసుల జారీపై పార్టీ నేతలు.. కార్యకర్తలు.. సానుభూతిపరులు విస్తుపోతున్న పరిస్థితి. తమ అభిమాన నేతను కలిసేందుకు పాసుల జారీ ఏమిటి? అంటూ కొందరు అసహనాన్ని వ్యక్తం చేయటమే కాదు.. వాగ్వాదానికి దిగటం కనిపించింది. మొత్తంగా అధినేతగా వ్యవహరిస్తున్న జగన్.. కొత్త కల్చర్ కు తెర తీశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.