చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం లేకుండా ఉండటమంటే దీన్నే చెప్పాలి. ఆంధ్రోళ్ల అదృష్టమో ఇంకేమో కానీ.. ఏపీని పాలించే ముఖ్యమంత్రి ఎవరైనా సరే.. చేతిలో పవర్ ఉంటే ఆంధ్రాలో ఉండటం.. అది కాస్తా లేకుంటే ఏపీలో లేకుకండా పోవటం ఒక అలవాటుగా మారింది. విభజన జరిగి పుష్కరమవుతోంది. అయినా.. పరిస్థితుల్లో మార్పు రాని దుస్థితి. ఆంధ్రోళ్లకు ఇంతకు మించిన దౌర్బాగ్యం ఇంకేం ఉంటుంది. తాము పాలించిన రాష్ట్రంలో ఉండకుండా వేరే రాష్ట్రంలో ఉండకపోవటం దేనికి నిదర్శనం?
తమ చేతిలో అధికారం ఉన్నా లేకున్నా రాష్ట్రంలోనే ఉండాలన్న ధ్యాస లేకుండా.. అధికారం చేజారినంతనే మకాంను ఏపీకి దూరంగా ఉండే మహానగరాల్లో ఉండిపోవటం ఒక అలవాటుగా మారింది. 2014 నుంచి ఇదే పరిస్థితి. తమ చేతిలో పవర్ ఉన్నా లేకున్నా.. ఏపీ ప్రజల చెంతనే తామున్నామన్న భావన కలిగించే విషయంలో అటు జగన్మోహన్ రెడ్డి.. ఇటు చంద్రబాబు ఇద్దరు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.
2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న జగన్.. ఓటమి తర్వాత నుంచి బెంగళూరులోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు చుట్టం చూపుగా ఏపీకి వచ్చి వెళుతున్నారు. తాజాగా తాను ప్రాతినిధ్యం వహించే పులివెందుల నియోజకవర్గానికి వచ్చిన ఆయన మూడు రోజులపాటు ఉన్నారు. గురువారం సాయంత్రం తిరిగి బెంగళూరులోని తన నివాసానికి వెళ్లిపోయారు. తాను ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి విపక్షనేత చంద్రబాబును ఉద్దేశించి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తరచూ వేలెత్తి చూపేవారు.
విపక్ష నేత రాష్ట్రంలో ఉండరని.. చుట్టం చూపుగా ఏపీకి వచ్చి పోతారని.. హైదరాబాద్ లోనే ఉంటారని ఎద్దేవా చేసేవారు. అప్పట్లో చంద్రబాబును ఉద్దేశించి అన్ని మాటలన్న జగన్.. ఇప్పుడు తానేం చేస్తున్నట్లు? అన్నది ప్రశ్న. 2014 రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తే.. వైసీపీ పరాజయాన్ని మూటగట్టుకుంది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్.. బెంగళూరులోనే ఎక్కువగా ఉండేవారు. ఏపీలో తక్కువగా ఉండేవారు. 2019 ఎన్నికలకు కాస్త ముందుకు వచ్చేసరికి అమరావతిలో సొంతింటిని కట్టుకున్న ఆయన అక్కడకు షిప్టు అయినట్లుగా పేర్కొన్నారు.
2019లో బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఐదేళ్లు ఆయన అమరావతిలోనే ఉండేవారు. అప్పుడు విపక్ష నేతగా ఉండే చంద్రబాబు ఏపీలో ఉండకుండా హైదరాబాద్ లో ఉండేవారు. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా అదే పరిస్థితి. అయితే.. 2024 ఎన్నికల నాటికి పవన్ కల్యాణ్.. జగన్మోహన్ రెడ్డిలు ఇద్దరు అమరావతి ప్రాంతంలో సొంతింటిని నిర్మించుకున్నారు. విపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అమరావతిలో సొంతిల్లు ఉంచుకొని కూడా ఎక్కువ సమయం బెంగళూరులో ఉండటం దేనికి నిదర్శనం?
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇద్దరూ వారాంతం అయితే చాలు హైదరాబాద్ కువెళ్లిపోతున్న పరిస్థితి. అధినేత ఎవరైనా సరే.. ఏపీ ఒక గెస్టు హౌస్ మాదిరే ఉంటోంది తప్పించి.. వారికి సొంతిల్లు మాదిరి ఉండట్లేదు. ఈ పరిస్థితిని రాజకీయ అధినేతలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి ఎన్నికలకు ముందు.. పార్టీ అధినేతలు తమ పార్టీ పవర్ లోకి వస్తే తామిచ్చే వరాల చిట్టాను విప్పుతారు. అందులో తాము అధికారంలో ఉన్నా..లేకున్నా ఏపీలోనే ఉంటాం తప్పించి.. టూరిస్టుల మాదిరి హైదరాబాదో.. బెంగళూరుకు వెళ్లమన్న హామీ ఉండేలా ఆంధ్రోళ్లు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది.


















