రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్‌లో ఉన్న మహిళానాయకురాలు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత.. సుంకర పద్మశ్రీ.. జనసేన తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆమెకు జనసేన నుంచి కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెబుతున్నారు.
వాస్తవానికి ఆది నుంచి కూడా కాంగ్రెస్‌లో ఉన్న సుంకర పద్మశ్రీ.. ఇటీవల కాలంలో ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత.. పద్మశ్రీకి ప్రాధాన్యం తగ్గింది. తనకు రాష్ట్ర పార్టీ చీఫ్ పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్నా.. పద్మశ్రీకి అవకాశం దక్కలేదు. దీనికితోడు.. ఆమెకు ప్రాధాన్యం తగ్గించారన్న వాదనతో పార్టీకి దూరంగా ఉంటున్నారు. మరోవైపు.. షర్మిల, మాణిక్కం ఠాకూర్‌లు.. టికెట్లు అమ్ముకున్నారని.. గత ఎన్నికలకు ముంద ఆరోపించారు. దీంతో సుంకర వివాదం తారస్తాయికి చేరడంతో పద్మశ్రీ సహా పలువురిపై పార్టీ సస్పెన్షన్ విధించింది.
ఇలా.. అనేక పరిణామాల నేపథ్యంలో సుంకర పద్మశ్రీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. వాస్తవానికి ఆమె టీడీపీలో చేరతారన్న ప్రచారం కూడా తెరమీదికి వచ్చింది. ఇదిలావుంటే.. తాజాగా జనసేన పార్టీలోకి ఆమె చేరుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి.. గన్నవరం నుంచి పోటీ చేయాలని ఉత్సాహంగా ఉన్న పద్మశ్రీ.. తరచుగా నియోజకవర్గం సమస్యలపైనా దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె గత ఎన్నికల్లోనే పోటీకి ప్రయత్నించారు. వచ్చే ఎన్నికల నాటికి.. ఆమె ఎట్టి పరిస్తితిలోనూ పోటీ చేయాలని భావిస్తున్నారు.
ప్రస్తుతం జనసేన కూడా మహిళా నాయకులకు పెద్ద పీట వేయాలని భావిస్తోంది. వచ్చే రెండు మూడు మాసాల్లో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నిర్ణయించుకున్న దరిమిలా.. చేరికలకు అవకాశం కల్పిస్తోంది. అయితే.. వైసీపీ కంటే కూడా.. ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సుంకరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతుండడం గమనార్హం. అన్నీ అనుకున్నట్టు జరిగితే..సుంకర పద్మశ్రీ.. పార్టీ మార్పు ఈ నెలలోనే ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.


















