దక్షిణాసియా భద్రతా సమీకరణంలో ప్రతిసారి కొత్త పుట రాసేది ఆయుధాల కొనుగోళ్లే. ఇటీవల “ఆపరేషన్ సిందూర్”లో భారత వాయుసేన వినియోగించిన ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థ పాకిస్తాన్‌లో సృష్టించిన భయాందోళన ఇప్పటికీ తగ్గలేదు. ఇప్పుడు అదే వ్యవస్థకు మరిన్ని యూనిట్ల కొనుగోళ్లు జరగవచ్చనే సమాచారం ఇస్లామాబాద్‌లో మరోసారి ఆందోళన రేకెత్తిస్తోంది. రష్యా రక్షణ రంగాధికారులు భారత్‌తో అదనపు డెలివరీలపై చర్చలు జరుగుతున్నది. ఈ సమాచారం బయటకు రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఈ పరిణామంలో ప్రధానంగా రెండు అంశాలు స్పష్టమవుతున్నాయి. మొదటిది, భారత్ తన భద్రతా అవసరాల్లో ఎటువంటి రాజీ పడదని, అమెరికా వంటి పాశ్చాత్య ఒత్తిళ్లను పట్టించుకోదని. రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ కూడా ఈ విషయాన్ని బహిరంగంగానే అంగీకరించింది. రెండో విషయం, పాకిస్తాన్ వైమానిక శక్తి ఇప్పటికీ రక్షణాత్మక మోడ్‌లోనే ఉన్నదని. ఆపరేషన్ సిందూర్ సమయంలోనే ఎఫ్–16 జెట్లు సురక్షిత ప్రాంతాలకు తరలించడమే ఇందుకు ఉదాహరణ.
భారత్–రష్యా సంబంధాలు కేవలం కొనుగోళ్లకే పరిమితం కావడం లేదు. ట్యాంకులు, యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు, రైఫిల్స్ నుంచి బ్రహ్మోస్ క్షిపణుల వరకు అనేక ఉత్పత్తులు భారత్‌లోనే తయారు అవుతున్నాయి. దీని వలన సాంకేతిక స్వావలంబన బలోపేతం అవుతూనే, అంతర్జాతీయ మార్కెట్లో భారత్ ప్రాధాన్యత పెరుగుతోంది.
ఎస్–400 వ్యవస్థ ప్రత్యేకత దాని దూరప్రయోగ సామర్థ్యం. 400 కిలోమీటర్ల రేంజ్‌లో లక్ష్యాన్ని ఛేదించే ఈ టెక్నాలజీ ప్రపంచంలోనే చాలా అరుదైనది. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఈ సామర్థ్యం ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. ఇక భారత్ మరిన్ని యూనిట్లు పొందితే, పాక్ వాయుసేనపై ఒత్తిడి మరింతగా పెరగడం ఖాయం.
మొత్తం మీద, ఈ పరిణామం కేవలం ఆయుధాల లావాదేవీలే పరిమితం కావడం లేదు. ప్రాంతీయ శక్తి సమీకరణాలపై నేరుగా ప్రభావం చూపే అంశం. అందుకే పాక్ కనుకు తీయడం కూడా గగనమే.