పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా పాకిస్థాన్ భారత విమానాల గగనతల ప్రవేశాన్ని నిషేధించిన నేపథ్యంలో, భారత్ కూడా పాక్ ఎయిర్‌లైన్లపై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు గగనతలాన్ని మూసివేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం.ప్రస్తుతం పాక్ విమానాలు సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్ వంటి దేశాలకు వెళ్లాలంటే భారత గగనతలాన్ని దాటాల్సి వస్తుంది. భారత్ నిషేధం విధిస్తే, పాక్ విమానాలకు ప్రయాణ దూరం పెరగడం ఖాయం. దీంతో నిర్వహణ వ్యయాలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు ఇది మరింత భారంగా మారే అవకాశం ఉందని విమానయాన నిపుణులు చెబుతున్నారు.
ఇక భారత్‌పై గగనతల నిషేధం విధించిన పాకిస్థాన్ ఇప్పటికే పెద్ద నష్టం చవిచూస్తోంది. వారానికి 800 పైగా అంతర్జాతీయ విమానాలు పాకిస్థాన్ గగనతలాన్ని ఉపయోగించేవి. ఓవర్‌ఫ్లైట్ ఛార్జీల కింద రోజుకు సుమారు 1.20 లక్షల డాలర్లు పాక్ సంపాదించేది. ప్రస్తుతం ఈ మొత్తం నష్టంగా మారిపోతోంది.భారత్ కూడా పాక్ విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తే, ఆ దేశ విమానయాన రంగానికి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. మరోవైపు, పాక్ విమానాలకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం చైనా లేదా శ్రీలంక గగనతలాలను ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఇది ప్రయాణ సమయం పెరిగే పరిస్థితి తీసుకురాగలదు. మొత్తానికి పహల్గామ్ ఘటన అనంతర పరిణామాలు రెండు దేశాల గగనతల రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. కేంద్రం తీసుకోబోయే తుది నిర్ణయం పాక్ ఎయిర్‌లైన్లకు గట్టి గుణపాఠం నేర్పించేలా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారత్, పాకిస్థాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో టర్కీపై వచ్చిన ఆరోపణలపై తాజాగా స్పందన వచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాలు సైనిక మోహరింపులు చేపట్టడంతో టర్కీ నుంచి పాకిస్థాన్‌కు ఆయుధాలు తరలించినట్టు పలు కథనాలు వెలువడ్డాయి.వార్తల ప్రకారం, ఆరు టర్కీ సి-130ఇ హెర్క్యులస్ విమానాలు కరాచీలో దిగాయని ప్రచారం జరిగింది. వీటిలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నట్లు కథనాలు పేర్కొన్నాయి. దీంతో టర్కీ పాకిస్థాన్‌కు మద్దతు పలుకుతోందని భావన నెలకొంది. అయితే, ఈ ఆరోపణలను టర్కీ ప్రభుత్వం ఘాటుగా ఖండించింది.
టర్కీ అధికారిక సమాచారం ప్రకారం, తమ కార్గో విమానం కేవలం ఇంధనం నింపుకోవడానికి మాత్రమే కరాచీలో ఆగిందని తెలిపారు. పాకిస్థాన్‌కు ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయలేదని స్పష్టంగా ప్రకటించారు. మీడియా కథనాల్లో నిజం లేదని టర్కిష్ అధికారిక వర్గాలు తమ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాయి.టర్కీ, పాకిస్థాన్ మధ్య ఉన్న వ్యూహాత్మక బంధం ఇప్పటికే తెలిసిందే. గతంలోనూ కశ్మీర్ అంశంపై పాకిస్థాన్‌కు మద్దతుగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ వ్యాఖ్యలు చేశారు. అయితే భారత్ స్పష్టంగా స్పందిస్తూ కశ్మీర్ తమ అంతర్గత విషయం అని, విదేశీ జోక్యం అంగీకరించబోమని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో టర్కీ తన క్లారిటీ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.