అమెరికా అంతకంతకూ ఎదగాలనుకోవటం ఓకే. ఆ పేరుతో ప్రపంచ దేశాలు దానికి కట్టుబానిసత్వం చేయాలనుకోవటం ఏ మాత్రం సరికాదు. అమెరికా బాగు కోసం భారత్ ను తాను చెప్పినట్లుగా చేయాలనే ట్రంప్ యవ్వారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగినట్లుగా కనిపిస్తోంది. అగ్రరాజ్యం అదిలింపులకు.. బెదిరింపులకు తగ్గేదేలే.. అన్నట్లుగా బదులిస్తూ.. ట్రంప్ చెత్త ఆంక్షల్ని ఒప్పుకునేదే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న మోడీ సర్కారు వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తాను చెప్పింది చెప్పినట్లుగా వినని భారత్ పై.. సుంకాల షాక్ ఇచ్చేందుకు సిద్ధమైన ట్రంప్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వేళ.. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఒక సంస్థ రష్యాకు ఏటా వేలాది డ్రమ్ముల్ని పంపుతున్న వైనం.. దానికి సంబంధించిన ఒక ఫోటో బయటకు రాగా.. దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంతకూ విషయం ఏమంటే.. వేలాది డ్రమ్ముల్ని హైదరాబాద్ కంపెనీ ఒకటి రష్యాకు ప్రతి ఏడాది పంపుతుంది.
ఇంతకూ ఆ ప్లాస్టిక్ డ్రమ్ములు రష్యాకు ఎందుకు వెళతాయంటే.. భారత్ నుంచి డ్రమ్ముల్లో వెళ్లేది కీరదోసకాయ. మీరు చదివింది కరెక్టే. రష్యా ఆహార అవసరాల్లో ఒకటైన కీరదోసకాయను హైదరాబాద్ కు చెందిన కంపెనీ ఒకటి వేలాది డ్రమ్ముల్లో పంపుతూ ఉంటుంది. ఈ కంపెనీ హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ లో ఉంది. వాల్జె ఫుడ్స్ పేరుతో నడిచే ఈ కంపెనీ.. తెలుగు రాష్ట్రాల్లోని రైతుల నుంచి కీర దోసల్ని కొనుగోలు చేస్తుంది. అనంతరం పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ముల్లో ఆహార సంబంధిత ఉత్పత్తుల నిల్వ కోసం ఉపయోగించే రసాయనాల్లో ఉంచి.. వాటిని నౌకల్లో రష్యాకు ఎగుమతి చేస్తుంటారు. ఇందుకోసం తెలంగాణలోని గద్వాల్.. వికారాబాద్.. ఏపీలోని కర్నూలు పరిసర ప్రాంతాల్లోని చిన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందించి.. పండిస్తుంటారు. అనంతరం ఈ కీరదోసకాయల్ని రష్యాకు పంపుతారు.
కీర దోసకాయ వినియోగం రష్యాలో ఎక్కువ. ఆ దేశంలో అన్ని కాలాల్లో కీర దోసకాయ పండదు. ఈ కారణంతో ఆ దేశ కీరదోస అవసరాల్ని భారత్ లోని కొన్ని కంపెనీలు తీరుస్తాయి. అందులో హైదరాబాద్ కంపెనీ ఒకటి. ఒక్కో ప్లాస్టిక్ డ్రమ్ములో 190 కేజీల కీర దోసకాయల్ని నిల్వ ఉంచుతారు. రష్యాకు పంపేందుకు సిద్ధమైన కీర దోసలు ఉన్న ప్లాస్టిక్ డ్రమ్ముల గురించి ట్రంప్ నకు తెలిస్తే.. కచ్ఛితంగా అతగాడికి కోపం రావొచ్చన్న జోక్ పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.