దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన భారీ బాంబు పేలుడు ఘటనలో ఏకంగా 12 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో ఇరవై మంది దాకా క్షతగాత్రులు అయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా అమాయకులు. ఏ పాపం పుణ్యం ఎరగని వారు. ఆ రోజున ఆ సమయంలో వారు అక్కడ ఉండడమే నేరం అయింది. అందుకే చనిపోయిన వారు కొందరు గాయాల పాలు అయిన వారు మరికొందరు. ఇలా దేశ రాజధానిలో భీతిల్లే ఘటన జరిగింది. ఒక మారణ హోమం గుండె కోత కోసింది. ఢిల్లీ తల్లడిల్లిపోయింది.
భూటాన్ లో రెండు రోజుల పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లారు. ఆయన వెనక్కి తిరిగి వచ్చిన వెంటనే ఢిల్లీలోని ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఇక బుధవారం రాత్రి కేంద్ర కేబినెట్ భేటీ అయింది. మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జాతీయ భద్రత ప్రతి పౌరుడి భద్రత పట్ల తన శాశ్వత నిబద్ధతకు చాటుకుంటామని కేంద్ర మంత్రి వర్గం జాతికి తెలియచేసింది. దానికి అనుగుణంగా భారతీయులందరి ప్రాణాలను వారి శ్రేయస్సును కాపాడాలనే ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని మంత్రివర్గం పునరుద్ఘాటించింది.
అంతే కాదు ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడులో జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రాణనష్టం పట్ల కేంద్ర మంత్రివర్గం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అమాయక ప్రాణాలను కోల్పోయిన వారికి గౌరవసూచకంగా రెండు నిమిషాల మౌనం పాటించింది. ఈ అర్థరహిత హింసాకాండ బాధితులకు మంత్రివర్గం తన ఘన నివాళులు అర్పించి మృతుల కుటుంబాలకు తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియచేసింది. అమాయకుల ప్రాణాలను కోల్పోవడానికి దారితీసిన ఈ దుర్మార్గపు పిరికి చర్యను మంత్రివర్గం నిర్ద్వంద్వంగా ఖండించింది.
ఇలాంటి ఘాతుకం ఉగ్రవాదం అన్ని రూపాలుగా మారి వేయి తలలతో విర్రవీగుతున్న వేళ దేశం చూపించిన నిబద్ధతకు అచంచలమైన విశ్వాసానికి మంత్రివర్గం ప్రశంసించింది అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ధైర్యంతో వ్యవహరించిన అధికారులు, భద్రతా సంస్థలు పౌరుల సకాలంలో సమన్వయంతో స్పందించిన తీరుని మంత్రివర్గం ప్రశంసించింది. ఈ సంఘటనపై దర్యాప్తును అత్యంత అత్యవసరంగా వృత్తి నైపుణ్యంతో కొనసాగించాలని మంత్రివర్గం జాతీయ దర్యాప్తు సంస్థలను ఆదేశించింది, తద్వారా నేరస్థులు వారికి సహకరించిన వారు వారిని ప్రోత్సహించిన వారిని గుర్తించాలని పేర్కొంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించింది. ఇక కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో ప్రస్తుతం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని కూడా కేంద్ర మంత్రి చెప్పారు.


















