భారత్, బ్రిటన్ మధ్య మూడేళ్లుగా చర్చలు జరుగుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ -ఎఫ్‌టీఏ) ఎట్టకేలకు ఆమోదం పొందింది.ప్రస్తుతం, భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ పర్యటనలో ఉన్నారు. ప్రధాని హోదాలో మోదీ బ్రిటన్‌లో పర్యటించడం ఇది నాలుగోసారి.భారత్, యూకే మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత, సంద్రింగ్‌హామ్‌లో ప్రధాని మోదీ, కింగ్ చార్లెస్ సమావేశమయ్యారు. యూకే ప్రధాన మంత్రి సర్ కీర్ స్టార్మర్‌తో భారత ప్రధాని మోదీ చర్చలు ముగిసిన తర్వాత కింగ్ చార్లెస్ నోర్ ఫోల్క్‌లోని తన ప్రైవేట్ ఎస్టేట్‌లో మోదీకి ఆతిథ్యమిచ్చారు.”ఈ ఒప్పందం కేవలం ఆర్థిక భాగస్వామ్యం గురించి మాత్రమే కాదు. రెండు దేశాల ఉమ్మడి శ్రేయస్సు కోసం ఒక ప్రణాళిక. భారత వస్త్రాలు, చెప్పులు, రత్నాలు, ఆభరణాలు, సీ ఫుడ్, ఇంజినీరింగ్ ఉత్పత్తుల వంటి వాటికి బ్రిటన్‌లో మెరుగైన మార్కెట్ దొరుకుతుంది. భారత వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పరిశ్రమకు మంచి అవకాశాలు ఉంటాయి” అని ప్రధాని మోదీ చెప్పారు.
”ప్రత్యేకించి.. భారత రైతులు, మత్స్యకారులు, ఎంఎస్ఎంఈ రంగానికి ఈ ఒప్పందం ప్రయోజనకరంగా ఉంటుంది. యూకేలో తయారైన వైద్య పరికరాలు, ఏరోస్పేస్ విడిభాగాల వంటి ఉత్పత్తులు భారత్‌లో సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాయి” అని మోదీ తెలిపారు.మరోవైపు, ఈ ఒప్పందం బ్రిటిష్ కార్మికులకు హాని కలిగించవచ్చని బ్రిటన్‌లోని కొంతమంది ప్రతిపక్ష నేతలు హెచ్చరించారు. ఈ ఒప్పందంలో భారతీయ కార్మికులకు జాతీయ బీమా సహకారం(నేషనల్ ఇన్స్యూరెన్స్ కంట్రిబ్యూషన్)పై మినహాయింపును ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలకు పెంచారు.2020లో బ్రెగ్జిట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బ్రిటన్ ఇతర దేశాలతో కుదుర్చుకున్న అతిపెద్ద, ఆర్థికంగా అత్యంత ముఖ్యమైన వాణిజ్య ఒప్పందం ఇదేనని బ్రిటిష్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ అన్నారు.
”ఈ ఒప్పందాన్ని ఆమోదించాం. సంతకాలు చేశాం. ఎన్నో ఏళ్లుగా చర్చల్లో ఉన్న ఒప్పందాన్ని పూర్తి చేయడం ద్వారా సులభతర వాణిజ్యానికి బ్రిటన్ సిద్ధంగా ఉందనే శక్తివంతమైన సందేశాన్ని పంపాం” అని ఆయన చెప్పారు.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఐదు ముఖ్యమైన విషయాలు ఇవే..ఈ ఒప్పందం వల్ల బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థకు సంవత్సరానికి 4.8 బిలియన్ పౌండ్లు (6.5 బిలియన్ డాలర్లు) ఆదాయం సమకూరుతుందని బ్రిటిష్ ప్రభుత్వం చెబుతోంది.బ్రిటన్ మొత్తం ఎగుమతుల్లో భారత్‌కు చేసేవి 1.9 శాతం. మొత్తం దిగుమతుల్లో భారత్ నుంచి చేసుకునేవి 1.8 శాతం.కానీ, ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇది పెరుగుతుందని భావిస్తున్నారు.
2030 నాటికి భారత ఎగుమతులను 1 ట్రిలియన్ డాలర్లకు పెంచాలన్నది ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక లక్ష్యంగా చెబుతున్నారు. ఈ కోణంలో భారత్‌కు అత్యంత ప్రాధాన్యత గల వాణిజ్య భాగస్వామిగా బ్రిటన్‌ను భావిస్తున్నారు.బ్రిటిష్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పదవీ కాలంలో, 2022లో వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభమయ్యాయి.దీనివల్ల రెండు దేశాల మధ్య బిలియన్ల రూపాయల విలువైన వాణిజ్యం పెరుగుతుందని ఇరుపక్షాలూ చెబుతున్నాయి.యూకే నుంచి ఎగుమతి చేసే వస్తువులపై సగటు సుంకం 15 శాతం నుంచి 3 శాతానికి తగ్గుతుంది. దీని వల్ల బ్రిటిష్ కంపెనీలకు భారత్‌లో అమ్మకాలు సులభంగా మారతాయి.
బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకునే విస్కీపై సుంకాన్ని భారత్ సగానికి తగ్గించింది. 150 శాతం నుంచి 75 శాతానికి తగ్గించింది.దీని వల్ల భారత మార్కెట్‌లోకి ప్రవేశించే విషయంలో అంతర్జాతీయ పోటీదారుల మధ్య యూకే తక్షణ ఆధిక్యతను పొందుతుంది. 2035 నాటికి ఈ సుంకాన్ని 40 శాతానికి తగ్గించనున్నారు.బ్రిటిష్ కార్లు, ఏరోస్పేస్, ఎలక్ట్రికల్స్, వైద్య పరికరాలు, విస్కీ, మాంసం, బిస్కెట్లు, చాక్లెట్లు వంటి ఆహార పదార్థాలు భారత్‌లో చౌకగా లభిస్తాయి. భారత దుస్తులు, ఆభరణాలు యూకేలో చౌకగా మారనున్నాయి.ఈ ఒప్పందంతో బ్రిటన్‌లో 2,200లకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని బ్రిటిష్ ప్రధాన మంత్రి స్టార్మర్ తెలిపారు.ఈ ఒప్పందం వల్ల తాత్కాలికంగా బ్రిటన్‌కు వెళ్లే భారత ఉద్యోగులు, భారత్‌లో తాత్కాలికంగా పనిచేసే బ్రిటిష్ ఉద్యోగులు తమ సొంత దేశంలో మాత్రమే సామాజిక భద్రతా సహకారం(సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్స్) చెల్లించాలి.
యూరోపియన్ యూనియన్, అమెరికా, దక్షిణ కొరియాతో సహా 17 ఇతర దేశాలతో ఇప్పటికే ఇలాంటి పరస్పర ‘డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్’ ఏర్పాట్లు ఉన్నాయని యూకే ప్రభుత్వం తెలిపింది.చౌకగా లభించే భారతీయ నిపుణుల వల్ల బ్రిటిష్ కార్మికులు ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళనను బ్రిటిష్ వాణిజ్య మంత్రి జొనాథన్ రేనాల్డ్స్ పూర్తిగా తోసిపుచ్చారు.”బ్రిటిష్ ఉద్యోగి కంటే భారత ఉద్యోగిని చౌకగా నియమించుకునేలా ఎలాంటి పన్ను ప్రయోజనం ఉండదు” అని ఆయన బీబీసీ బ్రేక్‌ఫాస్ట్‌లో అన్నారు.నిజానికి వీసాలు, ఎన్‌హెచ్ఎస్ సర్‌ఛార్జీలు వంటి అదనపు ఖర్చుల కారణంగా, ఒక భారత ఉద్యోగికి ఎక్కువ ఖర్చు అవుతుందని రేనాల్డ్స్ చెప్పారు.భారత ఆర్థిక, న్యాయ సేవల రంగంలో తాను కోరుకున్నంత సౌలభ్యాన్ని ఈ ఒప్పందం ద్వారా బ్రిటన్ పొందలేకపోయింది.
రెండు దేశాల్లో పెట్టుబడులకు రక్షణ లభించే విధంగా ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి.హై కార్బన్ పరిశ్రమలపై పన్ను విధించే బ్రిటన్ ప్రతిపాదిత ప్రణాళికపై కూడా రెండు దేశాలు చర్చిస్తున్నాయి.ఈ పన్ను తన ఎగుమతులను ప్రభావితం చేస్తుందని భారత్ భావిస్తోంది.బ్రిటన్ వచ్చే ఏడాది జనవరి నుంచి కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్‌ను అమలు చేయబోతోంది. దాని వల్ల భారత ఉత్పత్తులు దీనికి సంబంధించిన పన్ను చెల్లించాల్సి రావొచ్చు.రక్షణ, విద్య, వాతావరణం, సాంకేతికత, ఆవిష్కరణ రంగాలలో పరస్పర సహకారాన్ని పెంచుకోవడానికి కూడా ఇద్దరు ప్రధానులు అంగీకరించారు.అవినీతి, తీవ్రమైన మోసం, వ్యవస్థీకృత నేరాలు, అక్రమ వలసలను ఎదుర్కోవడానికి నిఘా భాగస్వామ్యం, సహకారం సాయపడతాయి.ఇందులో కోర్టు వ్యవహారాల్లో ఉపయోగపడేలా, కొత్త నేర రికార్డులను ఇచ్చిపుచ్చుకునే ఒప్పందం కూడా ఖరారైంది.ఈ వారం ప్రారంభంలో భారత మంత్రివర్గం ఈ ఒప్పందాన్ని ఆమోదించింది. పార్లమెంటు ఆమోదం ఇంకా లభించాల్సి ఉంది.ఈ ఒప్పందం అమలులోకి రావడానికి కనీసం ఏడాది కాలం పట్టొచ్చు.