కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ బీజేపీని టార్గెట్ గా చేసుకుని బీహార్ లో ఓటర్ అధికార యాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తన చేతిలో హైడ్రోజన్ బాంబు ఉందని దానిని త్వరలో వేస్తాను అని భారీ వార్నింగ్ ఇచ్చేశారు. ఆ బాంబుతో ప్రకంపనలు పుడతాయని ఆయన అంటున్నారు.
రాహుల్ గాంధీకి ఏమీ తెలియదు పప్పు అని బీజేపీ వారు అంతా ఒక అభిప్రాయం పక్కాగా స్థిరపరచుకున్నారు. అయితే అది తప్పు తాను పప్పుని కాదు అని రాహుల్ చాలా కాలం క్రితమే రుజువు చేసుకున్నారు ఆయన నిప్పు కణికగా మారిపోతారని ఎవరూ అనుకోలేదు. కానీ ఆయన నిప్పులే రాలుస్తున్నారు ఓటు చోరీ అంటూ రాహుల్ వాడుతున్న పదాలు కానీ ఆయన చేస్తున్న ర్యాగింగ్ కానీ అసలు ఏ మాత్రం తట్టుకోలేకపోయేలా కాషాయం పెద్దలకు ఉందని అంటున్నారు వారి చేతనే కషాయం తాగించేస్తున్నారు అని కూడా సెటైర్లు పడుతున్నాయి.
ఇదిలా ఉంటే బీహార్ ర్యాలీలో రాహుల్ స్ట్రాంగ్ బీజేపీకి బిగ్ వార్నింగ్ ఇచ్చారు.ఓటు చోరీ దేశవ్యాప్తంగా జరిగింది అని రాహుల్ గాంధీ రెట్టిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎన్నో విధాలుగా సాయపడుతోందని ఈ క్రమంలో సామాన్యులు బడుగుల ఓట్లు చోరీ అవుతున్నాయని ఆయన అంటున్నారు. ఆగస్టు నెల 17 నుంచి ఆయన ఓటర్ అధికార యాత్ర చేస్తూ ప్రతీ చోటా ఇదే విషయం చెబుతున్నారు. ఈ ర్యాలీలో అయితే ముందుంది చాలా అంటున్నారు. అదేంటి అంటే హైడ్రోజన్ బాంబు వేస్తాను అని హెచ్చరిస్తున్నారు.
ఇక లోక్ సభ ఎన్నికలలోనూ పెద్ద ఎత్తున ఓట్ల తారు మారు జరిగింది అని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. వాటి వివరాలు అన్నీ కూడా పక్కాగా తన దగ్గర ఉన్నాయని అవి అణు బాంబు కంటే పవర్ ఫుల్ అని కూడా చెబుతున్నారు. చాలా తొందరలోనే వాటిని బయటపెడతాను అని అంటున్నారు. అంటే ఆగస్ట్ 7న ఆయన వేసిన తొలి బాంబు ఎఫెక్ట్ బీహార్ అంతా ర్యాలీగా మారి ఒక ఊపు ఊపేసింది. ఇపుడు ఏకంగా హైడ్రోజన్ బాంబు అని అంటున్నారు. ఇది ఏ రకమైన రాజకీయ దుమారం రేపుతుందో అన్న చర్చ అయితే ఉంది అని అంటున్నారు.
అణు బాంబు కంటే పెద్ద బాంబు తాను వేయబోతున్నాను బీజేపీ రెడీనా అని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. దేశమంతా ప్రస్తుతం ఓటు చోరీ గురించే మాట్లాడుతోందని కూడా ఆయన చెబుతున్నారు. ఒక్క బిహార్ రాష్ట్రంలోనే 65 లక్షల మంది ఓటర్లను అక్రమంగా తొలగించారంటూ రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం రాజ్యాంగాన్ని హత్య చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఉన్నాయని అయితే కాంగ్రెస్ వాటిని సాగనివ్వదని ఆయన స్పష్టం చేశారు. ఓటు చోరీని బయటపెట్టేందుకే ఓటర్ అధికార్ యాత్రను చేపట్టినట్లుగా ఆయన చెబుతున్నారు.
ఏమిటీ అణు బాంబులు హైడ్రోజన్ బాంబుల బెదిరింపులు అంటూ బీజేపీ నేత కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాహుల్ ని నిలదీస్తున్నారు బాధ్యతారాహిత్యానికి రాహుల్ వ్యవహారశైలి అద్దం పడుతోంది అన్నారు. ఆయన పార్లమెంట్ లో మాట్లాడినా లేక బయట మాట్లాడినా ఏమి చెప్పాలనుకుంటున్నారో ఎవరికీ అసలు అర్ధం కాదని ఎద్దేవా చేశారు. దేశంలోని ఓటర్లను అవమానిస్తూ తనను తాను కించపరచుకుంటూ రాహుల్ ఓటర్ అధికార ర్యాలీలు చేస్తున్నారని మండిపడ్డారు బీహార్ ర్యాలీకి యూపీ నుంచి జనాలను తరలిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇవన్నీ పక్కన పెడితే ఓటు చోరీ అని రాహుల్ చేస్తున్న ర్యాగింగ్ మాత్రం చాలా ఇబ్బందికరంగానే అధికార పార్టీ పెద్దలకు ఉందని అంటున్నారు.