కీసర పరిధిలో చోటు చేసుకున్న ఒక ఉదంతం షాకింగ్ గా మారింది. ప్రేమపెళ్లి చేసుకున్న ఒక యువతి అత్తారింటికి వెళ్లిన వేళ.. ఆమె తల్లిదండ్రులు.. బంధువులు దాడి చేసి బలవంతంగా లాక్కెళ్లిన ఉదంతం కలకలాన్ని రేపింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నర్సంపల్లిలో చోటు చేసుకుంది. ఇంతా చేస్తే బంధువుల అమ్మాయే కావటం.. వరుసకు మరదలు అయ్యే అమ్మాయిని ఏడేళ్లుగా ప్రేమించుకున్న వేళ.. పెళ్లి అనంతరం చోటు చేసుకున్న ఉదంతం సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే..
కీసర మండలం నర్సంపల్లికి చెందిన ప్రవీణ్ అదే గ్రామానికి చెందిన వరుసకు మరదలైన శ్వేతతో ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నాలుగు నెలల క్రితం వారు హైదరాబాద్ లో ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం వారు సికింద్రాబాద్ లోనే ఉంటున్నారు. ఆరోగ్యం సరిగా లేకపోవటంతో భర్తతో కలిసి శ్వేత వారం క్రితం నర్సంపల్లికి చేరుకున్నారు.
ఊరికి వచ్చినట్లుగా తెలుసుకున్న శ్వేత తల్లిదండ్రులు.. బంధువులు కలిసి ప్రవీణ్ తల్లిదండ్రుల ఇంటికి కారులో వచ్చారు. వారిని ఆపే ప్రయత్నం చేయగా.. ప్రవీణ్ తల్లి.. సోదరుల కళ్లల్లో కారం చల్లి.. కత్తులతో కర్రలతో దాడి చేశారు. అనంతరం శ్వేత కాళ్లు.. చేతులు కట్టేసి బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఈ సందర్భంగా స్థానికులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికి ఫలితం లేకపోయింది.
దాడి చేయటం.. శ్వేతను బలవంతంగా లాక్కెళ్లిన వైనం సీసీ కెమేరాలు నమోదయ్యాయి. బాధిత కుటుంబం పోలీసుల్ని ఆశ్రయించారు. తమపై దాడి చేసిన వారిని శిక్షించాలని.. శ్వేతను అప్పగించాలని కోరుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసులు విచారణ చేస్తున్నట్లు చెబుతున్నారు. శ్వేత కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉన్నట్లుగా ప్రవీణ్ కుటుంబీకులు వాపోతున్నారు.