నటీనటులు: నాని- శ్రీనిధి శెట్టి-సముద్రఖని- రావు రమేష్ – కోమలి ప్రసాద్ – సూర్య శ్రీనివాస్ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
ఛాయాగ్రహణం: సాను వర్గీస్
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
రచన-దర్శకత్వం: శైలేష్ కొలను
‘హిట్’.. ‘హిట్-2’ చిత్రాలతో తెలుగులో క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఒక ఫ్రాంఛైజీని క్రియేట్ చేసిన దర్శకుడు.. శైలేష్ కొలను. తొలి రెండు చిత్రాల్లో విశ్వక్సేన్.. అడివి శేష్ హీరోలుగా నటిస్తే.. ఈసారి తన నిర్మాత నానినే హీరోగా పెట్టి ‘హిట్-3’ చేశాడు శైలేష్. చక్కటి ప్రోమోలతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచిన ఈ చిత్రం.. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ‘హిట్-3’ ఈ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
కథ:
అర్జున్ సర్కార్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అతను హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం (హిట్)లో ఎస్పీగా పనిచేస్తుంటాడు. చాలా కోపిష్టి.. ముక్కుసూటి వ్యక్తి అయిన అర్జున్.. నేరస్థులతో చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. సమాజానికి హానికరమైన వ్యక్తుల అంతు చూసే దాకా వదలడు. అతను కశ్మీర్లో పని చేస్తుండగా.. ఒక విచిత్రమైన కేసు అతడికి ఎదురవుతుంది. ఈ కేసును ఛేదించే క్రమంలో అతడికి కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. చివరికి అతనే హత్యలు చేసి జైలు పాలయ్యే పరిస్థితి వస్తుంది. ఇంతకీ ఈ కేసేంటి.. దాన్ని ఛేదించేందుకు అర్జున్ ఎక్కడిదాకా వెళ్లాడు.. చివరికి అతను అనుకున్నది సాధించాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
తెలుగులో ఒకప్పుడు చాలా అరుదు అనదగ్గ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో.. ‘హిట్’ పేరుతో ఒక ఫ్రాంఛైజీనే క్రియేట్ చేసి రెండు వరల్డ్ క్లాస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలు అందించాడు శైలేష్ కొలను. ప్రేక్షకులను ఆరంభం నుంచి చివరి దాకా గెస్సింగ్ లో ఉంచుతూ.. ఊహకందని ట్విస్టులతో ఉత్కంఠ రేపుతూ ‘హిట్-1’.. ‘హిట్-2’ వేటికవే బలమైన ముద్ర వేశాయి. ఇప్పుడు నాని రూపంలో ఇంకా పెద్ద స్టార్ ఈ ఫ్రాంఛైజీలోకి రావడంతో ‘థర్డ్ కేస్’ మీద అంచనాలు పెరిగిపోయాయి. శైలేష్ మార్కు ఉత్కంఠభరిత కథాకథనాలకు.. నాని పెర్ఫామెన్స్ కూడా తోడైతే సినిమా లెవెలే వేరుగా ఉంటుందని ఆశించారు ప్రేక్షకులు. ‘హిట్’ ఫ్రాంఛైజీలోకి నాని రావడం కచ్చితంగా పెద్ద ప్లస్. ఇంతకుముందు రెండు చిత్రాలను మించి ఇందులో హీరో క్యారెక్టర్ హైలైట్ అయింది. నాని పెర్ఫామెన్స్ గురించైతే చెప్పాల్సిన పనే లేదు. అదరగొట్టేశాడు. హీరోయిజానికి ఢోకా లేదు. ఎలివేషన్లు పేలిపోయాయి. కానీ ఒక స్టార్ రాగానే కథ కొంచెం పలుచనైపోవడమే మూడో కేసులో ప్రధాన బలహీనత. గత రెండు చిత్రాల్లో కథే హీరో. రెండింట్లోనూ క్రైమ్ ఎలిమెంట్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కథలో ట్విస్టులు ప్రేక్షకులను ఉత్కంఠతో ఊపేస్తాయి. కానీ ఈసారి క్రైమ్ ఎలిమెంట్.. ఇన్వెస్టిగేషన్ సాగే తీరు అనుకున్నంత ఉత్కంఠభరితంగా అనిపించవు. విలన్ వీకైపోయాడు. హీరోనే ఎక్కువ హైలైట్ అయిపోయాడు. కానీ ‘హిట్-3’ చూడ్డానికి కావాల్సినన్ని కారణాలున్నాయి. ముఖ్యంగా నాని ఒక్కడిని చూస్తూ రెండున్నర గంటలు ఈజీగా గడిపేయొచ్చు. ఇంతకుముందెన్నడూ చూడని హై లెవెల్ హీరోయిజంతో నాని చెలరేగిపోయాడు ‘హిట్-3’లో.
ఒక రకంగా చెప్పాలంటే ‘హిట్-3’కి బలమూ నానీనే. బలహీనతా నానీనే. కథ సంగతి పక్కన పెడితే.. నాని క్యారెక్టర్ మాత్రం బాగా రాసుకున్నాడు శైలేష్. ‘‘క్రిమినల్స్ భూమి మీద పది అడుగుల సెల్లో అయినా ఉండాలి.. లేదా భూమి కింద ఆరడుగుల గోతిలో అయినా ఉండాలి’’ అంటూ ఒక సన్నివేశంలో చెప్పే డైలాగుతో హీరో పాత్ర మీద ఒక అంచనా వచ్చేస్తుంది. క్రిమినల్స్ తో అతనెంత వయొలెంట్ గా డీల్ చేస్తాడన్నది ట్రైలర్లోనే చూపించారు. సినిమాలో కూడా ఆరంభ సన్నివేశాల్లోనే తన క్యారెక్టర్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు. యాంగర్ ఇష్యూస్ ఉన్న హీరో పాత్రలు ఇంతకుముందు చూడనవివేం కాదు కానీ.. అయినప్పటికీ నాని తనకే సొంతమైన నైపుణ్యంతో అర్జున్ సర్కార్ పాత్రను క్యూరియస్ గా మార్చాడు. అతనేం మాట్లాడతాడు.. ఎలా ప్రవర్తిస్తాడనే ఆసక్తితో ఆ పాత్రను చూస్తూ ఉండిపోతారు. అలా ప్రేక్షకులకు ఒక ఆకర్షణ మంత్రం వేసి అర్జున్ సర్కార్ పాత్రను ముందుకు తీసుకెళ్లాడు నాని. ఐతే దర్శకుడి ఫోకస్ కూడా నాని మీదే ఎక్కువగా ఉండడంతో కథ అంత పకడ్బందీగా తయారు కాలేదేమో అనిపిస్తుంది. అంత సహజంగా.. ఉత్కంఠ రేకెత్తించేలా క్రైమ్ ఎలిమెంట్.. దాని తాలూకు సెటప్ లేకపోవడం ‘హిట్-3’కి ప్రతికూలంగా మారింది.
దేశవ్యాప్తంగా వేర్వేరు చోట్ల ఒకే రకమైన హత్యలు జరగడం.. దాన్ని హీరో ఛేదించే ప్రయత్నం చేయడం.. ఇదంతా ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో చూసిన సెటప్పే. ఐతే ఈ హత్యల వెనుక మోటివ్ కొంచెం భిన్నంగా అనిపించడంతో ఈ క్రైమ్ ఎలిమెంట్ మొదట్లో క్యూరియస్ గానే ఉంటుంది. కేసు ఎటూ కదలకుండా ఆగిపోయిన పరిస్థితుల్లో హీరో.. తనే క్రైమ్ చేసి విలన్ల దారిలోకి వెళ్లడం కూడా భిన్నంగానే అనిపిస్తుంది. కశ్మీర్ నేపథ్యంలో సాగే సన్నివేశాలను దర్శకుడు బాగా డీల్ చేశాడు. ఐతే ఐతే ఈ క్రైమ్ వెనుక గుట్టు ఏంటో తెలిశాక మాత్రం ‘హిట్-3’ ప్రేక్షకుల ఆసక్తిని నిలిపి ఉంచలేకపోయింది. చాలా అసహజంగా అనిపించే ఆ సెటప్.. నామమాత్రంగా అనిపించే విలన్ పాత్ర.. హద్దులు దాటిపోయే వయొలెన్స్.. ఇవన్నీ ‘హిట్-3’ గ్రాఫ్ ను తగ్గించేస్తాయి. ఒక భారీ క్రైమ్ రాకెట్లో భాగమైన 150 మంది అత్యంత భయంకరమైన క్రిమినల్స్ మధ్యలోకి వెళ్లిన హీరో.. దాన్నుంచి ఎలా బయటపడతాడు.. కేసును ఎలా ఛేదిస్తాడు అన్నది ఎంతో ఉత్కంఠ రేకెత్తించాలి. కానీ పకడ్బందీ సీన్లు రాసుకోకపోవడంతో ఈ ఎపిసోడ్ అంతా సాధారణంగా సాగిపోయింది. హీరో చాలా ఈజీగా అన్ని సవాళ్లనూ ఛేదించుకుంటూ ముందుకెళ్లిపోతాడు. సన్నివేశాల్లో బలంతో కాకుండా హీరోయిజం అంతా కూడా ఫైట్లు.. విపరీతమైన వయొలెన్స్ ఆధారంగానే నడిచింది. ముగింపు సన్నివేశాలు కూడా ఓ మోస్తరుగా అనిపిస్తాయి. అడివి శేష్ క్యామియో అనుకున్నంతగా పేలలేదు. హిట్-4కు లీడ్ ఇస్తూ కార్తితో చేయించిన క్యామియో కూడా ‘హిట్-3’కైతే ప్లస్ కాలేకపోయింది.
నటీనటులు:
పాత్ర ఎలాంటిదైనా అందులో ఒదిగిపోవడానికి నాని చేసే ప్రయత్నం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘దసరా’ చిత్రంలో వయొలెంట్ అండ్ రగ్డ్ క్యారెక్టర్లో అదరగొట్టిన నాని.. ఈసారి కొంచెం క్లాస్ టచ్ ఉన్న పాత్రలో అంతకుమించి వయొలెన్స్ పండించాడు. టిపికల్ క్యారెక్టరైజేషన్ తో సాగిన అర్జున్ సర్కార్ పాత్రతో త్వరగా ప్రేక్షకులను ఒక మూడ్ లోకి తీసుకెళ్లడంలో నాని కీలకంగా మారాడు. తన పెర్ఫామెన్సే సినిమాను డ్రైవ్ చేస్తుంది. ఏ మాస్ హీరోకూ తీసిపోని స్థాయిలో నాని ఇందులో హీరోయిజం పండించడం విశేషం. హీరోయిన్ శ్రీనిధి శెట్టి జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఆమె కనిపించేది తక్కువ సమయమే. ముందు మామూలు అమ్మాయిలా పరిచయమై తర్వాత టర్న్ తీసుకునే పాత్రలో శ్రీనిధి పర్వాలేదనిపించింది. విలన్ పాత్రలో చేసిన బాలీవుడ్ నటుడు తుస్సుమనిపించాడు. కోమలి ప్రసాద్ బాగా చేసింది. రావు రమేష్.. సముద్రఖని.. వీళ్లవి మామూలు పాత్రలే.
సాంకేతిక వర్గం:
మిక్కీ జే మేయర్ పాటల్లో ఒకప్పటి మెరుపులు లేవు. పాటలకు ఇందులో ప్రాధాన్యం తక్కువే కానీ.. ఉన్న రెండు మూడు సాంగ్స్ కూడా సోసోగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం మాత్రం సినిమా నతడకు తగ్గట్లు ఇంటెన్స్ గా సాగి మెప్పిస్తుంది. సాను వర్గీస్ ఛాయాగ్రహణం చాలా బాగుంది. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. కశ్మీర్ సహా అనేక లొకేషన్లలో సినిమాను రిచ్ గా తీశారు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ శైలేష్ కొలను.. ‘సైంధవ్’ తర్వాత మళ్లీ గాడిన పడ్డాడు. తన ‘హిట్’ జోన్లోకి వచ్చేశాడు. నానిని అతను సరిగ్గా వాడుకుని అర్జున్ సర్కార్ పాత్రతో ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేశాడు. కానీ ఈసారి అతను ఎంచుకున్న ‘కేస్’ మాత్రం అనుకున్నంత ఆసక్తి రేకెత్తించలేకపోయింది. అసహజమైన సెటప్ వల్లే క్రైమ్ ఎలిమెంట్లో ఇంటెన్సిటీ తగ్గిపోయింది. గత రెండు కేసుల్లో మాదిరి స్టన్నింగ్ ట్విస్టులు ఇందులో మిస్ అయ్యాయి. అలా అని శైలేష్ బోర్ కొట్టించాడని మాత్రం చెప్పలేం. రెండున్నర గంటలు ప్రేక్షకులను కుదురుగానే కూర్చోబెట్టగలిగాడు. క్రైమ్ ఎలిమెంట్ విషయంలో అతను మరింత కసరత్తు చేసి ఉంటే ‘హిట్-3’ వేరే లెవెల్ సినిమా అయ్యుండేది.
రేటింగ్- 3/5