ఏపీ రాజధాని అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం.. రాజధానికి అన్ని రకాల వసతులు సమకూర్చాలని ప్లాన్ చేస్తున్నారు. రోడ్డు, రైలు, వాయు, జల మార్గాల ద్వారా అమరావతికి రవాణా సౌకర్యం కల్పించేందు చర్యలు తీసుకుంటున్నారు. మెట్రో నగరాల మధ్య హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మెట్రో నగరాలను కలుపుతూ నిర్మించనున్న రెండు కారిడార్లు ఏపీ మీదుగా వెళుతున్నాయి. ఇందులో ఒకటి అమరావతి మీదుగా తీసుకువచ్చి భవిష్యత్తులో మెట్రో నగరంగా స్థిరపడనున్న అమరావతికి ముందుగానే బుల్లెట్ రైలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం మెట్రో నగరాలకు బుల్లెట్ రైలు సౌకర్యం తీసుకురావాలని చాలా కాలంగా ప్లాన్ చేస్తోంది. ముందుగా ముంబై – అహ్మదాబాద్ మధ్య 508 కిలీమీటర్ల మేర బుల్లెట్ రైలు కారిడార్ నిర్మిస్తున్నారు. ఇది 2026 నాటికి కొంతవరకు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆరు మెట్రో నగరాల మధ్య బుల్లెట్ రైలు కారిడార్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మాణానికి రూట్ మ్యాప్ సిద్ధం చేశారని అంటున్నారు.
హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్ – బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడారుకు ప్రాథమిక అలైన్మెంట్ కు ప్రభుత్వం ఆమోదం లభించిందని చెబుతున్నారు. ఈ రెండింటితో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ చిత్రం మారిపోయే అవకాశం ఉందని అంటున్నారు. హైదరాబాద్ – చెన్నై మీదుగా వెళ్లే హైస్పీడ్ రైలు కారిడార్ ను అమరావతి మీదుగా తీసుకువెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు వైపు రెండు వేర్వేరు కారిడార్లు నిర్మించనుండగా, ఈ రెండు శంషాబాద్ వరకు సుమారు 38.5 కిలోమీటర్లు కలిపే ఉంటాయని చెబుతున్నారు.
హైదరాబాద్-చెన్నై మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ కోసం మూడు ప్రతిపాదనలు చేయగా, 744.5 కిలోమీటర్ల ఎలైన్మెంట్ కు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ కారిడార్లో మొత్తం 15 స్టేషన్లు ఉంటాయి. అందులో తెలంగాణలో 6, ఏపీలో 8, తమిళనాడులో ఒకటి నిర్మించనున్నట్లు చెబుతున్నారు. ఈ హైస్పీడ్ కారిడార్ హైదరాబాద్ లో ముంబై కారిడార్ వద్ద మొదలవుతుందని, శంషాబాద్, నార్కటపల్లి, సూర్యాపేట, ఖమ్మం లేదా కోదాడ మీదుగా అమరావతికి వచ్చేలా ప్రతిపాదిస్తున్నారు. అమరావతి నుంచి గుంటూరు, చీరాల మీదుగా విజయవాడ-చైన్నె రైలు మార్గానికి సమాంతరంగా ప్రయాణిస్తుందని చెబుతున్నారు.
అయితే ఈ మార్గంలో గుడూరు నుంచి తిరుపతి వైపు తీసుకువెళ్లాలనే ప్రతిపాదన కూడా పరిశీలిస్తున్నారు. దీనివల్ల శ్రీవారి భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించినట్లు అవుతుందని చెబుతున్నారు. అదే సమయంలో తిరుపతి వద్ద ఉన్న శ్రీసిటీ పారిశ్రామిక పార్కులోని వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఉంటుందని ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే మరో 53 కిలోమీటర్ల పొడవు పెరగనుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో రెండు వరుసలు (డబుల్ ట్రాక్)తోపాటు లూప్ లైన్, సైడింగ్స్ ట్రాక్ ఉంటుందని చెబుతున్నారు.
ఇక హైదరాబాద్-చెన్నై కారిడార్ తోపాటు ప్రతిపాదిస్తున్న బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ ప్రస్తుతం ఉన్న హైదరాబాద్-బెంగళూరు హైవేకి సమాంతరంగా నిర్మితమవుతోంది. ఇది ఏపీలో కర్నూలు, అనంతపురం మీదుగా బెంగళూరు వెళుతుంది. ఈ రైలు కారిడార్ లో మొత్తం 13 స్టేషన్లు ఉంటాయని చెబుతున్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో కియా పరిశ్రమను పరిగణలోకి తీసుకుని అక్కడ ఒక స్టేషన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. కాగా, ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ల వల్ల దక్షిణాదిలో చతుర్భుజి తరహా అభివృద్ధికి అవకాశం ఉందని అంటున్నారు.