కర్నూలు💧జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్షా సమావేశం
కర్నూలులోని జలవనరుల శాఖ సిఈ కార్యాలయంలో హంద్రీనీవా ప్రాజెక్ట్ పరిధిలో చెరువులు నింపడంపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తి, వివిధ ప్రాజెక్టుల సిఈలు, ఎస్ఈలు, ఈఈలు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ – హంద్రీనీవా పరిధిలో ఉన్న 517 చెరువులలో ఇప్పటివరకు 299 చెరువులు నింపామని, మిగిలిన అన్ని చెరువులను కూడా త్వరలో నింపేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్ల మొత్తం సామర్ధ్యం 961 టిఎంసులు కాగా, అందులో 844 టిఎంసుల నీటిని నిల్వచేయగలిగామని చెప్పారు. ఇది 87.86 శాతం నీటి నిల్వగా ఉండి, ఇప్పటివరకు 93 శాతం రిజర్వాయర్లు నిండిపోయిన స్థాయిలో ఉన్నాయని వివరించారు.
మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ – “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో సమర్థవంతమైన వాటర్ మేనేజ్‌మెంట్ వల్లే ఇది సాధ్యమైంది. కేవలం ఒక సంవత్సరంలోనే నీటి వినియోగం, పంపిణీ, నిల్వలో చారిత్రాత్మక మార్పులు తీసుకొచ్చాం” అని అన్నారు.రూ.3,850 కోట్లు ఖర్చుతో 738 కిలోమీటర్ల శివారు ప్రాంతాలకు సైతం కృష్ణా జలాలను తీసుకువెళ్లినట్లు తెలిపారు. “రాయలసీమ జీవనాడి అయిన హంద్రీనీవా ప్రాజెక్ట్‌పై జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని, మోటార్లకు బిల్లులు చెల్లించలేదని, ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని” మంత్రి తీవ్రంగా విమర్శించారు.
“గత ఐదేళ్లలో జగన్ చేయలేని పనిని, కూటమి ప్రభుత్వం కేవలం మొదటి ఏడాదిలోనే పూర్తి చేసి చూపించింది. గత ఎన్నికల ముందు అద్దె ట్యాంకులతో కాలువల్లో నీరు వదిలిన నాటకం జగన్ వేసాడు” అని ఆరోపించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాయలసీమకు కృష్ణా జలాలను తెచ్చి, కుప్పం పరిసర ప్రాంతాల పరమసముద్రం చెరువును నింపడం తో పాటు అక్కడే బోటు షికారు కూడా నిర్వహించడం చారిత్రాత్మక ఘట్టమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
రాబోయే నెలల్లో మిగిలిన చెరువులను కూడా నింపేందుకు, రాయలసీమ రైతులందరికీ నీటి అందుబాటు ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.