రాష్ట్రంలో ఈనెల 25 నుంచి జీఎస్టీ జాతరను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. గ్రామ స్థాయిలో అదే విధంగా పట్టణాలు నగరాల స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జిఎస్టి స్లాబులను వివరించడంతోపాటు ప్రజలకు జరుగుతున్న మేలును పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నారు. దీనికి సీఎం చంద్రబాబు స్వయంగా నేతృత్వం వహించనున్నట్టు ఆయనే చెప్పారు. అదేవిధంగా రాష్ట్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని కార్యకర్తలు.. నాయకులు హాజరుకావాలని కూడా అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు చెప్పారు.
నిజానికి జిఎస్టి తగ్గింపు అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం. పైగా జిఎస్టి స్లాబ్లు మార్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేది ఆదాయం భారీ స్థాయిలో తగ్గుతుంది. అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పినట్టు రాష్ట్ర ప్రజలకు 8 వేల కోట్ల రూపాయల మేరకు లబ్ధి చేకూరనుంది. అంటే ఆ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన పన్నుల ఆదాయం. దీనిని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల రాకుండా చేసే పరిస్థితి ఏర్పడింది అన్నది ఒక వాదన వినిపిస్తోంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం భారీగా తగ్గుతుంది.
అయినప్పటికీ కేంద్రాన్ని మెప్పించే క్రమంలో… కేంద్ర ప్రభుత్వాన్ని భుజాలపై ఎత్తుకునే క్రమంలో జిఎస్టి తగ్గింపు ఫలాలను కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంతేకాదు జిఎస్టి ఫలాలు తగ్గటం వల్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని చెబుతున్నప్పటికీ ప్రభుత్వానికి వస్తున్న నష్టాన్ని తప్పించుకోలేని పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. నిజానికి అనేక సంక్షేమ పథకాలు ఇంకా అమలు చేయాల్సి ఉంది. వీటిలో ఇంకా ప్రారంభించని రెండు కీలక పథకాలు కూడా ఉన్నాయి.
వాటిని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటికే వస్తున్న ఆదాయం సరిపోక అప్పులు చేస్తున్న ప్రభుత్వం… ఇప్పుడు జీఎస్టీ కూడా తగ్గిపోతే ఏ విధంగా ముందుకు సాగుతుందన్నది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కానీ, వీటన్నిటినీ పక్కనపెట్టి కేంద్రాన్ని ప్రశంసించే పనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున జిఎస్టి జాతరకు తెరతీయడం సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలకు దారితీసింది. నిన్న మొన్నటి వరకు సూపర్ సిక్స్.. సూపర్ హిట్ కార్యక్రమాన్ని అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జీఎస్టీ పై పెద్ద ఎత్తున ఉద్యమం తరహాలో ప్రజల మధ్యకు వెళ్లాలని, ప్రచారం చేయాలని భావిస్తుంది.
ఏదైనా కార్యక్రమం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరిగితే తప్పకుండా చేయొచ్చు. కానీ దీనివల్ల రాష్ట్రానికన్నా కేంద్రానికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. ఈ విషయాన్ని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిని భుజాల మీద వేసుకోవడం ప్రచార కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుమారు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని నిర్ణయించడం అందరిని విస్మయానికి గురిచేస్తున్న పరిస్థితి. మరి దీనిపై పునరా ఆలోచన చేసుకుంటారా లేకపోతే దీనిని అదే తరహాలో నిర్వహిస్తారా అనేది చూడాలి. అదే సమయంలో మరో చిత్రమైన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్‌పై కేంద్రం ఎక్కడా ప్రచారం చేయడం లేదు.