ఏపీలో అధికారాన్ని పంచుకున్న జనసేనకు గ్రామీణ స్థాయిలో బలం లేదు. అభిమానులు ఉన్నప్పటికీ.. అది ఓటు బ్యాంకుగా కన్వర్ట్ కాలేదు. ప్రస్తుతం వైసీపీ, టీడీపీలకు మాత్రమే బలం మెండుగా ఉంది. ఇక, పట్టణాలు, నగరాలలో మాత్రం.. జనసేనకు కొంత మేరకు బలం ఉన్న మాట వాస్తవం. అందుకే.. కూటమి గా ఏర్పడి విజయం దక్కించుకుంది. ఇక, వచ్చే ఏడాది స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం కని పిస్తోంది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రక్రియ కూడా ప్రారంభించారు.
ఇదిలావుంటే.. స్థానిక సంస్థల్లో సత్తా చాటాలని.. జనసేన నిర్ణయించుకుంది. ఈ విషయంపై తాజాగా పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రిపవన్ కల్యాణ్ .. నాయకులకు దిశానిర్దేశం చేశారు. పార్టీని నగరాలు, పట్టణాల కే పరిమితం చేయడం కాదని.. గ్రామీణ స్థాయిలో పుంజుకునేలా చేయాలని ఆయన సూచించారు. అయితే ..ఈ వ్యవహారంపై ఎలా ముందుకు సాగాలన్నది మాత్రం నాయకులకు వదిలి పెట్టారు. ప్రస్తుతం ప్రభు త్వం తరఫున చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం వంటి వాటిని వివరించాలని ఆయన సూచించారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ప్రజల మధ్యకు వెళ్లాలని నిర్ణయించారు. గ్రామీణ స్థాయిలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. గోశాలలు నిర్మిస్తున్నారు. వీటిని చూపించే ప్రయత్నం చేయనున్నారు. ముఖ్యంగాపంచాయతీలకు నేరుగా నిధులు అందించే విషయంలోనూ పవన్ ముందున్నారు. గతంలో కేంద్రం నుంచి వచ్చిన నిధులను పంచాయతీలకు విడుదల చేయకుండా వాడేసేవారు. ఇప్పుడు అలా కాకుండా పూర్తిగా పంచాయతీలకు ఇస్తున్నారు.
అదేవిధంగా అటవీ, పంచాయతీ శాఖల మంత్రిగా పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా.. గ్రామీణ స్థాయిలో జనసేనకు ఊపు తెచ్చే అవకాశం ఉందని అంచనా వేసుకుంటున్నారు. అయితే.. ఇది ఏమేరకు ఫలిస్తుందన్నది మాత్రం జనసేనకు డౌట్‌గానే ఉంది. పట్టణాలు, నగరాల స్థాయిలో ఉన్న కేడర్ గ్రామీణ ప్రాంతాల్లో లేకపోవడంతో ఈ సమస్య వస్తోంది. ఇప్పుడు ఆదిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. ఎన్నికలకు ఇంకా ఆరుమాసాల సమయం ఉన్న నేపథ్యంలో పక్కా ప్రణాళిక వేయాలని భావిస్తున్నారు.