ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీపికబురు వినిపించారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు గుడ్ న్యూస్ చెప్పారు. దీపావళి కానుకగా లబ్ధిదారులకు మూడు లక్షల ఇళ్లు పూర్తి చేసి ఇస్తామని ప్రకటించారు. అలాగే 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని అందరికీ సొంతిల్లు ఉండేలా చూస్తామని అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ప్రకటించారు. మేనిఫెస్టో హామీలు, సూపర్ సిక్స్ పథకాలపై శనివారం రోజున అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. పేదవాళ్లకు ఉచితంగా ఇల్లు కట్టివ్వాలనేదే ప్రభుత్వం ఉద్దేశమని స్పష్టం చేశారు. మరోవైపు అక్టోబర్ నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఏపీలోని 2.9 లక్షల మంది ఆటోడ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు తెలిపారు. అర్హులైన క్యాబ్. ఆటో డ్రైవర్లకు రూ.15000 అందించి ఆదుకుంటామని అన్నారు.
మరోవైపు పేదలకు ఇంటి నిర్మాణం భారం కాకుండా ఏపీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంటి నిర్మాణ అనుమతుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. పట్టణాల్లో 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే ఇళ్లకు రూపాయికే అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే మూడు మీటర్ల ఎత్తు దాటిన భవన నిర్మాణాలల్లో బాల్కనీలను 1.5 మీటర్ల వెడల్పుతో కట్టుకునేలా కొత్తగా అవకాశం ఇచ్చారు. అలాగే సెట్‌బ్యాక్ విషయంలోనూ పలు వెసులుబాట్లు కల్పించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యా్ప్తంగా ఆరు లక్షల మందికి గృహ అవసరాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. గృహ అవసరాలపై రాష్ట్రవ్యాప్తంగా గృహ నిర్మాణ శాఖ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సుమారుగా ఆరు లక్షల మందికి ఇళ్లు అవసరం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వీరికి ఎన్టీఆర్ హౌసింగ్, టిడ్కో ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి పథకాల ద్వారా ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నారు. హౌసింగ్. టిడ్కో ద్వారా రెండు లక్షల ఇళ్లు సంక్రాంతి నాటికి పూర్తి చేసి ఇవ్వాలని అధికారులు కసరత్తు జరుపుతున్నారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఐదు లక్షల ఇళ్లను పూర్తిచేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. మొత్తంగా ఈ రెండేళ్లలో 9 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని ఏపీ హౌసింగ్ విభాగం లక్ష్యంగా పెట్టుకుంది.
అలాగే గత ప్రభుత్వంలో ఇంటి పట్టాలు పొంది, ఇళ్ల నిర్మాణాలను మొదలుపెట్టిన వారు త్వరగా నిర్మాణాలు పూర్తి చేసేలా అదనపు ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు. ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు రూ.50000 చొప్పున, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన లబ్ధిదారులకు రూ.75 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఆర్థిక సాయం అందిన తర్వాత కూడా ఇళ్ల నిర్మాణాలను మొదలుపెట్టకపోతే అలాంటి వారికి నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఏపీ గృహ నిర్మాణ శాఖ అధికారులు ఉన్నారు.