తిరుమల శ్రీవారికి ఉన్న భక్తకోటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్వామివారికి బంగారు నగలు.. కానుకలకు కొదవ లేదు. అయితే.. ఇప్పటివరకు మరే భక్తుడు సమర్పించని రీతిలో ఒక అజ్ఞాత భక్తుడు శ్రీవారికి సమర్పించే భారీ కానుకల సమాచారం బయటకు వచ్చింది. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా తెలియజేయటం గమనార్హం.
రాజులు.. రాజవంశీకుల్ని మినహాయిస్తే.. వ్యక్తిగత హోదాలో భక్తులు భారీగా స్వామి వారికి కానుకలు అందజేస్తుంటారు. అయితే.. ఒక అజ్ఞాత భక్తుడు ఏకంగా 121 కేజీల బంగారు ఆభరణాల్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చిన వైనాన్ని సీఎం చంద్రబాబు వెల్లడించారు. స్వామి భక్తుడు ఒకరు కంపెనీ పెట్టారని.. అది చాలా పెద్ద స్థాయికి వెళ్లిందని.. ఆ కంపెనీలో ఇటీవల 60 శాతం వాటాను అమ్మగా.. ఆయనకు రూ.6-7వేల కోట్లు వచ్చాయన్నారు.
ఆ సంపద మొత్తం వెంకన్న ఇచ్చిందనేనని సదరు భక్తుడు నమ్మారని.. అందుకే తనకు వచ్చిన ఆ సంపదలో కొంత భాగాన్ని స్వామివారికి తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా 121 కేజీల బంగారు ఆభరణాల్ని చేయించి స్వామి వారికి కానుకగా ఇవ్వనున్నట్లు చెప్పారు. వీటి విలువ రూ.140 కోట్లు నుంచి రూ.150కోట్ల వరకు ఉండొచ్చన్నారు. సదరు భక్తుడు తనను కలిసి ఈ విషయాన్ని స్వయంగా చెప్పారని.. కాకుంటే తన వివరాలు మాత్రం బయటకు రాకుండా చూడాలని కోరినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. వేంకటేశ్వర స్వామికి నిత్యం 120 కేజీల బంగారు ఆభరణాల్ని అలంకరిస్తారని.. ఆ విషయం తనకు కూడా తెలీదన్న చంద్రబాబు.. ‘అందుకే ఆ భక్తుడు 121 కేజీల బంగారు ఆభరణాల్ని సమర్పిస్తానని నిర్ణయించుకున్నారు. అయితే.. ఆయన మనసుకు తెలీకుండానే రోజు వారీ స్వామి వారి అలంకరించుకునే బంగారు ఆభరణాలకు మించి ఒక కేజీ అదనంగా ఇవ్వాలన్న ఆలోచన తట్టింది’’ అని చెప్పారు. అయితే.. ఈ భారీ బంగారు ఆభరణాల్ని స్వామి వారికి ఎప్పుడు సమర్పిస్తారు? ఏ రూపంలో ఇస్తారు? లాంటి వివరాలు మాత్రం బయటకు వెల్లడించలేదు. సదరు అజ్ఞాత భక్తుడు కోరినట్లుగా ఆయన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉండదని చెప్పక తప్పదు. ఏమైనా.. ఇంత భారీ ఎత్తున వ్యక్తిగత హోదాలో ఒక భక్తుడు సమర్పించటం ఇదే తొలిసారి అన్న మాట వినిపిస్తోంది.