టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమాల్లో పెద్ది కూడా ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. బుచ్చిబాబు సినిమా అంటే అందులోని పాత్రలు, కథ, ఎమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఆల్రెడీ ఉప్పెన సినిమాతో అందరూ చూశాం. ఇప్పుడు పెద్ది సినిమా అంతకుమించి ఉంటుందని సమాచారం.
అనౌన్స్‌మెంట్ తోనే భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుంది. అంతేకాదు, పెద్ది కోసం చరణ్ కెరీర్ లో మునుపెన్నడూ లేనంత కొత్తగా మేకోవర్ కూడా అయ్యారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాలో చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మేకర్స్ ఓ సాంగ్ ను షూట్ చేయగా, త్వరలోనే మరో సాంగ్ ను షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం త్వరలోనే రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై వచ్చే ఓ మాంటేజ్ సాంగ్ ను మేకర్స్ తెరకెక్కించనున్నారట. ఈ పాట కేవలం పాటలా మాత్రమే ఉండకుండా కథను ముందుకు తీసుకెళ్లేలా సాగుతూ చాలా కొత్తగా ఉండనుందని సన్నిహిత వర్గాల సమాచారం. రామ్ చరణ్, జాన్వీ కపూర్ కలిసి చేస్తున్న మొదటి సినిమా కావడంతో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడ్డానికి అందరూ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.