ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ సైతం పది రోజుల క్రితం లండన్ టూర్ ముగించుకుని రాష్ట్రానికి తిరిగివచ్చారు. ఇద్దరూ వ్యక్తిగత పర్యటనల నిమిత్తం లండన్ వెళ్లినా, ఇద్దరి పర్యటనలలో స్పష్టమైనా తేడా ఉందని సోషల్ మీడియాలో చర్చ జరగుతోంది. గతంలో కూడా జగన్ సీఎంగా ఉండగా, మూడుసార్లు లండన్ వెళ్లినా, చంద్రబాబులా రాష్ట్రం కోసం ఒక్కసారి తన పర్యటనను వినియోగించుకోలేదని విమర్శలు గుప్పిస్తున్నారు.
చంద్రబాబు సతీమణి హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) రెండు అవార్డులను ప్రకటించింది. వీటిని అందుకోడానికి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు లండన్ వెళ్లారు. నిజానికి ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ చంద్రబాబు ఖాళీ సమయాన్ని వృధా చేయలేదు. లండన్ టూర్ ను భార్యతో కలిసి విహార యాత్రలా కాకుండా.. పెట్టుబడుల వేటగా మార్చేశారు. తనతోపాటు కొందరు అధికారులను తీసుకువెళ్లిన సీఎం.. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ సదస్సుకు అక్కడి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించేందుకు వరుస సమావేశాలను నిర్వహించారు.
హిందుజా గ్రూపు నుంచి రూ.20 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంస్థ విశాఖలో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ విస్తరణకు ముందుకొచ్చింది. ఆక్టోపస్ ఎనర్జీ గ్రూప్ డైరెక్టర్ క్రిస్ ఫ్రిట్జ్ గెరాల్డ్, రోల్స్ రాయిస్ గ్రూప్ చీఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫీసర్ నిక్కీ-గ్రాడీ స్మిత్, శ్యామ్ కో హోల్డింగ్స్ ఛైర్మన్ సంపత్ కుమార్, సీఈఓ వైద్యనాథన్ తోపాటు శ్రామ్ అండ్ మ్రామ్ సంస్థ ఛైర్మన్ శైలేష్ హీరానందాని, కొసరాజు గిరిబాబు వంటి పారిశ్రామిక ప్రముఖులను కలిశారు. అదేవిధంగా సీఐఐ (CII) ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో బ్రిటిష్ హెల్త్ టెక్ ఇండస్ట్రీ, ఏఐ పాలసీ ల్యాబ్, అరూప్, ఏథెనియన్ టెక్, ఫిడో టెక్, పీజీ పేపర్ కంపెనీ వంటి సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. లండన్‌లోని భారత హైకమిషనర్ దొరైస్వామితో కూడా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరించారు.
ఇలా వ్యక్తిగత పర్యటనకు వెళ్లిన చంద్రబాబును అధికార కార్యక్రమాలు, సమావేశాల ద్వారా రాష్ట్రాభివృద్ధికి పనిచేస్తున్నారని సోషల్ మీడియా కార్యకర్తలు అభినందిస్తున్నారు. అదే సమయంలో జగన్ సీఎంగా ఉండగా, లండన్ టూర్ లో ఏం జరిగిందన్న విషయంపైనా చర్చిస్తున్నారు. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడుసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. ఈ మూడుసార్లు ఆయన లండన్ వెళ్లగా, ఒకసారి లండన్ పర్యటనతోపాటు దావోస్ ఆర్థిక సదస్సుకు వెళ్లారు. ఇక జగన్ లండన్ పర్యటనలో ప్రతిసారి కుటుంబానికి మాత్రమే పరిమితమయ్యేవారు. కుటుంబ సభ్యులతోపాటు స్నేహితులతో సరదాగా గడిపేందుకే ప్రాధాన్యమిచ్చేవారని అంటున్నారు. జగన్ కుమార్తెలు లండన్ లో ఉన్నందున ఆయన ఆ దేశానికి వెళ్లేవారని సోషల్ మీడియాలో స్పష్టం చేస్తున్నారు. ఇలా ఇద్దరి నేతల పనితీరుపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.


















