ప్రస్తుత ప్రపంచంలో ఎలాన్ మస్క్ ఓ సంచలనం అనే సంగతి తెలిసిందే. ఆయన చేసే ఏ వ్యాపారమైనా ఆకాశమే హద్దుగా లాభాల బాట పడుతుంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ భూగ్రహంపై అత్యంత ధనవంతుడిగా నిలిచిన మస్క్.. తాజాగా మరో సంచలనాన్ని సృష్టించారు. ఇందులో భాగంగా… కార్పొరేషన్ రంగంలో అత్యంత ఎక్కువ ప్యాకేజ్ గల సీఈఓ గా చరిత్ర సృష్టించారు.
అవును… ఎలోన్ మస్క్ మరోసారి ఆర్థిక రంగంలో సంచలనం సృష్టించారు. టెస్లా వాటాదారుల సమావేశంలో.. మస్క్ కు $1 ట్రిలియన్ వేతన ప్యాకేజీని (సుమారు రూ.88 లక్షల కోట్లు) ఆమోదించారు. ఇది ఆమోదం పొందకపోతే అతను కంపెనీని విడిచిపెట్టే అవకాశం ఉందనే ఆందోళనల మధ్య ఈ అంగీకారం కుదిరిందని అంటున్నారు.
ఈ అపూర్వమైన ఒప్పందానికి 75% ఓట్లు ఆమోదం తెలిపగా.. ప్రేక్షకుల నుండి భారీ చప్పట్లు వచ్చాయి. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్, రాబోయే 10 సంవత్సరాలలో ఎలక్ట్రిక్ కార్ల సంస్థ “టెస్లా” మార్కెట్ విలువను భారీగా పెంచాలి. అదే జరిగితే… అతనికి వందల మిలియన్ల కొత్త షేర్లు బహుమతిగా లభిస్తాయి.
ఇలా తన చెల్లింపును పెంచుకోవడానికి మస్క్ రాబోయే దశాబ్దంలో సాధించాల్సిన మైలురాళ్లలో టెస్లా మార్కెట్ విలువ $1.4 ట్రిలియన్ల నుండి $8.5 ట్రిలియన్లకు పెంచడం ఒకటి కాగా… పది లక్షల సెల్ఫ్ డ్రైవింగ్ రోబోటాక్సీ వాహనాలను కూడా తీసుకురావడం మరొకటి. ఈ ప్రకటన తర్వాత, మస్క్ టెక్సాస్ లోని ఆస్టిన్ లో వేదికపైకి వెళ్లి నృత్యం చేశాడు.
ఈ సందర్భంగా స్పందిస్తూ.. తాము ప్రారంభించబోయేది టెస్లా భవిష్యత్తు గురించి ఒక కొత్త అధ్యాయం మాత్రమే కాదు.. పూర్తిగా కొత్త పుస్తకం అని అన్నారు. ఈ సందర్భంగా… ఓట్ టెస్లా.కాం లో పోస్ట్ చేయబడిన ఒక వీడియోలో బోర్డు చైర్ రాబిన్ డెన్ హోమ్, డైరెక్టర్ కాథ్లీన్ విల్సన్-థాంప్సన్.. మస్క్ ను ప్రశంసిస్తున్నట్లు చూపించారు.
మరోవైపు… ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ సంపద నిధి అయిన నార్వే సావరిన్ వెల్త్ ఫండ్, అమెరికాలో అతిపెద్ద ప్రజా పెన్షన్ నిధి అయిన కాలిఫోర్నియా పబ్లిక్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సిస్టమ్ వంటి అనేక ప్రధాన సంస్థాగత పెట్టుబడిదారులు ఎలాన్ మస్క్ కొత్త వేతన ప్యాకేజీని తిరస్కరించారు.


















