అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని చింతూరు ఘాట్ రోడ్డులో భారీ విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు నగరానికి చెందిన శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ భయంకర ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందగా, మరికొందరికి తీవ్రమైన గాయాలు అయినట్లు సమాచారం.
గాయపడిన వారిని వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సు చిత్తూరు నగరంలోని మిట్టూరు ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు.
ఈ నెల 6న మొత్తం 39 మంది యాత్రికులతో చిత్తూరు నుంచి బయలుదేరిన ఈ బస్సు ఏడు రోజుల పాటు వివిధ పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ట్రిప్ నిర్వహించింది. చిత్తూరు, పరిసర ప్రాంతాల వారికి చెందిన యాత్రికులు ఈ బస్సులో ఉన్నారు. చింతూరు నుంచి మారేడుమిల్లి వైపు ప్రయాణిస్తుండగా, మారేడుమిల్లి తులసి పాకల వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం
రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలో పడిన ఘటనపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన సీఎం, ఉన్నతాధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని రక్షణ, సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే గాయపడిన వారికి అన్ని శాఖలు సమన్వయంతో ఉత్తమ వైద్యం అందించాలని సూచించారు.














