ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బధిరులకు (మూగ, చెవిటి)కు తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారికి టచ్ ఫోన్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వి కామరాజు ఓ కీలక ప్రకటన జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్ల వయసు కలిగి, ఇంటర్మీడియట్ పాసైన (ఉత్తీర్ణత) సైగల భాష వచ్చిన వారు, 40 శాతం ఆపైన వైకల్యం గలవారు అర్హులని తెలిపారు కామరాజు.
వీరి కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండాలన్నారు. ఆసక్తి గలవారు www.apdascac.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలని సూచించారు. ఆధార్ కార్డు, 10వ తరగతి, ఇంటర్ మార్కుల లిస్టులు, సదరం ధ్రువీకరణ పత్రం, సైగల భాష ధ్రువీకరణ, ఎస్సీ, ఎస్టీ, బీసీలు కుల ధ్రువీకరణ పత్రాలు పంపాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఆదాయ ధ్రువీకరణ పత్రం, తెల్ల రేషన్ కార్డు కాపీలు కావాల్సి ఉంటుంది.
Ap ప్రభుత్వం దివ్యాంగ బాలబాలికలకు సహాయం చేస్తోంది. వారికి అవసరమైన పరికరాలు అందిస్తోంది. ఈ ఏడాది పరికరాలు ఇవ్వడానికి స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. 18 ఏళ్ల లోపు వారికి పరీక్షలు చేసి, అర్హులైన వారికి పరికరాలు ఇస్తారు. సమగ్రశిక్ష ద్వారా ఈ పరికరాలు అందిస్తారు. దివ్యాంగుల స్క్రీనింగ్ శిబిరంలో పాల్గొనడానికి కొన్ని పత్రాలు అవసరం. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, సదరం సర్టిఫికెట్, యూడీఐడీ కార్డు ఉండాలి. వైకల్యం తెలిపే రెండు ఫొటోలు కూడా తీసుకురావాలి.
ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి అన్ని విభాగాల్లో పరీక్షలు చేస్తున్నారు. ఈ పరీక్షలు ఈ నెల 26తో పూర్తవుతాయి.. అర్హుల జాబితాల ప్రకారం ప్రభుత్వానికి నివేదికలు పంపుతారు. ఆ తర్వాత దివ్యాంగులకు సహాయక పరికరాలు అందజేయనున్నారు. దివ్యాంగులకు మూడు చక్రాల బండ్లు, వీల్ ఛైర్లు ఇస్తారు. చంక కర్రలు, వినికిడి యంత్రాలు కూడా ఇస్తారు. కళ్లు సరిగా కనపడని వారికి ప్రత్యేక టీఎల్‌ఎం కిట్లు ఇస్తారు. మానసిక దివ్యాంగులకు కూడా టీఎల్‌ఎం కిట్లు అందజేస్తారు.