ఆధార్ కార్డులాంటి ఫ్యామిలీ కార్డు.. సిబిల్ స్కోరును తలపించేలా ఫ్యామిలీ స్కోర్.. వినడానికి కొత్తగా ఉన్నా ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా తీసుకువస్తున్న కొత్త విధానంలో ఈ రెండు కీలక భూమిక పోషించనున్నాయని అంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎంత మేలు జరుగుతున్నదీ కూడా తెలియజేయాలని నిర్ణయించారు. ఇందుకోసం కొత్తగా ఫ్యామిలీ కార్డులను ప్రవేశపెడుతున్న చంద్రబాబు.. ఆ కార్డుల్లో ఫ్యామిలీ స్కోర్ ను తెలియజేయనున్నామని వెల్లడించారు.
ఆధార్ కార్డు సైజులో ఉండే ఫ్యామిలీ కార్డును కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికీ జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సమీక్ష నిర్వహించారు సీఎం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ స్కోర్ ఉండాలనే తన ఆలోచనను వెల్లడించారు. ప్రభుత్వం కొత్తగా జారీ చేయనున్న ఫ్యామిలీ కార్డులకు ఒక నెంబర్ కేటాయిస్తారు. దీనిలో ప్రభుత్వం తరఫున అమలు చేస్తున్న సంక్షేమ పథకాల సమాచారం మొత్తం ఉంటుందని వెల్లడించారు.
ప్రభుత్వం తరఫున జారీ చేస్తున్న ఈ ఫ్యామిలీ కార్డులు ఆయా కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే అవకాశం ఉంటుందని అంటున్నారు. ప్రతి కుటుంబం కనీస అవసరాలు తెలుసుకుంటూ వారికి అందజేయాల్సన సంక్షేమంపై తగన ప్రణాళిక రచించేందుకు ఒక సమగ్ర సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఫ్యామిలీ కార్డు వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలతోపాటు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు కూడా ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ఫ్యామిలీ కార్డులు దోహదపడతాయని అంటున్నారు.
ప్రజలే ఆస్తి, వారి ద్వారానే రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి జరుగుతుందని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. గతంలో జనాభా ఎక్కువగా ఉంటే ఆర్థికంగా అభివృద్ధి చెందలేమని భావించేవారని, కానీ ఇప్పుడు జనాభా పెరిగితేనే సంపద పెరిగే రోజులొచ్చాయని సీఎం భావిస్తున్నారు. అందుకే జనాభా నియంత్రణపై ఉన్న ఆంక్షలు తొలగించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో పాపులేషన్ పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.