ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి తాను అనని మాటల్ని అన్నట్లుగా నకిలీ పోస్టుల్ని క్రియేట్ చేసి.. దిగ్గజ సోషల్ మీడియా నెట్ వర్కు అయిన ఫేస్ బుక్ తో పాటు మరికొన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వైనంపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కూటమి పార్టీల మధ్య విభేదాల్ని క్రియేట్ చేయాలని.. వివిధ సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు.. శత్రుత్వం పెంచేలా చేస్తున్న తీరుపై ఫిర్యాదు చేశారు.
‘జగన్ అన్న అభిమాని’ పేరుతో నిర్వహిస్తున్న ఫేస్ బుక్ ఖాతాను వైసీపీ మద్దతుదారు అయిన అంబోజి వినయ్ కుమార్ తో పాటు మరికొందరిపైనా రఘురామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను తాను అనని మాటల్ని అన్నట్లుగా నకిలీ పోస్టుల్ని క్రియేట్ చేస్తున్నారని.. దీంతో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగిస్తూ.. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో అతడిపై బీఎన్ఎస్ లోని 196.. సెక్షన్ 353.. సెక్షన్ 356 తదితర నేరాల కింద అతనిపై కేసు నమోదు చేయాలని కోరారు. వినయ్ కుమార్ తో పాటు బాధ్యులందరిపైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరతూ.. దీనికి సంబంధించిన నకిలీ పోస్టులు.. స్క్రీన్ షాట్లు.. లింక్ లను పోలీసులకు అందజేశారు. మరి.. పోలీసులు ఎలా రియాక్టు అవుతారో? ఈ పేజీ వెనుక ఉన్న వారెవరన్న విషయంపై ఏం చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.















