గడిచిన కొన్నేళ్లుగా వివాహేతర సంబంధాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఈ మధ్యన అవి మరింత శ్రుతిమించటమే కాదు.. కుటుంబాలకు శాపంగా మారుతున్నాయి. పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధాల మోజులో నేరాల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ మధ్యన హత్యల వరకు వెళుతున్న దుస్థితి. ఒంటరితనం.. భాగస్వామ్యుల నుంచి తాము కోరుకుంటున్న ప్రేమ.. అప్యాయతల విషయంలో పెరుగుతున్న అంతరం దంపతుల మద్య దూరాన్ని పెంచుతోంది. మారిన జీవనశైలి దీనికి మరింత కారణమవుతోంది.
అదే సమయంలో అంది వచ్చిన సాంకేతికత వివాహ బంధాలు బీటలు వారేలా చేస్తున్నాయి. వ్యామోహాల్ని పెంచేలా చేయటం.. ఆ ఉచ్చులో చిక్కుకున్న పలువురు పచ్చని కుటుంబాల్ని పాడు చేసుకుంటున్న దుస్థితి. వివాహేతర సంబంధాలు దేశంలో అత్యధికంగా ఉన్న ప్రాంతాలపై ఒక సంస్థ అధ్యయనం చేసింది. ఇందుకు పలు అంశాల్ని ప్రాతిపదికగా చేసుకొని దేశంలో టాప్ 20 ప్రాంతాల్ని మాడిసన్ తన నివేదికలో పేర్కొంది. అనూహ్య రీతిలో వివాహేతర సంబంధాల్లో టాప్ వన్ స్థానంలో ఎవరూ ఊహించని విధంగా తమిళనాడులోని కాంచీపురం నిలవటం అందరిని విస్తుపోయేలా చేసింది. దేశ రాజధాని ఢిల్లీ.. దేశ ఆర్థిక రాజధాని ముంబయి.. ఐటీకి కేరాఫ్ అడ్రస్ గా ఉండే గుర్ గావ్.. బెంగళూరు నగరాలకు మించిన కాంచీపురం జాబితాలో అగ్రస్థానంలో ఉండటం విశేషం. వివాహేతర సంబంధాలున్న నగరాల జాబితాలో టాప్ 20లో ఢిల్లీ.. ఎన్ సీఆర్ లోని తొమ్మిది ప్రాంతాలు ఉండటం గమనార్హం.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ మహానగరం టాప్ 20లో 18వ స్థానంలో నిలిచింది. అదే సమయంలో గార్డెన్ సిటీ బెంగళూరు తొమ్మిది స్థానంలో నిలిచింది. వివాహేతర సంబంధాల్లో దేశంలో దక్షణాది రాష్ట్రాలు తక్కువగా ఉండగా.. ఉత్తరాదికి చెందిన ప్రాంతాలే అత్యధికంగా ఉండటం మరో ఆసక్తికర కోణంగా చెప్పాలి. మాడిసన్ రిపోర్టు ప్రకారం టాప్ 20 నగరాల్ని చూస్తే.. 1. కాంచీపురం 2. సెంట్రల్ ఢిల్లీ 3. గుర్గావ్ 4. గౌతమ్ బుద్ధనగర్ 5. నైరుతి ఢిల్లీ 6. డెహ్రాడూన్ 7. తూర్పు ఢిల్లీ 8. ఫుణే 9. బెంగళూరు 10. దక్షిణ ఢిల్లీ 11. చండీగఢ్ 12. లక్నో 13. కోల్ కతా 14. పశ్చిమ ఢిల్లీ 15. కామరూప 16. వాయువ్య ఢిల్లీ 17. రాయగఢ్ 18. హైదరాబాద్ 19. ఘజియాబాద్ 20. జైపూర్