జాతీయ స్థాయిలో గత రెండు మూడు రోజులుగా ఒకటే రచ్చ సాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం మీద అణుబాంబు పేలుస్తాను అంటూ వచిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తాజాగా ఆ బాంబు పేల్చారు. ఆయన కర్ణాటకలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం తో పాటు మహారాష్ట్ర సహా కొన్ని కీలకమైన పాకెట్స్ ని ముందు పెట్టి మరీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2024 లో జరిగిన లోక్ సభ ఎన్నికలతో పాటు ఆ తరువాత జరిగిన వివిధ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మాల్ ప్రాక్టీస్ సాగింది అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఫేక్ ఓట్లు దొంగ ఓట్లు ఓట్ల చోరీ అని భారీ పదాలనే ఆయన వాడారు.
రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల మీద జాతీయ స్థాయిలో అయితే పెద్ద చర్చ సాగుతోంది. బిగ్ డిబేట్ పెట్టి మరీ చానల్స్ సైతం చర్చాగోష్టులు పెట్టాయి. ఇక మేధావులు ప్రజాస్వామ్య ప్రియులు అంతా ఎవరికి వారుగా స్పందిస్తున్నారు. అంతే కాదు ఇండియా కూటమిలోని పార్టీలతో పాటు ఇతర పార్టీలు కూడా రాహుల్ గాంధీ ఆరోపణల మీద సానుకూలంగా రియాక్ట్ అవుతున్నాయి. కానీ ఏపీలో మాత్రమే చిత్రమైన పరిస్థితిగా ఉంది.
రాహుల్ గాంధీ ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన తరువాత ఏపీ నుంచి బీజేపీ ప్రెసిడెంట్ పీవీఎన్ మాధవ్ మాత్రమే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆయన రాహుల్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష హోదాను సైతం రాహుల్ గాంధీ దుర్వినియోగం చేస్తున్నారు అన్నారు. ఇక టీడీపీ కూటమిలోని జనసేన టీడీపీ అయితే మౌనంగా ఉన్నాయి. కానీ ఎన్డీయే కూటమికి చెందని వైసీపీ సైతం మౌనంగా ఉండడమే విశేషం అని అంటున్నారు.
ఇక చూస్తే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు అయిన తరువాత జగన్ సహా వైసీపీ కీలక నేతలు అంతా అవే ఆరోపణలు చేశారు. ఏకంగా ఈవీఎంల ప్రభుత్వం అన్నారు. జగన్ అయితే బాలెట్ పేపర్ మీదనే ఎన్నికలు కావాలని కోరారు. కొందరు వైసీపీ నేతలు మాల్ ప్రాక్టీస్ 2024 ఎన్నికల్లో జరిగింది అని కోర్టుకు కూడా వెళ్లారు. ఇంత జరిగినా కూడా వైసీపీ నేతలు అంతా జగన్ సహా మౌనంగా ఉండడం మీదనే చర్చ సాగుతోంది ఎందుకు జగన్ ఈ విధంగా వ్యహరిస్తున్నారు అని అంతా అనుకుంటున్నారు.
రాహుల్ గాంధీ ఆరోపణలను అందిపుచ్చుకుని జగన్ కానీ వైసీపీ పెద్దలు కానీ మాట్లాడితే ఇబ్బంది అవుతుందనే ఈ విధంగా చేస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది. వైసీపీ అధినాయకత్వం మీదనే నేరుగా కేసులు ఉన్నాయి. ఒక వైపు మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే కొత్తగా లిక్కర్ స్కాం తెర మీదకు వచ్చింది. ఈ కేసులో ఈడీ సైతం ఎంట్రీ ఇస్తోంది అంటున్నారు ఇలా అనేక రకాలుగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యం ఉంది. అందుకే మౌనంగా ఉన్నారా అన్నదే ప్రచారంగా ఉంది అంటున్నారు. ఏది ఏమైనా రాహుల్ గాంధీ ఆరోపణల మీద వైసీపీ క్యాడర్ దిగువ స్థాయిలో మాత్రం పూర్తి మద్దతు దక్కుతోంది. కానీ వైసీపీ అగ్ర నాయకత్వం అయితే పెదవి విప్పడం లేదు. మొత్తం మీద జగన్ మౌనం మీద రకరకాలైన వ్యాఖ్యానాలు అయితే ఉన్నాయి. కానీ ఇదే కదా సరైన సమయం వైసీపీ కూడా గట్టిగా సౌండ్ చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది అని అంటున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈవీఎంలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఈ విషయంపై కర్ణాటక ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు, చూపించిన నెంబర్లతో ఒక్కసారిగా ఈ చర్చ మరింత తీవ్రంగా మారింది. ఇక ఏపీలో 2024 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఈ చర్చ మరింత బలంగా మొదలైన సంగతి తెలిసిందే.
అవును… 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయం సాధించిన వైసీపీ 2024 ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైపోవడానికి గల కారణం ఈవీఎంలలో జరిగిన మోసాలే అని నాటి నుంచి నేటి వరకూ బలంగా వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో కూటమి ప్రభుత్వం అంటే ఈవీఎం లే అని ట్రోల్స్ ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారుతున్నాయి.
“ఏపీలో కూటమి గెలిచింది.. అంటే.. టీడీపీ గెలిచింది, జనసేన పార్టీ గెలిచింది.. భారతీయ జనతాపార్టీ కూడా గెలిచిందని అంటున్నారు.. కానీ, గెలిచింది కూటమి పార్టీలు కాదు.. గెలిచింది ఈవీఎంలు” అంటూ నారా లోకేష్ వీడియోలతో నెటిజన్లు ట్రోలింగ్స్ బలంగా మొదలుపెట్టారు. ఆ మాటలతో ‘జల్సా’లో పవన్ కల్యాణ్ పడిన ఆవేదన సన్నివేశాన్ని జత చేశారు. ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే! ఇలాంటి ఎన్నో ట్రోల్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు వీటిని షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియాను కుదిపేస్తున్నారు.
ఈ ట్రోలింగ్స్ సంగతి అలా ఉంటే… గత ఎన్నికల్లో దేశం మొత్తం మీద ఈవీఎంలలో ఏదో జరిగిందనే చర్చ మాత్రం ఓ వర్గం ఓటర్లలో బలంగా మొదలైందని కొంతమంది అంటుండగా… అప్పటి అధికార పార్టీల పరిస్థితి గురించి ఇప్పుడు మరిచిపోవడం వల్ల అలాంటి కామెంట్లు చేస్తున్నారని మరొక వర్గం వారు వాదిస్తున్న పరిస్థితి. మరోవైపు 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో కర్ణాటక అసెంబ్లీ సెగ్మెంట్ లో భారీ ఓటర్ల మోసం జరిగిందని దర్యాప్తులో తేలిందని.. ఎన్నికలను దొంగిలించడానికి ఎన్నికల సంఘం అధికార బీజేపీతో కుమ్మక్కైందని ఆరోపించిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.