చరిత్రలో ఏ సీఈఓకు లేనంత జీతం ప్యాకేజీతో ఎలాన్ మస్క్ రికార్డు పుస్తకాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. టెస్లా వాటాదారుల సమావేశంలో.. మస్క్ కు $1 ట్రిలియన్ వేతన ప్యాకేజీని ఆమోదించారు. దీంతో ఎలాన్ మస్క్ సంపద టాపిక్ మరోసారి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మస్క్ ఇంత డబ్బును ఏమి చేస్తారు.. ఎలా ఖర్చు పెట్టుకుంటారనేది ఆసక్తిగా మారింది.
అవును… ఇప్పటికే ఈ భూగ్రహంపై అత్యంత ధనవంతుడిగా నిలిచిన ఎలాన్ మస్క్ కు ఒకటి పక్కన 12 సున్నాలు పెడితే ఎంతవుతుందో అంత డబ్బుతో ఏమి చేస్తాడు, ఎలా ఖర్చు పెడతాడు అనేది ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆ డబ్బుతో ఈ ప్రపంచ అకలిని అంతం చేయవచ్చు. అయితే ఎలాన్ మస్క్ డబ్బు ఖర్చు చేసే విషయంలో రెండు రకాల వెర్షన్స్ వినిపిస్తున్నాయి.
ఇందులో భాగంగా… మస్క్ చాలా సింపుల్ లైఫ్ అనుభవిస్తారాని, ఉన్నవాటితో సర్ధుకుపోతారే తప్ప భారీ లగ్జరీని పెద్దగా ప్రిఫర్ చేయడని చెబుతుంటారు కొంతమంది. మరోవైపు పలు అంతర్జాతీయ మీడియాల్లో వచ్చిన కథనాల్లో.. మస్క్ దగ్గర అద్భుతమైన లగ్జరీ లైఫ్ కి సంబంధించిన సౌకర్యాలు ఉన్నాయని చెబుతారు. అయితే వాటిలో కొన్నింటిపై అధికారిక ధృవీకరణ రాని పరిస్థితి.
ఎలాన్ మస్క్ అసలు బిలియనీర్లా జీవించడు సరికదా.. కొన్ని సార్లు దారిద్ర్యరేఖకు దిగువన కూడా జీవిస్తుంటాడంటూ అతని మాజీ పార్టనర్ గ్రిమ్స్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 2022లో వానిటీ ఫెయిర్ లో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదే సమయంలో. ఆమె ఎటువంటి భద్రా లేకుండా $40,000 ఇంటిలో నివసించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు!
మరోవైపు మస్క్ లో ఉన్న ఈ జాగ్రత్త, పొదుపు చర్యలు, కాస్త పిసినారితనాన్ని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గుర్తించారని.. అందుకే ఆయనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) విభాగ నాయకత్వ బాధ్యతలు అప్పగించి ఉంటారని చెబుతారు.
ఇదే సమయంలో… తనకు డబ్బుపై ఉన్న వ్యామోహం, అవసరం గురించి గతంలో మస్క్ చేసిన ట్వీట్ ను పలువురు ఈ సందర్భంగా కోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా…. తనకు డబ్బు అవసరం లేదని.. తనను తాను అంగారక గ్రహం, భూమికి అంకితం చేసుకుంటున్నానని.. ఆస్తిపాస్తులు మిమ్మల్ని బరువుగా చేస్తాయని ఎలాన్ మస్క్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
పైన చెప్పుకున్న పొదుపు, జాగ్రత్త, సింపుల్ సిటీ, పిసినారి అనే వెర్షన్స్ అలా ఉంటే… మరోవైపు మస్క్ దగ్గర అత్యంత విలువైన ఆస్తులతో పాటు లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయని చెబుతుంటారు. ఇందులో భాగంగా… తన 11 మంది పిల్లలు, ముగ్గురు మాజీ భాగస్వాములను ఉంచడానికి టెక్సాస్ లో 14,400 చదరపు అడుగుల కాంపౌండ్ ను $35 మిలియన్లకు ట్రంప్ రహస్యంగా కొనుగోలు చేసినట్లు చెబుతుంటారు.
ఇదే సమయంలో… అతని వద్ద జలాంతర్గామిగా మారగల ఒక కారు కూడా ఉందని.. పది లక్షల డాలర్ల విలువైన అనేక గల్ఫ్ స్ట్రీమ్ మోడల్ లతో సహా ప్రైవేట్ జెట్ కలక్షన్ కూడా ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి! వీటితో పాటు ఆయన వద్ద ఉన్న వాహనాల్లో 20వ శతాబ్దపు తొలి భారీ ఉత్పత్తి ఫోర్డ్ మోడల్ టీ కూడా ఉందని.. దీంతోపాటు 1967 జాగ్వార్ ఈ-టైప్ రోడ్ స్టర్, మొదటి టెస్లా మోడల్ టెస్లా రోడ్ స్టర్ కూడా ఉన్నాయని అంటారు.
వీటిలో.. అత్యంత ప్రత్యేకమైన వాటిలో.. 1977 జేమ్స్ బాండ్ చిత్రం ‘ది స్పై హూ లవ్డ్ మీ’లో ప్రదర్శించబడిన 1976 మోడల్ లోటస్ ఎస్ప్రిట్ ఒకటని అంటారు. ఈ సినిమాలో వెట్ నెల్లీ అనే మారుపేరుతో ఉన్న ఈ కారు జలాంతర్గామిగా రూపాంతరం చెందగలదు. మస్క్ ఈ కారును వేలంలో దాదాపు $1 మిలియన్లకు కొనుగోలు చేసినట్లు చెబుతారు!


















