హైదరాబాద్‌లో విద్యుత్ స్తంభాలపై వేలాడుతున్న కేబుళ్లను విద్యుత్ శాఖ అధికారులు తొలగిస్తుండటంతో ఇంటర్నెట్ సేవలు తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాయి. దీనివల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులు, ఆన్‌లైన్ క్లాసులు చెప్పే ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కేబుల్ కోత చర్యల మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. సమస్య ఒకటి అయితే పరిష్కారం ఇంటర్నెట్ కట్ చేసి ఈ ప్రభుత్వం తుగ్గక్ చర్యలకు పాల్పడుతోందని ఫైర్ అయ్యారు.
ఇటీవల హైదరాబాద్‌లోని బండ్లగూడ , రామంతాపూర్ ప్రాంతాల్లో విద్యుత్ షాక్‌ల కారణంగా నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు, విద్యుత్ శాఖ అధికారులు భద్రతా చర్యలలో భాగంగా విద్యుత్ స్తంభాలపై వేలాడుతున్న అన్ని అనధికారిక కేబుళ్లను తొలగించడం ప్రారంభించారు. ఈ చర్యలలో భాగంగా ఇంటర్నెట్ , కేబుల్ టీవీ లైన్లు కూడా పెద్ద సంఖ్యలో తెగిపోతున్నాయి.
విద్యుత్ శాఖ చర్యలపై ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ISPs) తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ మాట్లాడుతూ ఇంటర్నెట్ కేబుళ్లలో కరెంట్ ఉండదని, కాబట్టి వాటికి విద్యుత్ షాక్‌లకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. విచక్షణారహితంగా కేబుళ్లను కత్తిరించడం వల్ల ఇంటర్నెట్ కనెక్టివిటీ దెబ్బతింటోందని, ఇది డిజిటల్ ఇండియా లక్ష్యానికి పెద్ద అడ్డంకిగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇంటర్నెట్ అంతరాయం కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు తమ పనిని పూర్తి చేయలేక ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. ఆన్‌లైన్ క్లాసులు నిలిచిపోవడంతో విద్యార్థుల చదువులు దెబ్బతింటున్నాయి.ఆన్‌లైన్ బిల్లింగ్, డిజిటల్ లావాదేవీలు.. వీడియో కాన్ఫరెన్స్‌లు ఆగిపోవడంతో వ్యాపార సంస్థలు ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నాయి.
ఈ సమస్యను పరిష్కరించడానికి ఇంటర్నెట్ మరియు కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ (Joint Action Committee) సభ్యులు ఎస్పీడీసీఎల్ సీఎండీని కలిసి చర్చలు జరిపారు. సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ఒక ప్రణాళికతో రావాలని సీఎండీ సూచించారు. రేపు మరల సమావేశమై ఈ విషయంపై చర్చించాలని నిర్ణయించారు. ఈ చర్చలు విఫలమైతే, తమ కార్యాచరణ ప్రకటిస్తామని, అవసరమైతే ఇంటర్నెట్ సేవలను నిలిపివేసే ఆలోచనలో ఉన్నట్లు జేఏసీ హెచ్చరించింది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు అవసరమే అయినప్పటికీ, అవి డిజిటల్ కనెక్టివిటీని ప్రభావితం చేయకుండా చూసుకోవడం ముఖ్యం. ఇంటర్నెట్ ఒక నిత్యావసర సేవగా మారిన ఈ రోజుల్లో విద్యుత్ భద్రత , డిజిటల్ మౌలిక సదుపాయాల మధ్య సమతుల్యత సాధించడం అత్యవసరం. సమస్యకు ఒక సమగ్ర.. సుస్థిర పరిష్కారం కనుగొనడానికి ఇరు పక్షాలు కలిసి పని చేయడం ఇప్పుడు ఎంతైనా అవసరం.