ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా భారత మార్కెట్‌లో గత కొన్ని నెలలుగా మంచి వృద్ధి కనిపిస్తోంది. అయితే, ఇప్పటికీ చాలా మంది ఎక్కువ బ్యాటరీ రేంజ్, ఛార్జింగ్ సదుపాయాలు లేకపోవడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికి వెనుకాడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, చైనా టెక్ కంపెనీ హువావే (Huawei) ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేసింది.
కంపెనీ ఒక కొత్త సాలిడ్-స్టేట్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీని అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది. ఇది ఒక్క ఛార్జ్‌పై 3000 కి.మీ.లకు పైగా రేంజ్ ఇస్తుందని, అంతేకాకుండా, కేవలం 5 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. కంపెనీ దాఖలు చేసిన పేటెంట్ ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీలో నైట్రోజెన్-డోప్డ్ సల్ఫైడ్ ఎలక్ట్రోలైట్లు ఉన్నాయి.
ఇవి ఎనర్జీ డెన్సిటీని 400-500 Wh/kg వరకు పెంచుతాయి. ఇది ప్రస్తుతం ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీల కంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ. అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల కేవలం 5 నిమిషాల్లో 0-100% ఛార్జ్ అవుతుంది.
ప్రస్తుతం సాలిడ్-స్టేట్ బ్యాటరీలను కమర్షియల్ గా ఉత్పత్తి చేయడంలో అతిపెద్ద అడ్డంకి, లిథియం ఇంటర్‌ఫేస్ స్థిరీకరణ, హానికరమైన ప్రభావాల ప్రమాదాన్ని తగ్గించడం. పేటెంట్ ప్రకారం, సల్ఫైడ్ ఎలక్ట్రోలైట్ల నైట్రోజెన్ డోపింగ్ ద్వారా ఈ రెండు సవాళ్లను అధిగమించవచ్చని తెలుస్తోంది.
అయితే, పరిశ్రమ నిపుణులు దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సిద్ధాంతపరంగా ఇది చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే ప్రోటోటైప్‌లలో రియల్ వరల్డ్ లో ఇది అసాధ్యమని అంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ వాదనలు కేవలం ల్యాబ్ ఫలితాల ఆధారంగా ఉన్నాయి. అధిక ఉత్పత్తి ఖర్చుల కారణంగా ఈ మోడల్‌ను వాస్తవ ప్రపంచంలో, భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి అనేక సవాళ్లు ఉన్నాయి.
సల్ఫైడ్ ఎలక్ట్రోలైట్లు చాలా ఖరీదైనవి అని, వాటి ధర దాదాపు 1 kWh కు 1,400 డాలర్లు (సుమారు రూ.1.20 లక్షలు) ఉంటుందని నిపుణులు తెలిపారు. హువావే చెబుతున్న 3000+ కి.మీ.ల డ్రైవింగ్ రేంజ్ సీఎల్‌టిసి ఆధారంగా లెక్కించబడింది. దీనికి భిన్నంగా, ఈపీఏ సైకిల్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ఈ రేంజ్ 2000+ కి.మీ.లకు తగ్గుతుంది.
అయినప్పటికీ, ఇది ఇప్పటికీ ప్రపంచంలో అమ్ముడవుతున్న ఏ ఎలక్ట్రిక్ వాహనం కంటే చాలా ఎక్కువ. ప్రస్తుతం, హువావే పవర్ బ్యాటరీల తయారీ వ్యాపారంలో లేదు, కానీ ఇటీవల కంపెనీ బ్యాటరీ పరిశోధన, మెటీరియల్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడం చూస్తుంటే, భవిష్యత్తులో ఈ రంగంలో కూడా ప్రధాన కంపెనీగా మారడానికి ఆసక్తిగా ఉందని తెలుస్తోంది..
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: టయోటా, శాంసంగ్ ఎస్‌డిఐ, సీఏటీఎల్ వంటి అనేక ప్రముఖ గ్లోబల్ బ్యాటరీ తయారీ కంపెనీలు 2027 నుంచి 2030 వరకు సాలిడ్-స్టేట్ బ్యాటరీలను కమర్షియల్ గా ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. హువావే ఈ కొత్త ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ వాదన నిజమైతే, ఇది ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీని పూర్తిగా మార్చేయగలదు. ఇది రేంజ్ ఆందోళన, ఛార్జింగ్ ఆలస్యాన్ని పూర్తిగా తొలగిస్తుంది. అయితే, అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ రేట్‌లకు మద్దతు ఇచ్చే మౌలిక సదుపాయాలు లేకపోవడం కూడా ఒక పెద్ద సవాలే.