కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఏపీలో ఇపుడు హాట్ టాపిక్ గా మారారు. ఎక్కడ చూసినా రాహుల్ గురించే చర్చ మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ రాహుల్ గాంధీ గురించే చర్చ. ఏపీ జనాలు అయితే రాహుల్ గాంధీ వైపు ఎందుకు ఇంత ఆసక్తిగా చూస్తున్నారు అంటే ఆయన ఢిల్లీ వేదికగా ఈసీ మీద తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. అంతే కాదు సీరియస్ గానే అనేక ఆరోపణలు చేశారు. ఓట్ల చోరీని కేంద్ర ఎన్నికల సంఘం చేస్తోంది అని రాహుల్ గాంధీ ఢిల్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ కి దేశమంతా షేక్ అయింది. ఏపీలో అయితే రాజకీయంగా ప్రకంపనలు పెద్దగా లేకపోయినా జనంలో మాత్రం విస్తృత స్థాయిలో చర్చ అయితే సాగుతోంది.
రాహుల్ గాంధీ చేసిన ప్రధాన ఆరోపణలు చూస్తే లక్షలలలో ఓట్లు గల్లంతు అయ్యాయని విపక్షాలకు కాకుండా బీజేపీకి అనుకూలంగా ఈసీ పనిచేసింది అని చెప్పారు. ఈసీ సరైన తీరులో వ్యవహరించకపోవడం వల్ల ఒకే వ్యక్తి అనేక చోట్ల ఓట్లు వేయగలిగారు అన్నారు. అలాగే ఒకే ఇంట్లో నుంచి వందల ఓట్లు పోల్ అయిన వింతలూ జరిగాయని అన్నారు. దారుణమైన వ్యత్యాసంతో ప్రజాభిప్రాయం చాలా చోట్ల మారిందని అన్నారు 2024 లోక్ సభ ఎన్నికల నుంచి ఈ విధంగానే జరుగుతూ వచ్చిందని అన్నారు. అంతే కాదు అనేక రాష్ట్రాలలో ఫలితాలు తీర్పులు తారు మారు అయ్యేలా ఓట్ల చోరీ జరిగిందని ఆయన చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.
దేశంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీతో ఈసీ కుమ్మక్కు అయిందని దాని వల్ల భారీ ఎన్నికల మోసానికి తెర తీశారు అన్నారు. ఇది దేశ ద్రోహం కంటే ఎక్కువ అని ఆయన మండిపడ్డారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూర్ సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని మహాదేవపురా శాసనసభ స్థానంలో ఏకంగా లక్షకు పైగా ఓట్ల దోపిడీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు
తమ వద్ద అణుబాంబు లాంటి ఆధారాలు ఉన్నాయని పదే పదే చెప్పిన రాహుల్ గాంధీ వాటి మీద పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో ఈసీ మీద తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. నిజంగా ఓటర్ల చోరీ అన్నది ఎక్కడెక్కడ జరిగింది ఏ రాష్ట్రాలలో ఏ అసెంబ్లీ లోక్ సభ నియోజకవర్గాలలో అన్నది ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ గా వివరించారు. ఇదంతా తమ సొంత బృందాలు ఆరు నెలల పాటు చేసిన పరిశోధన అన్నారు. అనూహ్యమైన తీరులో ఈ పరిశోధన ఫలితాలు వచ్చాయని రాహుల్ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో ఏపీలోని వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఏకీభవిస్తున్నారు వారంతా సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ కామెంట్స్ ని పోస్టు చేస్తూ పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో ఈవీఎం ప్రభుత్వం ఉందని వైసీపీ నేతలు అంటున్న నేపథ్యం ఉంది. దానికి రాహుల్ వ్యాఖ్యలు తోడు కావడంతో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అయితే ఫలితాలు మారాయని ఏపీలో అంతా గోల్ మాల్ గానే జరిగిందని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఏపీలో రాజకీయాల పట్ల అవగాహన ఉన్న జనంలోనూ రాహుల్ గాంధీ ఆరోపణల మీద చర్చ అయితే సాగుతోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు అయింది. కేవలం 11 సీట్లు మాత్రమే ఆ పార్టీకి వచ్చాయి. ఇంత ఘోరంగా ఓటమి పాలు కావడం అయితే వైసీపీ పెద్దలకు ఇప్పటికే మింగుడు పడడం లేదు. అయితే రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంటూ చేసిన ఆరోపణలు విపక్షాలు ఉన్న రాష్ట్రాలలో చర్చకు కారణం అవుతున్నాయి. ఏపీలో అదే వాతావరణం ఉంది. వైసీపీ అయితే అధికారికంగా దీని మీద ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం వైసీపీ అభిమానులు యాక్టివిస్టులు ఘాటుగానే స్పందిస్తున్నారు. మరో వైపు చూస్తే జనంలో కూడా అవునా ఈ విధంగా జరిగే అవకాశం ఉందా అన్నదే చర్చగా ఉంది. చూడాలి మరి రాహుల్ వ్యాఖ్యల పరిణామాలు ఏపీలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో.