ఏడాది క్రితం వరకూ కోర్టు రూమ్‌లో నిశిత వ్యాఖ్యలు, కీలక తీర్పులతో ప్రముఖంగా వార్తల్లో ఉన్న సీజేఐ డీవై చంద్రచూడ్.. ఆదివారం మరో రకమైన వార్తతో ప్రచారంలోకి వచ్చారు. గత నవంబర్‌లో పదవీ విరమణ చేసిన ఆయనను అధికార నివాసం నుంచి ఖాళీ చేయించాల్సిందిగా సుప్రీంకోర్టు తాజాగా కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో సోషల్ మీడియా ట్రోలర్స్ ‘పన్ను చెల్లింపుదారుల సొమ్ము’, ‘ఫాల్ ఫ్రమ్ గ్రేస్’ అంటూ మాజీ సీజేఐపై అస్త్రాలు సంధించారు. దీనిపై చంద్రచూడ్ స్పందించారు. ఇల్లు ఖాళీ చేయడంలో తలెత్తిన జాప్యానికి కారణాలు వివరించారు. తన కుమార్తెల ప్రత్యేక అవసరాలకు అనుగుణమైన ఇల్లును వెతుక్కోవడంలో తనకెదురైన సవాళ్లను ఆయన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ గురించి తనకు బాగా తెలుసునని, ప్రభుత్వ నివాసంలోనే ఉండిపోవాలని తాను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా ఇల్లు ఖాళీ చేస్తానని తెలిపారు.
తన కుమార్తెలైన ప్రియాంక, మహికి తల్లిదండ్రుల సంరక్షణ ఎంత అవసరమో, వారితో సంతోషంగా తాను, తన భార్య కల్పనాదాస్ ఎలా జీవిస్తున్నామో మాజీ సీజేఐ చంద్రచూడ్ వివరించారు. ఇరవై నాలుగు గంటలూ కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తమ పిల్లల పరిస్థితి, అన్ని విధాలా వారికి అనువైన నివాసం అవసరాన్ని చంద్రచూడ్ ఈ సందర్భంగా వివరించారు.
ప్రియాంక, మహి.. ‘నెమలైన్ మయోపతి’ అనే అరుదైన జెనిటిక్ డిజార్డర్‌ను ఎదుర్కొంటున్నారని, అస్థిపంజర కండరాలపై దీని ప్రభావం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం దీనికి ప్రపంచంలో ఎక్కడా సరైన చికిత్స కానీ, వ్యాధి నిర్మూలన కానీ లేదని చెప్పుకొచ్చారు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ దీనిపై ఇంకా రీసెర్చ్ కొనసాగుతూనే ఉందని చెప్పారు. నెమలైన్ మయోపతి ప్రభావం శ్వాసకోశ వ్యవస్థపై తీవ్రంగా పడుతుందని.. గుటక వేయడం, శ్వాసపీల్చడం, మాట్లాడటం చాలా కష్టమవుతుంటుందని వివరించారు.
ప్రియాంక, మహిలకు ప్రతి రోజూ రెస్పిరేటరీ, న్యూరోలాజికల్ నుంచి ఆక్యుపేషనల్ థెరపీ, పెయిన్ మేనేజిమెంట్ వరకూ వివిధ తరహాల్లో ఎక్స్‌ర్‌సైజ్ అవసరమవుతుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న నివాసంతో బాత్‌రూంలతో సహా అన్నింటిని వారి అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయడం జరిగిందని తెలిపారు. ఇల్లు మారాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక ఇంటిలోకి మారాలని తాము అనుకోవడం లేదని చెప్పారు. అద్దె చెల్లించే విధంగా తాత్కాలిక నివాసాన్ని ప్రభుత్వం తనకు ఇంతకుముందు కేటాయించిందని, ఆ ఇల్లు గత రెండేళ్లుగా వినియోగంలో లేదని, ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఆ పనులు పూర్తి కాగానే సాధ్యమైనంత త్వరలో అక్కడికి వెళ్లిపోతామని చెప్పారు. ఇంట్లోని అన్ని వస్తువులు దాదాపు ప్యాక్ చేసి ఉంచుకున్నామని వివరించారు.
తన కుమార్తెల పరిస్థితిని మరింత వివరిస్తూ, వారే తమ ప్రపంచమని, వారి శ్రేయస్సు చుట్టూనే తమ ఆలోచనలు తిరుగుతున్నాయని చెప్పారు. పల్మనాలజిస్టులు, ఐసీయూ స్పెషలిస్టులు, న్యూరాలజిస్టులు, రెస్పిరేటర్ థెరిపిస్ట్‌లు, ఆక్యుపేషనల్ థెరపిస్టులు, సైకలాజికల్ థెరపిస్టులు, స్పీచ్ థెరపిస్టులు, కౌన్సెలర్ల సహా హెల్త్‌కేర్ స్పెషలిస్టులు రోజువారీ, వీక్లీ బేసిస్‌లో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ప్రియాంక 2021 నుంచి రెస్పిరేటర్ సపోర్ట్‌తో ఉందని, BiPAP మెషీన్‌కు ట్రాకియేస్టమీ ట్యూబ్ కనెక్ట్ అయి ఉంటుందని చెప్పారు. మూడేళ్ల ప్రాయం నుంచి పీజీఐ చండీగఢ్‌లో మూడుసార్లు వెంటిలేటెడ్ చికిత్స తీసుకుందని చెప్పారు. నెలకు, ఒక్కోసారి వారంలో రెండుసార్లు ట్యూబ్ మారుస్తుంటారని చెప్పారు. ఇంట్లోనే ఐసీయూ సెటింగ్ ఏర్పాటు చేశామని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు. తల్లిదండ్రులుగా పిల్లలు లేకుండా ప్రయాణాలు మానేశామని, పిల్లలకు అర్ధవంతమైన జీవితం ఏర్పరచడం, వారిని ఆనందంగా ఉంచడం, అలాంటి వాతావరణం కల్పించడం తమ బాధ్యతని చెప్పారు.
ప్రియాంక, మహిలను కళలు, సంగీతంలో తాము ప్రోత్సహిస్తున్నామని చంద్రచూడ్ చెప్పారు. ‘పిల్లలు చెస్ బాగా ఆడతారు. ఢిల్లీలోని సంస్కృత పాఠశాల్లో చదువుకుంటున్నా దురదృష్టవశాత్తూ దానిని కొనసాగించలేకపోయారు. హోం స్కూల్‌లో చదువు సాగుతోంది. వారి మంచిచెడ్డలన్నీ నా భార్య కల్పన చూసుకుంటోంది. ఇంట్లోనే పిల్లలతో ఎక్కువ సమయం గడింపేందుకు మేము ఇష్టపడతాం’ అని చెప్పారు.