కొంత మంది నాయకులు పార్టీ కంటే ఎక్కువగా నాయకుడిని అభిమానిస్తారు. వారు ఆ నాయకుడికి కట్టుబడిపోతారు. అలా వారితోనే తమ ప్రయాణం అనుకుంటారు. ఇక కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురైనపుడు ఆ పార్టీతో బంధం తెగినా వారు తమ ప్రియతమ నాయకుడిని మాత్రం బద్ధులుగా ఉంటారు. తాము ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఆ నాయకుడి యోగక్షేమాలు బలంగా కోరుకుంటారు. అలాంటి వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. ఆయన వైఎస్సార్ వైఎస్ జగన్ కి వీరాభిమాని. ఈ ఇద్దరి వల్లనే ఆయన రాజకీయాల్లో పదవులు అందుకున్నారు. వైఎస్సార్ ఆయనను జెడ్పీటీసీగా చేసి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా చేశారు. జగన్ అయితే ఆయనకు మూడు సార్లు టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. వీటికి మించి జగన్ అంటే దువ్వాడకు విశేషమైన అభిమానం అని అంతా చెప్పుకుంటారు.
ఇక జగన్ పుట్టిన రోజు తాజాగా వచ్చింది. ఆయనకు అందరూ అన్ని విధాలుగా పొగుడుతూ గ్రీట్ చేశారు. అదే పద్ధతిలో దువ్వాడ శ్రీనివాస్ కూడా ఒక వీడియో బైట్ వదిలారు. అందులో ఆయన జగన్ గురించి గొప్పగా చెప్పారు. వైఎస్ జగన్ హయాంలో విద్య వైద్యం వ్యవసాయంతో పాటు అనేక రంగాలు అభివృద్ధి పధంలో సాగాయని వెల్లడించారు. అంతే కాదు జగన్ అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించాడు అని కూడా కొనియాడారు. ఇక జగన్ మళ్ళీ రాజయోగం అందుకోవాలని దువ్వాడ కోరుకోవడం విశేషం. అంటే 2029 ఎన్నికల్లో జగన్ సీఎం కావాలని ఆయన బలంగా ఆశిస్తున్నారు అన్న మాట. ఇక ఈ వీడియో బైట్ ని ముగిస్తూ ఇట్లు మీ అభిమాని అని ఆయన పేర్కొన్నడం మరో స్పెషాలిటీ.
వైసీపీ నుంచి దువ్వాడను సస్పెండ్ చేసి చాలా కాలం అయింది. ఆయన మరే పార్టీలో ఇంతవరకూ చేరలేదు, పైగా జగన్ ని ఎక్కడా విమర్శించినది కూడా లేదు, జగన్ అంటే తనకు ఎంతో అభిమానం ఇష్టమని ఆయన పదే పదే చెబుతూ వస్తున్నారు. దీనిని బట్టి చూస్తే కనుక ఏదో నాటికి తిరిగి వైసీపీలో తాను చేరగలను అన్న నమ్మకం అయితే దువ్వాడలో ఉందని అంటున్నారు. జగన్ కి తనకూ మధ్య గ్యాప్ పెరగడానికి జిల్లాలోని వైసీపీకి చెందిన కొన్ని పెద్ద తలకాయలు కారణం అని ఆయన అనుమానిస్తూ వారికే విమర్శిస్తున్నారు. వారి మీదనే ఆయన కోపాన్ని ప్రదర్శిస్తున్నారు.
అయితే జగన్ జిల్లాలో ఆ పెద్ద తలకాయల మీదనే బాధ్యతలు మోపుతున్నారు. వారితోనే పార్టీని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. వారిని కాదని జగన్ దువ్వాడను తిరిగి పార్టీలోకి తీసుకోగలరా అన్నది కూడా చర్చగా ఉంది. అయితే దువ్వాడ మాత్రం వైసీపీ మీద అలాగే ప్రేమ ఉంచుకున్నారు అని అంటున్నారు. ఇక ఆయన అభిమానులు అయితే దువ్వాడ 2029 లో వైసీపీ తరఫున టెక్కలి నుంచి పోటీ చేస్తారని ఈసారి గెలిచి తీరుతారని జోస్యం చెబుతున్నారు. ఏది ఏమైనా దువ్వాడ రాజకీయం అయితే ఇప్పటికి క్రాస్ రోడ్ల మీదనే ఉంది అని అంటున్నారు. ఆయన జిల్లాలో ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు, ఆ వర్గంలో ఆయనకు పట్టు ఉంది. దూకుడుగా రాజకీయాలు చేస్తారు అని పేరు కూడా ఉంది. దాంతో ఆయనను వైసీపీ దూరం చేసుకుంటుందా అన్నది కూడా ఉంది. 2029 కి చాలా టైం ఉంది కాబట్టి ఆనాటికి ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే అని అంటున్నారు.
#Duvvada Srinivas


















