ఒక్కొక్క సారి సూచనలు.. సలహాలు కూడా ఎంతగానో కలిసివస్తాయనేందుకు తాజాగా ఏపీకి సంబంధించి జరిగిన ఓ కీలక పరిణామం సాక్షంగా నిలుస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రంలోని ముంబై వేదికగా.. ఇండియా మారి టైం-2025 సదస్సు జరుగుతోంది. ఇది ఈ నెల 27న ప్రారంభమైంది. 31వ తేదీ(శుక్రవారం)తో ముగి యనుంది. అయితే.. ఈ సదస్సులో జాతీయ అంతర్జాతీయ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.
ఇక, ఎక్కడ పెట్టుబడుల సదస్సులు జరిగినా.. ఎక్కడ పెట్టుబడి పెట్టేవారు ఉన్నారని తెలిసినా.. ఆ చాన్స్‌లను అస్సలు వదులు కోకుండా ముందుకు సాగుతున్న సీఎం చంద్రబాబు.. ఈ విషయంపై కూడా దృష్టి పెట్టారు. ఇంతలో మొంథా తుఫాను వచ్చింది. దీంతో ఈ విషయాన్ని ఆయన పక్కన పెట్టి బాధితు లకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు. అయితే.. అనూహ్యంగా గురువారం ఉదయం పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆయనను కలిశారు.
రెండు రోజుల కిందట ఇదే సదస్సులో తాము కుదుర్చుకున్న ఒప్పందం.. దీనికి సంబంధించిన విశేషాల ను ఆయన వివరించారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి.. “ఈ రోజు ఏ విషయంపై చర్చ జరుగు తోంది? ఏ రంగంలో పెట్టుబడులకు అవకాశం ఉంది.“ అని మంత్రిని అడిగారు. దీంతో ఆయన పోర్టులపై చర్చ జరుగుతోందని.. పోర్టుల నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉందని చెప్పారు. దీంతో హుటాహుటిన సీఎం చంద్రబాబు పరిశ్రమల శాఖ కార్యదర్శి, పోర్టుల వ్యవహారాలు చూసే అధికారిని అక్కడకు పంపించారు.
రాష్ట్రంలో కొన్నాళ్లుగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్న దుగరాజపట్నం పోర్టుకు సంబంధించి పెట్టుబడు లు వస్తాయేమో పరిశీలించాలన్నారు. దీంతో అధికారుల బృందం గురువారం మధ్యాహ్నానికి ముంబై చేరుకుని సదస్సుకు హాజరైంది. ఈ క్రమంలో దుగరాజపట్నం పోర్టుకు సంబంధించిన పెట్టుబడుల వ్యవహారాన్ని ప్రస్తావించింది. దీంతో విశాఖ పోర్టు అథారిటీ(కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ) ముందుకు వచ్చింది. దుగరాజ పట్నాన్ని తామే టేకప్ చేస్తామని.. 29 వేల 650 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడతామని చెప్పింది.
ఆ వెంటనే సీఎంతో మాట్లాడిన అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో దుగరాజ పట్నం పోర్టుకు మహర్దశపట్టనుంది. ఇదిలావుంటే.. చంద్రబాబు కనుక చివరి నిమిషంలో సూచన చేయకపోతే.. ఇది సాకారం అయ్యేది కాదని.. మంత్రి బీసీ చెప్పడం గమనార్హం.
 
			



















