గత కొంతకాలంగా భర్తలు వరుసగా హత్యలకు గురవుతున్న ఘటనలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. వీరిని బయటివాళ్లు ఎవరో కాదు.. కట్టుకున్న భార్యలే కడతేరుస్తున్నారు. ప్రియుడితో కలిసి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘దృశ్యం’ సినిమా తరహాలో భర్త మర్డర్ ప్లాన్ చేసింది అతడి భార్య. అనంతరం తనకంటే చాలా చిన్నవాడైన ప్రియుడితో కలిసి పరారైపోయినట్లు తెలుస్తోంది.
అవును… మళయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం’ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో వెంకటేష్ – మీనా నటించగా.. హిందీలో అజయ్ దేవగన్ – శ్రేయ నటించారు. ఆ సినిమాలో తమ కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తున్న పోలీసు అధికారి కొడుకును హీరో చంపి పాతి పెడతాడు. పాతి పెట్టిన చోటే పోలీసు స్టేషన్ కడతారు.
దీంతో… ఆ చనిపోయిన యువకుడి ఆచూకీ దొరకక అతడి తల్లి తండ్రులు నరకయాతన పడుతుంటారు. మరోవైపు తన కుటుంబాన్ని అతడి భారిన పడకుండా రక్షించుకున్నందుకు హీరో హ్యాపీ ఫీలవుతుంటాడు. ఈ తరహాలోనే తన భర్తను చంపి.. ఎవరూ గుర్తించలేని చోట పాతిపెట్టాలని అతడి భార్య భావించింది. అనుకున్నట్లుగానే పని మొదలుపెట్టింది. వివరాళ్లోకి వెళ్తే… మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఓ మహిళ హిందీలో ‘దృశ్యం’ సినిమా చూసిందో ఏమో కానీ… తన భర్తను చంపే విషయంలో ఇలాగే ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా.. ఆమె ప్రియుడి సహాయంతో తన భర్తను హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని వారి ఇంటిలోనే పాతిపెట్టింది. అనంతరం… ఆ ప్రదేశాన్ని ఎవరూ గుర్తించకుండా టైల్స్ తో కప్పేసింది.
ఆ ఘటన జరిగిన సుమారు రెండు వారాలు అయిపోయింది. మరోవైపు.. తన సోదరుడు కనిపించడం లేదని విజయ్ (35) సోదరులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అనుమానం బలపడటంతో సోమవారం ఉదయం విజయ్ కోసం సోదరులు అతని ఇంటికి వెళ్లారు. అయితే.. అప్పటికే అన్న భార్య కోమల్ (28) కనిపించడం లేదని తెలుసుకున్నారు. మరోవైపు పక్కింట్లోని 20 ఏండ్ల కుర్రాడు మోను కూడా కనిపించడం లేదు. కాస్తా ఆరా తీయగా… ఆ కుర్రాడితో కలిసి కోమల్ పారిపోయినట్లు తెలుసుకున్నారు. ఈ సమయంలో ఇంట్లోకెళ్లి చూడగా.. ఓ చోట ఫ్లోర్ టైల్స్ మిగిలిన వాటి రంగుతో సరిపోలడం లేదని గ్రహించారు. అనుమానం వచ్చి తేడాగా ఉన్న టైల్స్ ను తొలగించగా… ఒక్కసారిగా దుర్వాసన వచ్చింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. విజయ్ మృతదేహాన్ని టైల్స్ కింద పాతిపెట్టినట్టుగా కనుక్కున్నారు. ఇదే సమయంలో… ప్రియుడితో కలిసి అతడి భార్య కోమల్ హత్య చేసినట్టుగా గుర్తించారని అంటున్నారు. ప్రస్తుతం ఆమె కోసం గాలిస్తున్నారు.