అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన భారీ సుంకాలను తగ్గించే ఉద్దేశం లేదని స్పష్టంచేశారు. మంగళవారం వైట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన భారత్ వాణిజ్య విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు.
ట్రంప్ మాట్లాడుతూ “ఎన్నో ఏళ్లుగా భారత్ అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధిస్తోంది. మనం తెలివితక్కువగా తక్కువ టారిఫ్‌లు పెట్టడం వల్లే వారు ఇంతకాలం లాభపడ్డారు. దీని ఫలితంగా అమెరికాలో ఉత్పత్తి స్థాయులు దెబ్బతిన్నాయి. హార్లీ డేవిడ్‌సన్ వంటి పలు కంపెనీలు భారత్‌కు వెళ్లిపోయాయి. ఇప్పుడు వాటిని తిరిగి రప్పిస్తున్నాం” అని పేర్కొన్నారు.
భారత్ వాణిజ్య విధానాల కారణంగా అమెరికా తయారీదారులు భారీ నష్టాన్ని చవిచూస్తున్నారని ఆయన ఆరోపించారు. అమెరికా వస్తువులపై భారత్ 100 శాతం వరకు సుంకాలు విధిస్తోందని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని వ్యాఖ్యానించారు. “మనం భారత్‌తో పెద్దగా వ్యాపారం చేయడం లేదు కానీ, వారు మన మార్కెట్లో బలంగా ఉన్నారు. ఇది అసమాన వాణిజ్య సంబంధం” అని ట్రంప్ అన్నారు.
హార్లే డేవిడ్‌సన్ ఉదాహరణను ప్రస్తావిస్తూ అధిక సుంకాల కారణంగా ఆ సంస్థ భారత్‌లో ప్లాంట్ నిర్మించాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. కానీ తన వాణిజ్య విధానాల కారణంగా చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాల నుండి అనేక కార్ల కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నాయని ట్రంప్ వివరించారు.
ఇటీవల ట్రంప్ బహిరంగ కార్యక్రమాల్లో హాజరుకాకపోవడంతో, సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యం గురించి పుకార్లు వినిపించాయి. కొందరు ఆయన మరణించారంటూ పోస్టులు షేర్ చేయడం వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన ట్రంప్, అవన్నీ ఫేక్ న్యూస్ మాత్రమేనని స్పష్టం చేశారు. “నా ఆరోగ్యం బాగానే ఉంది. వచ్చిన వదంతులు అన్నీ అవాస్తవం” అని ఆయన తేల్చిచెప్పారు.