2025 దీపావళి పండుగ కానుకగా వివిధ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం వరకు దివాళీకి అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వని టాలీవుడ్ మేకర్స్.. కొంతకాలంగా మాత్రం మూవీలను రిలీజ్ చేస్తున్నారు. గత ఏడాది 100 శాతం స్ట్రైక్ రేట్ తో విజయాలు అందుకున్నారు. ఈసారి నాలుగు సినిమాలను విడుదల చేశారు.
ఈ ఏడాది సినీ దీపావళి సందడి అక్టోబర్ 16వ తేదీన మిత్రమండలి మూవీతో స్టార్ట్ అవ్వగా.. ఆ తర్వాత ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ తో పాటు సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా మూవీలు ఒకే రోజు విడుదల అయ్యాయి. అక్టోబర్ 18వ తేదీన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కె- ర్యాంప్ రిలీజైంది. మరి ఆ సినిమాల పరిస్థితి ఎలా ఉందంటే?
ఏ సినిమాకు కూడా బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా.. డ్యూడ్ మూవీ మాత్రం మంచి వసూళ్లతో సందడి చేస్తోంది. రిలీజ్ అయిన రెండు రోజుల్లో రూ.45 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఆదివారం రూ.10 కోట్లు పైగా సాధించినట్లు తెలుస్తోంది. తెలుగులో 37.43% ఆక్యుపెన్సీ నమోదైందని, అర్బన్ సెంటర్స్ లో రెస్పాన్స్ బాగుందని టాక్.
అయితే ఆ సినిమాతో పాటు రిలీజ్ అయినా తెలుసు కదా వీకెండ్ లో అనుకున్నంత స్థాయిలో వసూళ్లు సాధించలేదని తెలుస్తోంది. మొదటి రెండు రోజుల్లో రూ.3.94 కోట్ల వసూళ్లను సాధించిన మూవీ, మూడో రోజు రూ.1.75 కోట్లు మాత్రమే సాధించిందని వినికిడి. ఆదివారం నాడు తెలుసు కదా 23.49% ఆక్యుపెన్సీ నమోదు చేసిందని వినికిడి.
అదే సమయంలో కె- ర్యాంప్ మూవీ ఆదివారం రూ.2.85 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. 41.85% ఆక్యుపెన్సీ కూడా నమోదు చేసింది చెప్పాయి. అయితే ఓపెనింగ్స్ కన్నా ఆ నెంబర్స్ ఎక్కువ కావడం విశేషం. దీంతో డ్యూడ్ మూవీ తర్వాత కె- ర్యాంప్ ఎక్కువ వసూళ్లు, ఆక్యుపెన్సీ సాధిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఏదేమైనా ఫస్ట్ వీకెండ్ లో మాత్రం బాక్సాఫీస్ వద్ద డ్యూడ్ మూవీ డామినేషన్ చూపిస్తోంది. కె- ర్యాంప్ మెల్లగా ఎక్కుతోంది. వసూళ్లతో పాటు ఆక్యుపెన్సీ పెంచుకుంటోంది. మరిన్ని కలెక్షన్స్ సాధించేలా కనిపిస్తోంది. తెలుసు కదా సినిమా అన్ని విషయాల్లో భారీ పోటీని ఎదుర్కొంటోంది. అయితే ఈ రోజు దీపావళి హాలీడే.. దీంతో థియేటర్స్ కు ఆడియన్స్ వెళ్లి సందడి చేస్తారు. కాబట్టి నేడు ఏ సినిమా ఎంత వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.















