ఏపీలో ఇకపై 28 జిల్లాలు – ఈనెల 31న గెజిట్ నోటిఫికేషన్..
జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త జిల్లాలు..
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జిల్లాల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ మరింత సులభతరం కానుందని ప్రభుత్వం అభిప్రాయపడింది.
కేబినెట్ నిర్ణయం మేరకు కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఈ కొత్త జిల్లాలతో కలిపి ప్రస్తుతం 26గా ఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లాల సంఖ్య 28కి పెరగనుంది. జిల్లాల పునర్విభజనకు సంబంధించిన తుది గెజిట్ నోటిఫికేషన్‌ను ఎల్లుండి విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అలాగే పరిపాలన మరింత సమర్థవంతంగా సాగేందుకు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రజలకు మరింత దగ్గరగా పాలన అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
జిల్లాల సరిహద్దుల మార్పుల్లో భాగంగా గూడూరు రెవెన్యూ డివిజన్‌ను తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో కలిపే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఇప్పటివరకు ఉన్న 26 జిల్లాల్లో ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలోని నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు కూడా ఆమోదం లభించింది.
ఈ పునర్విభజనలో భాగంగా
-
రాయచోటి నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పడనున్న మదనపల్లె జిల్లాకు మార్చేందుకు,
-
రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలో కలిపేందుకు,
-
రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాకు మార్చేందుకు
కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ మార్పులతో పాలనా సౌలభ్యం పెరుగుతుందని, ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లాల పునర్విభజనపై స్థానిక అవసరాలు, భౌగోళిక పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది.
జిల్లాల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన మరింత బలపడుతుందని, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.











