ప్రత్యక్ష నగదు బదిలీ పధకాలు ఇపుడు ఎంతో ఆకర్షణగా ఉన్నాయి. అంతే కాదు ఓట్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపునకు ఇది దగ్గర మార్గంగా చేసుకుని నేతాశ్రీలు భారీ ఎత్తున హామీలను గుప్పిస్తున్నారు. ఆ తరువాత వాటిని అమలు చేయలేక అప్పులు తెస్తున్నారు. అలా రాష్ట్రాలు అప్పులు కుప్పలుగా మారుతున్నాయి. ఖజానాకు చిల్లు పడుతోంది. కానీ రాజకీయమే గెలుస్తోంది. దాంతో అభివృద్ధిని పక్కన పెట్టి నగదు బదిలీ ప్రవాహం అలా సాగిపోతూనే ఉంది. ప్రారంభంలో ఒకటి రెండు రాష్ట్రాలకే పరిమితం అయిన ఈ వ్యవహారం కాస్తా ఇపుడు దేశంలోని సగానికి పైగా రాష్ట్రాలకు విస్తరించింది. దీంతో ఈ పెడ ధోరణులకు స్వస్తి పలకకపోతే ఆర్ధిక సంక్షోభం తప్పదని హెచ్చరికలు అయితే వస్తున్నాయి.
దేశంలో వివిధ పధకాలను రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్నాయి. చేతికి ఎముక లేకుండానే ఇదంతా సాగుతోంది. అంతే కాదు రేపు ఏమి జరుగుతుంది అన్నది కూడా చూసుకోకుండా ఎవరికి వారుగా జోరు చేస్తున్నారు. గెలవడమే ముఖ్యం. కుర్చీయే లక్ష్యం కాబట్టి దాని కోసమే చేయాల్సింది అంతా చేస్తున్నారు. ఇక మరీ ముఖ్యంగా తీసుకుంటే మహిళలు కేంద్రంగా అమలు చేస్తున్న నగదు బదిలీ పథకాలతో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయని టోటల్ గా కుప్ప కూలుతున్నాయని ఒక అధ్యయనంలో కఠిన వాస్తవాలు బయటపడుతున్నాయి.
ఆ మధ్య దాకా మిగులు బడ్జెట్ తో ఎంతో బాగా ఉన్న రాష్ట్రాలు సైతం ఇపుడు రెవిన్యూ లోటుతో దిగజారిపోతున్నాయని ఈ అధ్యయనం తేల్చింది. ఇదంతా కూడా పధకాల మహిమ అని కూడా స్పష్టం చేసింది. ఇదంతా ఇటీవల కాలంలోనే జరుగుతోంది అని అంటోంది. మూడు నాలుగేళ్ళ క్రితం వరకూ చూస్తే దేశంలో అక్కడో ఇక్కడో రాష్ట్రంలో మాత్రమే ఈ పధకాలు అమలు అయ్యేవి. అయితే దాని వల్ల ఓట్ల పంట పండుతోందని రాజకీయంగా ఎంతో బాగుందని గ్రహించిన మిగిలిన రాష్ట్రాలలోని రాజకీయ పార్టీలు కూడా అదే బాట పట్టాయి దాంతో ఆర్ధిక వ్యవస్థలు అన్నీ ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని ఆ అధ్యయనం పేర్కొనడం ఒక పెను సంకేతమే.
ఈ అధ్యయనం ప్రకారం చూస్తే ప్రస్తుత బడ్జెత్ లో ఈ రాష్ట్రాలు మొత్తం ఒక లక్షా 68 వేల కోట్ల రూపాయలు కేవలం పధకాలకే కేటాయిస్తున్నాయని లెక్క చెప్పింది పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే సంస్థ తన అధ్యయనం ద్వారా అని అంటున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఆర్ధికంగా ఊపిరి ఆడని స్టేజికి చేరుకున్నాయని కూడా ఈ నివేదిక తేటతెల్లం చేసింది.
ఇక సగానికి సగం రాష్ట్రాలు ఈ ఆర్ధిక సంవత్సరంలోనే రెవిన్యూ లోటుని నమోదు చేశాయని కూడా అసలు విషయం బయటపెట్టింది. ఇదంతా ప్రత్యక్ష నగదు బదిలీ పధకం పుణ్యమే అని అంటోంది. ఈ ధోరణి వల్ల ఆర్ధిక వ్యవస్థకు పెను భారం గా ఉందని దానిని సవరించుకోకపోయినట్లు అయితే భవిష్యత్తు చాలా ఇబ్బందిలో పడుతుందని కూడా హెచ్చరిస్తోంది. అయితే ఒక వైపు నివేదికలు ఇలా వస్తున్నా ప్రతీ ఎన్నికల్లో అలవి కాని హామీలు ఇస్తూ పోతున్నారు. అది అలాగే సాగుతోంది. ఇది ఆగేది ఉందా అంటే దానికి జవాబు ఎవరూ ఇప్పట్లో చెప్పలేరేమో.


















