వైసీపీ నాయకులకు `డిజిటల్ బుక్` ధీమా ఉందా? ఇటీవల మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. పార్టీ నాయకులను ఉద్దేశించి డిజిటల్ బుక్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. అన్యాయంగా వేధించిన అధికారులను ఎట్టి పరిస్థితిలోనూ ఊరు కునేది లేదన్నారు. డిజిటల్ బుక్‌లో నమోదైన వారిని ఎక్కడున్నా తీసుకువస్తామన్నారు. సప్తసముద్రాలు దాటి వెళ్లినా వెనక్కి తెచ్చి.. చట్టం ముందు నిలబెడతామని చెప్పారు. అంతేకాదు, రెడ్ బుక్‌ను మించిన స్థాయిలో డిజిటల్ బుక్ అమలు జరుగుతుందని తేల్చి చెప్పారు.
దీనిని తాజాగా ప్రారంభించారు. డిజిటల్ బుక్‌లో ఫిర్యాదులు నమోదు చేసే విషయంపై కార్యకర్తలు, నాయకులకు శిక్షణ శిబిరాలను కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. ఈ బుక్‌లో నమోదైన ఫిర్యాదులపై కౌంటర్ ఫాయిల్ ఇస్తున్నారు. ఎప్పుడు ఏఘటన ఎక్కడ జరిగింది? ఫిర్యాదు ఏంటి? ఎవరు హింసించారు? ఆ అధికారి ఎవరు? ఏం చేశారు? ఇలా అనేక అంశాలను పొందుపరిచారు. ప్రతి విషయాన్నీ నమోదు చేస్తున్నారు. అంతేకాదు.. నమోదు చేసిన వారికి రసీదు కూడా ఇస్తున్నారు. దీంతో వైసీపీ నాయకులకు డిజిటల్ బుక్‌పై ధీమా ఏర్పడింది.
డిజిటల్ బుక్ ద్వారా తమ సమస్యలు వివరించేందుకు.. తమకు జరిగిన అన్యాయాలు నమోదు చేసేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలకు అవకాశం ఏర్పడింది. తద్వారా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తమను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటారని జగన్‌పై వారు ఆశలు పెట్టుకున్నారు. అయితే.. ఇక్కడ రెండు అంశాలు కీలకంగా మారాయి. 1) వైసీపీ అసలు అధికారంలోకి రావడం: ఇది వాస్తవం. ఏ బుక్‌లో నమోదు చేసినా.. అసలు వైసీపీ అధికారంలోకి వస్తే తప్ప.. ప్రయోజనం లేదు. ఈ విషయంపై భరోసా ముఖ్యం. ప్రస్తుతం అలాంటి భరోసా ఎక్కడా కనిపించడం లేదు. పైకి మాత్రం వస్తామని అంటున్నారు.
చట్టం-న్యాయం-కోర్టుల: ఒకవేళ జగన్ చెబుతున్నట్టుగా వైసీపీ ప్రభుత్వమే ఏర్పడినా.. ఇష్టానుసారంగా డిజిటల్ బుక్‌ను అమలు చేసేందుకు అవకాశం ఉండదు. ఎందుకంటే.. ప్రస్తుతం రెడ్ బుక్ అమలు చేస్తున్నామని ప్రభుత్వం స్వయంగా చెబుతోంది. మంత్రి లోకేష్ పదే పదే చెబుతున్నారు. తడిచిపోతోంది! అంటూ. వైసీపీ నాయకులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, ఇదేసమయంలో హైకోర్టు తీవ్రస్థాయిలో పోలీసులపై నిప్పులు చెరుగుతోంది. అరెస్టు చేసిన వారిని వదిలేయాలని చెబుతోంది. సో.. రేపు వైసీపీకి కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుందన్నది పరిశీలకులు చెబుతున్న మాట.