ఉత్తరాంధ్రలోని కీలకమైన జిల్లా శ్రీకాకుళం. ఆ జిల్లాకు కేంద్రంగా ఉన్నది శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం. రాజకీయంగా చాలా ప్రాముఖ్యత కలిగిన ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఇపుడు అయోమయంగా ఉంది. ఇక్కడ ఇంచార్జిగా మాజీ మంత్రి ధర్మాన ప్రసారావు ఉన్నారు. ఆయన ఉన్నారు అంటే ఉన్నారు కానీ ఫుల్ సైలెంట్ గానే ఉన్నారు. ఎన్నికల్లో ఓటమి తరువాత ఆయన ఎక్కడ బయటకు వచ్చి పార్టీ పరంగా మట్లాడింది పెద్దగా లేదు అని అంటున్నారు.
మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం ఆయన అనుభవం. ఒక గ్రామ సర్పంచ్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ప్రసాదరావు చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు. ఆ మీదట మంత్రి కూడా అయ్యారు. ఇక ఆయన ఇప్పటికి అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నాలుగు సార్లు మంత్రిగా కీలక బాధ్యతలు చూశారు. ఆయన రాజకీయ జీవితంలో అధిక భాగం కాంగ్రెస్ తోనే సాగింది. 2014 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2014, 2019 2024లలో వరుసగా మూడు సార్లు పోటీ చేస్తే ఒక్కసారి మాత్రమే గెలిచారు. ఇక 2024 ఎన్నికల తరువాత ఆయన ఆలోచనలు మారుతున్నాయని అంటున్నారు.
ఆరున్నర పదుల వయసు దాటిన ప్రసాదరావు తన రాజకీయ జీవితం మీద పూర్తి సంతృప్తిగా ఉన్నారు. అయితే తన కుమారుడిని రాజకీయ వారసుడిగా ముందుకు తేవాలని చాలా కాలంగా ఆయన ఆలోచిస్తున్నారు. ధర్మాన రాం మనోహర్ నాయుడు ప్రసాదారావు మంత్రిగా ఉన్నపుడు రాజకీయంగా చురుకుగా వ్యవహరించారు. నిజానికి 2024 ఎన్నికల్లో ఆయనకే టికెట్ ని ప్రసాదరావు కోరారు. అయితే జగన్ ప్రసాదరావునే పోటీ చేయమని చెప్పడంతో ఆయన అన్య మనస్కంగానే పోటీకి దిగారు అని నాడు చెప్పుకున్నారు. భారీ ఓట్ల తేడాతో ఓటమి చెందడం పట్ల కూడా ఆయన ఆవేదనతో ఉన్నారని అంటున్నారు.
ఇక ప్రసాదరావు జనసేన వైపు చూస్తున్నారు అని అంటున్నారు. తన కుమారుడిని ఆ పార్టీలోకి పంపించి తాను రాజకీయంగా విరమణ చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. కాదూ కూడదు అనుకుంటే తాను కూడా ఆ పార్టీలో చేరి కుమారుడికి అండగా ఉండాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రసాదరావు పార్టీ కార్యక్రమాల మీద పెద్దగా శ్రద్ధ చూపించడం లేదని అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు అని అంటున్నారు. అయితే జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన సోదరుడు క్రిష్ణదాస్ తమ్ముడికి పార్టీలో యాక్టివ్ కమ్మని సూచించారు అని అంటున్నారు. కానీ ప్రసాదరావు మాత్రం మౌన ముద్ర వీడడం లేదని చెబుతున్నారు.
ఇక ఈ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. తమ పార్టీలో ఉంటూ వేరే పార్టీలో అవకాశాల కోసం చూసే నాయకులకు ఆ చాన్స్ ఇవ్వకూడదని తాడో పేడో తేల్చుకోవాలని హై కమాండ్ భావిస్తోంది అని అంటున్నారు. దనతో ప్రసాదరావు ప్లేస్ లో ఇంచార్జిగా కొత్త నేతను బరిలోకి దింపాలని చూస్తున్నారు అని అంటున్నారు. పార్టీ ఇప్పటికే గత పదిహేను నెలలుగా ఎలాంటి కార్యకలాపాలు లేకుండా ఉందని ఇంకా ఇలాగే చేస్తే దెబ్బ తింటుందన్న ఆందోళన హై కమాండ్ లో ఉందని అంటున్నారు. అందుకే తొందరలోనే శ్రీకాకుళానికి కొత్త ఇంచార్జి వస్తారని అంటున్నారు. మరి ఆ కొత్త ఇంచార్జి ఎవరు ఏమిటి అన్నది త్వరలోనే తెలుస్తుందని చెబుతున్నారు.