జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ ఫ్యూచర్ పొలిటికల్ ప్లాన్ పై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురం శాసనసభ్యుడిగా ఉన్న పవన్.. తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతోపాటు జనసేన పార్టీకి బలమైన పునాదులు వేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం గోదావరి జిల్లాలను తన రాజకీయ క్షేత్రానికి కేంద్రంగా మార్చుకునేలా అడుగులు వేస్తున్నారని చర్చ జరుగుతోంది. ఇటీవల పవన్ తీసుకున్న నిర్ణయాలను గమనిస్తే.. ఆ ఫ్యూచర్ ప్లాన్ మారిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలిచిన పవన్ ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంటానని ప్రకటించారు. అయితే గెలిచి ఏడాదిన్నర అవుతున్నా, పవన్ పిఠాపురం చుట్టపు చూపుగానే వస్తున్నారని చెబుతున్నారు. పిఠాపురంలో ఇప్పటికీ ఆయన సొంత ఇల్లు నిర్మాణం పూర్తికాలేదు. గెలిచిన వెంటనే పిఠాపురంలో పవన్ సుమారు 18 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇందులో తన ఇల్లుతోపాటు పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు కొనసాగుతున్నాయి. దీంతో పవన్ పిఠాపురం అప్పుడప్పుడు వచ్చి వెళ్లిపోతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ ఎక్కువగా రాజధాని అమరావతి నుంచి హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తున్నారు. వారంలో ఒక రోజు హైదరాబాద్ వెళుతున్న పవన్.. ఇకపై పిఠాపురం నియోజకవర్గానికి సమయం కేటాయించాలని చూస్తున్నారని అంటున్నారు.
పిఠాపురంలో పవన్ కొన్న భూమికి అనుకునే మరో 3 ఎకరాల భూమిని సైతం పవన్ కొనుగోలు చేయనున్నారని చర్చ జరుగుతోంది. ఇకపై తన రాజకీయానికి పిఠాపురమే కేంద్రం చేసుకోవాలని భావిస్తున్న పవన్.. కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా ఇక్కడ పార్టీ కార్యాలయంతోపాటు తనను కలిసేందుకు వచ్చే కార్యకర్తలకు మౌలిక వసతులు కూడా ఉండేలా వసతి గదులు నిర్మించాలని భావిస్తున్నారని చెబుతున్నారు. రానున్న రోజుల్లో పిఠాపురం, మంగళగిరిలో ఎక్కువ సమయం గడపాలన్న ఆలోచనతో ఉన్న పవన్… పిఠాపురంలో ఉన్నప్పుడు నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రత్యేక గదులు, వారి వాహనాలకు పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారని అంటున్నారు.
ఇలా పిఠాపురంలో అన్నిరకాలుగా కార్యాలయంతోపాటు కార్యకర్తల విడిది భవనాల నిర్మాణానికి పవన్ ప్రయత్నించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు. గోదావరి జిల్లాల్లో జనసేనకు బలమైన సామాజికవర్గం మద్దతు ఉంది. ఈ బలం చెక్కుచెదరకుండా ఉండాలంటే ఆ వర్గం వారికి దగ్గరగా ఉండాలే సూచనలు వస్తున్నాయి. ఈ విషయంపై పవన్ కూడా ఏకీభవిస్తున్నారని అంటున్నారు. ఏ రకంగా చూసిన గోదావరి జిల్లాల్లో జనసేన బలంగా ఉంటేనే కూటమి ప్రభుత్వం రెండు మూడు టర్ములు కొనసాగే పరిస్థితి ఉందని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసం గోదావరి జిల్లాల్లో ఉన్న 32 నియోజకవర్గాల్లో పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అంటున్నారు. దీంతో పిఠాపురాన్ని తన రాజకీయ క్షేత్రానికి కేంద్రబిందువు చేసేలా పవన్ అడుగులు వేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.


















